అది గత ఎమ్మార్వో చేసిన తప్పు..ఇప్పుడు నేను సరి చేయాలంటే సమయం కావాలి.?
ఐనవోలు మండల ఎమ్మార్వో “విక్రమ్ కుమార్” వింత సమాధానం!
రైతుబంధు నిధులు దుర్వినియోగం చేసిన కాఫీ అధికారికంగా
![Inavolu mro vikram kumar](https://netidhatri.com/wp-content/uploads/2025/02/IMG-20250211-WA0003.jpg)
కంచె చేను మేస్తే? సవరించాల్సిన వాళ్లే సా… గదీస్తున్నారు.
పాత సార్ ఎక్స్(ప్రె)స్ వేగంలో పాస్ బుక్ ఇచ్చిండు.
కొత్త సారు కొంత కాలం ఎదురు చూడాల్సిందే అంటున్నారు.
రికాం(ర్డ్) లేని తిరుగుడులో తప్పేవరిధి? తప్పించేదేవరు?
ఆక్రమ పట్టాదారుల ఆగడాలను అడ్డుకొనేదెవరు?
వేల రూపాయల రైతుబంధు నిధులను దుర్వినియోగం.
30 సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు.
ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువ ఉన్న సాకుతో ఆ…. పట్టా.
రైతు భరోసా రద్దుచేశాం,పట్టారద్దుకు చర్యలు తీసుకుంటాం.
“నేటిధాత్రి” ఐనవోలు,
భూరికార్డుల్లో ఉన్న అవకతవకలు సరిచేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అవినీతిని రూపుమాపి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం తీసుకోచ్చినదే ధరణి యాప్. ఐతే రాజులు తల్చుకుంటే దెబ్బలకు కొదువేముంది అన్న నాణుడి తరహాలో ధరణి లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారులు కొత్త తరహా అవినీతికి తెర లేపుతున్నారు. తప్పుగా నమోదైన ఆర్.ఎస్. ఆర్ రికార్డ్ ను సవరించాల్సిన తహసీల్దార్ అదే ఆ లొసుగును ఆసరాగా చేసుకొని మోఖా మీద లేని రైతుకు కేవలం ఖాతా నెంబర్ ద్వారా రికార్డ్ లో ఎక్కువగా ఉన్న భూమికి పట్టాదారు పాస్ బుక్కులు జారీ చేసి తనదైన మార్క్ చూపించారు.పూర్తి వివరాల్లోకి వెళితే… హనుమకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి రాజుకు సర్వేనెంబర్ 194 లో ఒక ఎకరం 24 గుంటల వ్యవసాయ భూమి కలదు. ఈ భూమిని రాజు తాత ఐన కట్కూరి కట్టయ్య 1983లో ఒక ఎకరం 1990లో 24 గుంటలుగా మొత్తం 1-24 ఎకరాల భూమి అసలు పట్టాదారుడు ఐన యాకయ్య మరియు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఖరీదుకు కొనుగోలు చేసినాడు.అప్పటినుండి దాదాపుగా 40 సంవత్సరాల నుండి అదే భూమిలో వ్యవసాయం చేస్తూ జీవించాడు. తన తాత తధనంతరం వారసత్వంగా వచ్చిన భూమిని రాజు 2011 సం. లో ఒక ఎకరా తన పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ బుక్కులు పొంది ఉన్నాడు. మరియు 2018లో 24 గుంటల భూమికి సాధా బైనామా ద్వారా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ బుక్ పొందాడు. 194 సర్వే నెంబర్లో తాను ఒక్కడే రైతు తాను సాగులో ఉన్న భూమి మొత్తానికి ప్రస్తుతం పట్టా కలిగి ఉన్నాడు. ఇట్టి భూమిని గతంలో రాజు ఎవరికి అమ్మలేదు ఎవరు కొనుగోలు చేయలేదు.
ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువ ఉన్న సాకుతో ఆ…. పట్టా
అయితే ఇదే సర్వేనెంబర్ 194 లో మోకాపై ఎలాంటి భూమి లేకుండా కేవలం ఆర్.ఎస్.ఆర్ రికార్డుల్లో అదనంగా ఒక ఎకరం భూమి తప్పుగా చూపిస్తూ సోల్డ్ అవుట్ అని పాత పట్టాదారుని ఖాతా నెంబర్ 226 తో ఒక ఎకరం ఎక్కువగా తప్పుడు రికార్డ్ అయ్యింది. అట్టి విషయాన్ని బాధితుడు అప్పుడే స్థానిక తహసీల్దార్ కి పిర్యాదు చేయగా విచారణ జరిపిన స్థానిక వి.ఆర్.ఓ ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువగా ఉన్నట్టు ఆ భూమిని తొలగించాలని నివేదిక ఇచ్చారు. అయితే తర్వాత వచ్చిన తాహశీల్దారు ఇవేవి పట్టించుకోకుండా 2022 సంవత్సరంలో ఎలాంటి ఆధారాలు లేకుండా, విచారణ చేయకుండా, కనీసం పాత లింక్ డాక్యుమెంట్ రికార్డులు పరిశీలించకుండా ‘సత్య’ వంతులైన కొందరి సూచనలతో పట్టా చేసినారు. కానీ అప్పటికే కట్కూరి రాజు సంబంధీకులు మోఖాలో ఉండి సాగులో ఉన్నారు.ఆ విషయం తహసీల్దార్ విచారణ చేయకుండా ఆ అక్రమ పట్టా చేయడం ద్వారా ఇప్పటివరకు అనర్హుడైన రైతు దాదాపు 20 వేల రూపాయలు రైతుబంధు రూపేణా ప్రజల సొమ్మును అప్పనంగా లబ్ది పొందడం కొసమెరుపు. మరి అన్ని వేల రూపాయల ప్రజాధనం మళ్ళీ రికవరీ చేస్తారో లేదో వేచి చూడాలి.. అన్ని ఆధారాలు ఉండి రెవెన్యూ అధికారుల తప్పిదాలతో భూములు ఎక్కక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు తహసీల్దార్ ల చుట్టూ తిరిగితే అంతా ధరణి మయంలో ఉంది మాకు అధికారం లేదు అని చెప్పే రెవెన్యూ అధికారులకు ఇది ఎలా సాధ్యం అయినట్లు?..
ఇదిలా ఉండగా అక్రమ పట్టా తొలగించాలని ప్రస్తుత తహసీల్దార్ ను బాధితులు ఆశ్రయించగా ప్రస్తుతం ఉన్న ధరణి యాప్ లో అలాంటి అధికారం నాకు లేదు అని చెబుతున్నట్లు తెలుస్తోంది.
30 సార్లు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు..
ధరణిలో ఉన్న లొసుగులు ఆధారంగా చేసుకొని తహసీల్దార్ సాయంతో తాను సాగుచేసున్న భూమి ని అక్రమంగా పట్టా చేయించుకున్నారని బాధిత రైతు 2022 నుండి ఇప్పటివరకు 30 సార్లు కలెక్టర్ లాంటి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా, పిర్యాదు చేసినప్పుటి నుంచి ముగ్గురు కలెక్టర్లు మారారు తప్ప మాకు న్యాయం జరుగలేదు. ప్రస్తుత కలెక్టర్ కి కూడా పిర్యాదు చేస్తే మండల గర్ధవర్ మండల సర్వేయర్లతో విచారణ చేయగా వారు పొందిన పట్టా అక్రమం అని తేల్చి పట్టా తొలగించాలని నివేదిక ఇచ్చినా గాని ఉన్నత అధికారులు కాలయాపన చేస్తున్నట్టు బాధితులు తెలిపాడు. నాపై మరియు మా కుటుంబ సభ్యులపై అక్రమ పట్టాదారులు దాడులు చేసి దౌర్జన్యంగా ఆస్తి నష్టం చేసినారని అట్టి విషయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ కి మూడుసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది.తప్పు చేసిన అధికారి ధర్జాగా అధికారం అనుభవిస్తూ ఉంటే ఏ తప్పు చేయని మేం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇంతవరకు ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు.
బాధిత రైతు కట్కూరి రాజు కొండపర్తి
రైతు భరోసా రద్దుచేశాం,పట్టారద్దుకు చర్యలు తీసుకుంటాం.
ఇదే విషయం పై స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్ ను నేటిధాత్రి ప్రతినిధి వివరణ కోరగా..
కొండపర్తి గ్రామంలో సర్వే నెంబర్ 194 లో స్థానిక రైతు కట్కూరి రాజు మోఖ మీద ఉన్నట్టు విచారణలో తేలింది. ఐతే అదే సర్వే నెంబర్ లో ఒక ఎకరం భూమి ఆర్. ఎస్. ఆర్ ప్రకారం ఎక్కువగా నమోదు అయ్యింది. అట్టి విషయం పై బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపించాం. సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కి పంపించటం జరుగుతుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన పిమ్మట ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..
విక్రమ్ కుమార్
తహసీల్దార్ ఐనవోలు మండలం.