`పాలక మండలి పరువు తీసిన నరేష్ ను సాగనంపండి.
`బోర్డు సభ్యుడి బలుపు మాటలు!
`బోర్డు సభ్యుడు ఆధిపత్యం కోసమా!
`బోర్డు సభ్యులు భక్తులకు సేవకులు!
`భక్తులకు సేవ చేయడం కోసమా!
`రెండేళ్ల పదవికే అంత అహంకారమా!
`దేవదేవుని ముందు అందరూ సమానమే!
`తక్షణమే నరేష్ కుమార్ ను తప్పించాలని భక్తుల డిమాండ్.
`టిటిడి ఉద్యోగిపై సభ్యుడి పెత్తనమేమిటి?
`విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలసత్వమేమిటి!
`తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఉద్యోగికి ఆ అవమానమేమిటి?
హైదరాబాద్,నేటిధాత్రి:
వాటీస్ దిస్ నరేష్ నాన్సెన్స్.. తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలి సభ్యుడై వుండి ఉద్యోగి బాలాజీపై నోరు పారేసుకోవడం ఎంత వరకు సమంజసం. ఒక ఉద్యోగి విధి నిర్వహణను అభినందించాల్సిన సమయంలో ధర్డ్ క్లాస్ నా కొడకా..అని బూతులు తిట్టే అదికారం ఎవరిచ్చారు. అసలు పాలక మండలి సభ్యుడంటే భక్తులకు సేవ చేసే సేవకుడు మాత్రమే. పెత్తనం చేసే పెత్తందారు కాదు. భక్తులకు సౌకర్యాల కల్పనలో, దేవదేవుని సేవలో తరించాల్సిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగిపై నోరు పారేసుకోవడాన్ని భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తన కర్తవ్యాన్ని నిబద్దతతో నిర్వహిస్తున్న ఉద్యోగిని అభినందించాల్సిందిపోయి, నోటికొచ్చినట్లు ఇష్టాను సారం మాట్లాడడాన్ని ఎవరూ స్వాగతించరు. వెంటనే నరేష్ ఆ ఉద్యోగికి క్షమాపణ చెప్పాలి. టిటిడి ఉద్యోగులు నరేష్ కుమార్ మీద పోలీసు కేసు నమోదు చేయాలి. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పాలకమండిలోకి తీసుకునేపప్పుడు ఇకపై వారి వ్యక్తిత్వాలేమిటి? వారి వ్యవహార శైలి ఎలాంటిది అని కూడా ఇకపై పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. టిటిడి బోర్డు సభ్యుడి పదవీ కాలం కేవలం రెండేళ్లు మాత్రమే. నరేశ్‌కుమార్ పాలకమండలికి శాశ్వతసభ్యుడు కాదు. ఆయనకు ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. అయినా పాలక మండలి నిర్ణయాలను నరేశ్ ఉల్లంఘించడమే తప్పు. అందరికీ ఆదర్శంగా వుండాల్సిన సభ్యుడు తనకు ఉద్యోగి సూచనలు కూడా అవమానంగా భావించడం అతని అహంకారానికి నిదర్శనం. ఎప్పుడో నెలకోసారో..వచ్చి చుట్టపు చూపుగా వచ్చినట్టు, తనకు ఎనలేని అధికారాలు టిటిడి కట్టబెట్టినట్లు ప్రవర్తించడం సరైంది కాదు. ముందుగా ఎట్టిపరిస్దితిల్లోనూ నరేశ్ ఉద్యోగి బాలాజీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే పాలకమండలి తీర్మాణం చేసి సభ్యత్వం రద్దు చేయాలి. ఈ విషయంలో మరో ఆలోచనకు ప్రభుత్వం తావివ్వకూడదు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే తిరుమలతో విధి నిర్వహణ అంటే ఎంతో కష్టతరమైన పని. వాళ్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. వేలాది మంది భక్తులకు సేవ చేసి ఆ ఉద్యోగులు తరిస్తుంటారు. అలాంటి ఉద్యోగిపై చేయి చేసుకోవడమే కాకుండా, ఇష్టాను సారం బూతులు తిట్టడం అంటే బోర్డు సభ్యుడిగా నరేష్ ఎంత మాత్రం అర్హడు కాదు. ప్రతి క్షణం గోవింద నామ్మస్మరణతో అలరాలే పవిత్రమైన స్ధలంలో బోర్డు సభ్యుడు ఉద్యోగిపై చిందులు తొక్కడం. నోటికొచ్చిన పదజాలం వాడడాన్ని భక్తులు సహించలేకపోతున్నారు. నిజానికి అక్కడ వున్న భక్తులు ఎవరో వీడియో తీయడం వల్ల ఇదంతా బైట పడిరది లేకుంటే, ఆ ఉద్యోగికి నరకం చూపించేవారు. ఆ ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్ చేసేవారు. ఆయనపై కేసు కూడా నమోదు చేసి ఆ ఉద్యోగికి నకం చూపించేవారు. అంతటి ఘనులే కొంత మంది పాలక మండలి సభ్యులు. సభ్యులకు తోడు విజిలెన్స్ అధికారులు కూడా వీవీఐపిల సేవల్లో తరించి పోతుంటారు. తిరుమలలో విజిలెన్స్ అదికారుల సేవలు కూడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. అందుకే వాళ్లు కూడా పెద్ద వాళ్ల సేవల్లో మునిగితేలుతుంటారు. వారికి సేవలు చేసి, లాభం పొందుతుంటారు. అసలు తప్పు చేసిన నరేష్‌కు నచ్చజెప్పాల్సిన విజిలెన్స్ అధికారులు ఉద్యోగి బాలాజీని పక్కకు నెట్టేశారు. ఆయనను దూరంగా తీసుకెళ్లారు. తన కర్తవ్య నిర్వహణలో నిజాయితీ చూపించిన బాలాజీ అక్కడినుంచి తలవంచుకుని పోయేలా చేశారు. ఇదేనా పాలక మండిలిలో చేసిన తీర్మాణం.. అంత మంది భక్తుల మందుకు ఆ ఉద్యోగిని పంపించేయండి? అంటూ విజిలెన్స్ అదికారులను ఆదేశించడం ఏమిటి? ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు పక్కకు తీసుకెళ్లడమేమిటి? అసలు ఆ ఉద్యోగి బాలాజీ చేసిన నేరమేమిటి? వెంకన్న సన్నిదిలో అందరూ ఒక్కటే. తిరుమల కొండకు చేరుకున్న తర్వాత పేద, పెద్ద అన్న తేడా వుండకూడదు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరూ సమానమే. ఆ విషయం కూడా తెలియని వ్యక్తికి బోర్డు సభ్యత్వం కల్పించడమే తప్పు. దర్శనం పూర్తయిన తర్వాత ఎవరైనా సరే మహాద్వారం నుంచి వెళ్లకూడదని పాలకమండలే తీర్మాణం చేసింది. అందుకు నరేశ్ కూడా అంగీకరించే మినిట్స్‌లో సంతకం చేశారు. అలాంటి వ్యక్తి నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తాడు. అలాంటి వ్యక్తి బోర్డు సభ్యుడిగా వుండడానికి అర్హుడే కాదు. అయినా బయోమెట్రిక్ దారిని కేటాయించిన సంగతి సదరు సభ్యుడికి తెలియందా? అంటే అందరూ వేరు…నేను వేరు అనుకున్నాడా? అలాంటి వారికి తిరుమలలో వుండే అర్హతలేదు. అక్కడ పెత్తనానికి అవకాశమే లేదు. నరేష్ చేసిన పని పాలక మండలి పరువు కూడా తీసినట్లైంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదం ఎదురుకాలేదు. కారణం సభ్యులకు కూడా పాలకమండలి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయలేదా? వారు అనుసరించాల్సిన, ఆచరించాల్సిన విధి విధానాలు చెప్పలేదా? పాలక మండలి సభ్యుడిగా వుండి నిత్యం టిక్కెట్లు అమ్ముకుంటున్నాడన్న అపవాదును ఇప్పటికే నరేష్ ఎదుర్కొంటున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన రోజు ఆయనతోపాటు కొంత మందిని దర్శనానికి తీసుకెళ్లిన నరేష్ వారి ముందు ఆధిపత్యం చెలాయించాలని చూశాడు. కాని బాలాజీ అడ్డుకున్నాడు. అయినా కొత్తగా ఏర్పాటైన బోర్డు సభ్యులందరూ బాలాజీ లాంటి సామాన్యమైన ఉద్యోగికి తెలియాలనేమీ లేదు. నరేశ్ లాంటి సభ్యులు రెండెళ్లకోసారి ఎంతో మంది మారుతుంటారు. ఎంత మంది బోర్డు సభ్యులను సాదారణ ఉద్యోగులు గుర్తుంచుకుంటారు. చూస్తుండగానే రెండేళ్ల పుణ్యకాలం ముగిసిపోతుంది. అంత దానికి నరేష్‌కు అంతటి మడిసిపాటు ఎందుకు? నరేష్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదు. పొరుగున వున్న కర్నాటకకు చెందిన బిజేపి నాయకుడు. సహజంగా బిజేపి నాయకులు సనాతన దర్మం. దేశం కోసం , ధర్మం కోసం అంటూ ముచ్చట్లు చెబుతుంటారు. హిందూమతోద్దరణ మాకు మాత్రమే సొంతమని చెప్పుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువై వున్న సప్తగిరుల మీదనే సాటి హిందువును దూషించడం నరేష్ తప్పు కాదా? ఒక ఉద్యోగిపై చేయి చేసుకోవడం నేరం కాదా? ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందిచాల్సిన అవసరం వుంది. ఇలాంటి సభ్యుడి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి సభ్యుడికి కొనసాగిస్తే, ఉద్యోగుల్లో కూడా అసహనం పెరిగిపోతుంది. రేపటి రోజు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. అయినా పాలక మండలి సభ్యుడికి ప్రత్యేక గౌరవాలు ఏమిటి? ఆయన ఒక సేవకుడు మాత్రమే. తిరుమలలో భక్తులకు సేవ చేసి జన్మ ధన్యం చేసుకోవాల్సిందిపోయి, దేవుడి దగ్గరే నేనుగొప్ప అనుకునేవారిని వెంకటేశ్వర స్వామి క్షమించడు. పాపం పండితేనే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతారు. ఈ విషయంలో టిటిడి చైర్మన్ స్పందించకపోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య జరిగిన తొక్కిసలాట సమయంలో అంత మంది భక్తులు చనిపోయిన సమయంలో భక్తుల యోగక్షేమాలు చూసుకోలేని నరేష్ ఎక్కడున్నారు. ఆ సమయంలో భక్తులకు ఎందుకు సేవ చేయలేదు. ఆయన భక్తులకు సేలందిస్తున్నట్లు ఎక్కడా వార్తలు వినిపించలేదు. అసలు ఆయన ఒక సభ్యుడన్న సంగతి చాలా మందికి తెలియదు. మరి అలాంటి వ్యక్తి పాలకమండలిలో చేరి నిత్యం ఎంతో మందిని దర్శనానికి పంపిస్తునట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలా టిక్కెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ముప్పై సంవత్సరాల పాటు తన ఉద్యోగ నిర్వహణలో భక్తులకు సేవలు చేసే ఉద్యోగి నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాని పాలక మండలి సభ్యులకు ఉద్యోగులు కట్టు బానిసలు కాదు. వారికి ఆత్మగౌరవం వుంటుంది. వారిని చులకన చేసి మాట్లాడడం ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా పవిత్రమైన తిరుమలలో వెంకన్నసన్నిధిలో కోపానికి తావు లేదు. అహానికి అసలే తావు లేదు. ధిక్కార స్వరాలు వినిపించకూడదు. ముల్లోకాలను ఏలే స్వామి ముందుకు నేను గొప్ప అనుకునే వారికి చోటు వుండకూడదు. ముఖ్యంగా మర్యాద లేని వ్యక్తులకు పాలకమండిలో చోటే వుండకూడదు.