నిండా ముంచిన అతి పబ్లిసిటీ
-దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలపై ఐ.టి.దాడులు
-కొంపముంచిన పుష్పా2 డైలీ అప్డేట్లు
-‘తగ్గేదే లే’ అంటున్న ఐ.టి. అధికార్లు
-మరోసారి వార్తల్లోకి చిత్రపరిశ్రమ
-దాడులతో నిజాలు బయటకు వస్తాయా? మరో వివాదమవుతుందా?
-అధారాలు లేకుండా ఐ.టి.దాడులుండవు
-నోరు మెదపని ఐ.టి. అధికార్లు
హైదరాబాద్,నేటిధాత్రి:
టాలీవుడ్లో ఆదాయపు పన్ను దాడులు జరుగుతుండటం ఒకింత అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లపై మంగళవారం ప్రారంభమైన దాడులు బుధవారం కూడా కొనసాగుతుండటం విశేషం. ఇంత ఆకస్మికంగా ఉరుములేని పిడుగు మాదిరిగా ఈ ఐ.టి.దాడులకు కారణమేంటనేది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కాకపోతే ఇటీవలి కాలంలోపుష్ప`2, ప్రపంచ వ్యాప్తంగా రూ.1734.65 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించిందంటూ ప్రచారం కావడం, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్లపై ఎప్పటికప్పుడు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయా చిత్రాల నిర్మాణ సంస్థల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు తదితర ఆర్థిక అంశాల వివరాలను సేకరించి పన్ను చెల్లింపులో నిజాయతీగా వ్యవహరిస్తున్నారా? లేదా? అనే అంశంపైనే ఈ దా డులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవచ్చునంటున్నారు. పుష్ప`2 ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా, సినిమా విడుదల కాకముందే వెయ్యికోట్ల బిజినెస్ చేసిందని గొప్పగా చెప్పడం, కలెక్షన్లపై డైలీ అప్డేట్లు వంటి ఒవర్ యాక్షన్లు, సినిమాకు ప్రేక్షకుల మాట ఎట్లా వున్నా ఐ.టి.శాఖవారికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినట్లయింది. ‘ఓవర్ పబ్లిసిటీ ఎప్పటికీ ప్రమాదమే’ అన్న సత్యాన్ని పుష్ప`2 మరోసారి రుజువు చేసింది.మీడియా వార్తలను బట్టి చూస్తే 55 ఐ.టి.టీమ్‌లు నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఒకే సారి ఈ దాడుల్లో పాల్గంటున్నట్టు తెలుస్తోంది. బయటకు వెల్లడిరచని లావాదేవీలను వెలికి తీయడం కూడా ఈ దాడులకు ప్రధాన లక్ష్యం కావచ్చు. విచిత్రమేమంటే గతంలో బాహుబలి, పుష్ప`1 వంటి అనేక చిత్రాలు భారీ బడ్జెట్‌తో తీసినవే. అప్పట్లో కూడా ఎప్పటికప్పుడు వాటి వసూళ్లపై వార్తలు వచ్చాయి. మరి ఆదాయపుపన్ను శాఖ అప్పట్లో స్పందించలేదు! ని జం చెప్పాలంటే టాలీవుడ్లో చిత్రం విడుదల సమయం నుంచి ఆదాయాలపై మీడియాకు లీకులివ్వడం ఒక అలవాటుగా మారిపోయింది. తమ చిత్రాల కలెక్షన్లకు మరింత బూస్టప్ ఇచ్చుకోవడానికి సినీ నిర్వాహకులు ఈ వ్యాపార టెక్నిక్‌ను ఉపయోగిస్తూ వచ్చారని భావించవచ్చు. ఈవిధంగా బయటకు ప్రకటించే కలెక్షన్ల వివరాలు, నిజమైన వసూళ్లకు పొంతన వుండదని, వసూళ్లలో మతలబు కేవలం నిర్మాతలకు మాత్రమే తెలుస్తుందని చెబుతుంటారు. అయితే ఎంతో కాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పుడే ఈ దాడులు జరపడంలో అంతరార్థమేంటనేది ఇంకా వెల్లడికావాల్సి వుంది.
ప్రస్తుతం ఐ.టి.దాడులు ఏ ఒక్కరిపైనో పరిమితం కావడంలేదు. ప్రముఖులందరి ఇళ్లపై దాడు లు జరుగుతున్నాయి. మొట్టమొదటగా దాడుల విషయంలో పేర్లు పైకి వచ్చింది దిల్ రాజు, మె ౖత్రీ మూవీ మేకర్స్. దిల్‌రాజు ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వున్నా రు. ఇటీవల మైత్రీమూవీ మేకర్స్ తీసిన చిత్రం పుష్ప`2 బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిం చింది. వీరి ఆధ్వర్యంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (అజిత్‌కుమార్ హీరో), ‘జాట్’ (సన్నీడియోల్) వంటి భారీ చిత్రాలు నిర్మాణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరి ఆర్థిక లావాదేవీల పారదర్శకతపై అనుమానంతో ఈ దాడులు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజం చెప్పాలంటే పుష్ప`2 విడుదల సందర్భంగా సంధ్య ధియేటర్ సంఘటన తర్వాత చిత్రపరిశ్రమ ఒక రకమైన అస్థిరతను ఎదుర్కొంటున్నదనే చెప్పాలి. ఈ తొక్కిసలాట సంఘటన తర్వాత సినీ పరిశ్రమ పెద్దలను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లడంలో దిల్‌రాజు కీలకపాత్ర పోషిం చారు. అంతేకాదు వివాదం సర్దుమణిగేలా చేయడంలో కూడా విజయం సాధించారు. ఇదిలా వుండగా అంతకుముందు యదేచ్ఛగా రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్షోలు వేసుకోవడం వంటి అంశాల్లో ఏవిధమైన ఇబ్బంది లేకుండా తమ వ్యాపారాన్ని సజావుగా నడుపుకున్న చిత్రమపరిశ్రమ నిర్వాహకులను సంధ్య థియేటర్ సంఘటన పెద్ద కుదుపునకు లోను చేసిందనే చెప్పాలి. సంక్రాంతికి ముందు విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నా, డాకూ మహరాజ్ వంటి సినిమాల విడుదల గతంలో సంక్రాంతి విడుదల సమయాల్లో చేసినంతటి హడావిడి కనిపించ కుండానే తెరపైకి వచ్చేశాయి. మొత్తంమీద చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఐ.టి. దాడులు సినీపరిశ్రమ భవితవ్యాన్ని డోలాయమానంలోకి నెట్టేస్తాయనడంలో సందేహం లేదు. డబ్బుపై నడిచే ఈ రంగుల ప్రపంచంపై, ఐ.టి.దాడులు తాత్కాలికంగానైనా దాని గమనాన్ని నిదానింపజే స్తాయక మానవు. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా సాధిస్తున్న బాక్సాఫీసు విజయాలు సహజంగానే ఐ.టి.శాఖ దృష్టిని ఆకర్షించి వుండవచ్చు. ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడికావు. కొంత సమయం పడుతుంది. మరి ఈ దాడులు సినీపరిశ్రమలో చోటుచేసుకునే ఆర్థిక అవకతవకలను బయటపెడతాయా లేక ఇది మరో వివాదానికి దారితీస్తుందా అనేది తెలియాలంటే వేచిచూడక తప్పదు.
దిల్ రాజుకు (వి.వెంకటరమణారెడ్డి) చెందిన రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. మొదటిది గేమ్ ఛేంజర్ (రామ్‌చరణ్ హీరో) కాగా రెండవది సంక్రాంతికి వస్తున్నాం (వెంకటేష్ హీరో). ఈ రెండిరటిలో గేమ్ ఛేంజర్ బాక్సాఫీసు వద్ద చతికిల పడినా, సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నట్టు వార్తలు తెలుపుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వరా మూవీ క్రియేషన్స్’ బ్యానర్‌పై మంచి హిట్ చిత్రాలు నిర్మించారు. దిల్, ఆర్య, బమ్మరిల్లు, శతమానంభవతి వంటి చిత్రాలు మైలురాళ్లనదగ్గ విజయాలు సాధించాయి. శాకుంతలం చిత్రాన్ని సమంత రుతు ప్రభుతో కలిసి నిర్మించారు. ఫ్యామిలీస్టార్ కూడా ఈయన నిర్మించిందే. ఈ రెండు చిత్రాలు చిత్రపరిశ్రమలో దిల్రాజును ఒక దిగ్గజంగా నిలబెట్టాయి.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలను రవిశంకర్ యలమంచిలి, నవీన్ యర్నేనిలు స్థాపించారు. మంచి విజయవంతమైన చిత్రాలను తీసి, విజయం ‘అలవాటు’గా మారిన స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. పుష్ప`2 విజయవంతంతో ఈ సంస్థ ప్రాభవం బాగా పెరిగింది. అంతకుముందు రంగస్థలం, జనతాగ్యారేజ్ వంటి విజయవంతమైన చిత్రాలు ఈ నిర్మాణసంస్థ నుంచే వచ్చాయి. భవిష్యత్తులో ఈ సంస్థ అజిత్ కుమార్, పవన్‌కళ్యాణ్, రిషభ్‌శెట్టి వంటి నటులతో చిత్రాల నిర్మాణం చేపట్టే పనిలో వుంది. ఇదిలావుండగా మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
ఐ.టి. దాడులు ఇప్పుడు గాయని సునీత భర్త రామ్ వీరపనేనికి చెందిన మ్యాంగో మీడియాపై కూడా కొనసాగాయి. ఈయన దిల్‌రాజు వ్యాపార భాగస్వామి. వరుసగా రెండోరోజు బుధవారం పుష్ప`2 దర్శకుడు సుకుమార్ ఆఫీసులు, ఇంటిపై కూడా ఐ.టి. దాడులు జరిగాయి. పుష్ప`2కు సంబంధించి భారీ రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటాలు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విమానంలో హైదరాబాద్‌లో దిగిన వెంటనే అధికార్లు ఆయన్ను రై టింగ్స్ ఆఫీసు, ఇంటికి తీసుకెళ్లారు.ఆదాయపుపన్ను శాఖ దాడులు హైదరాబాద్‌లో చాలావరకుతగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం అధికార్లు దాడులు చేస్తున్నారంటే పన్ను ఎగవేతకు సంబంధించి స్పష్టమైన ఆధారాలుండటమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐ.టి.దాడులు ఊరికే చేయడు. స్పష్టమైన ఆధారాలతో తమపని కానిచ్చేస్తారు. అటువంటి ఆధారాలు లేకపోతే ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్’నుంచి వీరికి దాడులకు అనుమతి లభించదు!