*ప్రభుత్వ పథకాలపై, వాటి అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
*పేద బడుగు బలహీన బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీసీ కార్పొరేషన్ నుండి అర్హులైన బీసీలకు రుణాలు అందిస్తున్నాం.
*ఖాదీ వస్త్రాలు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించి ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించాలి.
*రాష్ట్ర బీసీ సంక్షేమ,ఆర్థిక వెనుకబడిన తరగతుల మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత.
తిరుపతి(నేటి ధాత్రి)ఫిబ్రవరి08:
బిసిల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, అధికారులు ప్రభుత్వ పథకాలపై,వాటి అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలనీ, పేద బడుగు బలహీన బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీసీ కార్పొరేషన్ నుండి అర్హులైన బీసీలకు రుణాలు అందిస్తున్నామని, ఖాదీ వస్త్రాలు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించి ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ,ఆర్థిక వెనుకబడిన తరగతుల మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శాఖాపరమైన సమీక్ష సమావేశం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు బీసీ సంక్షేమ, బీసీ కార్పొరేషన్, చేనేత జౌళి శాఖ, ఆప్కో అధికారులతో నిర్వహించారు.
మొదటగా తిరుపతి జిల్లా నందు బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు ప్రభుత్వం విడుదల చేసిన 85.5 లక్షల రూపాయలకు అదనంగా జిల్లా కలెక్టర్ సహకారంతో నిధులను చేకూర్చుకుని అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ బిసి ప్రీ-మెట్రిక్ వసతి గృహాలలోని పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించే దిశగా హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ట్యూటర్స్, జిల్లా అధికారులు కృషి చేయాలని మరియు పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ డైట్ సమకూర్చాలని ఆదేశించారు.ఈ విద్యా సంవత్సరానికి వసతి గృహాలకు సమకూర్చిన 20 ఇన్వర్టర్లతో పాటుగా అన్ని వసతి గృహాలకు ఇన్వర్టర్లు సరఫరా చేయాలని సమీక్ష సమావేశంలో నేరుగా రాష్ట్ర అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.
బీసీ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వము అందజేస్తున్న సబ్సిడీ రుణాల గురించి విరివిగా ప్రచారం చేసి బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
చేనేత జౌళి శాఖ అధికారులతో సమీక్షిస్తూ ప్రభుత్వ పథకాలను కింద స్థాయి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించడానికి సదరు పథకాలపై అవగాహన కొరకు ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి ఖద్దరు వస్త్రాలు ధరించే విధంగా ఆరోగ్య, అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికార అధికారి చంద్రశేఖర్,బీసీ కార్పొరేషన్ కార్యనిర్వహణ అధికారిని శ్రీదేవి, చేనేత జౌళి శాఖ ఏడి వరప్రసాద్, తిరుపతి జిల్లా ఆఫ్కో అధికారి ఎన్ కోటేశ్వరరావు, బిసి సంక్షేమ డివిజనల్ అధికారులు జోత్స్న, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు మరియు పర్యవేక్షకులు సాయి తిరుమంగళం తదితరులు పాల్గొన్నారు.