నర్సంపేట,నేటిధాత్రి
నర్సంపేట ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎల్ గౌతం, బి.అనసూయ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన “ఇంపార్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ట్రైబల్ స్టూడెంట్స్ ఫర్ తెలంగాణ” శిక్షణ కార్యక్రమంలో భాగంగా హాజరై నెల రోజుల రెసిడెన్షియల్ కోర్సు విజయవంతంగా ముగించుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అభినందించారు.అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇంగ్లీషు విశ్వభాషగా మారిందని ఆంగ్ల భాష నైపుణ్యాలు సంపాదించడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందుతారని చెప్పారు.ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలోని డిగ్రీ కళాశాలల గిరిజన విద్యార్థులకు తొలిసారిగా నిర్వహించిన ఇంగ్లీష్ భాష నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేట ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికై విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చినందుకు టి ఎస్ కే సి కోఆర్డినేటర్ ఇంగ్లీష్ విభాగం అధిపతి ఎంఎంకె రహిముద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ కమలాకర్,అధ్యాపకులు అభినందించారు.