ముందస్తు అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదు-మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య, నారాయణ కళాశాలల ముందస్తు అడ్మిషన్లకు ప్రారంభం చేసిందని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే జిల్లాల్లో పిఅర్ఓలను పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారని, అధికారులు, ప్రభుత్వం కార్పొరేట్ కళశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ నాయకుల సమావేశంలో మచ్చ రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు తమ కళాశాలలో ప్రవేశం పొందాలని గ్రామాల్లో తిరుగుతున్నారని దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆకళాశాలల్లో విద్యార్థులు మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల కోసం తిరుగుతున్న కార్పొరేట్ కళాశాలకు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం కోసం త్వరలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రమేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు రామారావు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిడిపల్లి హేమంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కనకం రాహుల్, తదితరులు పాల్గొన్నారు.