https://epaper.netidhatri.com/view/488/netidhathri-e-paper-20th-jan-2025%09
-కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు
-ఏక కాలంలో రెండు అనూహ్య పరిణామాలు
-భవిష్యత్తు టిడిపికి లోకేష్‌తోనే నవశకం
-కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్ పాదయాత్ర దోహదం
-పార్టీకి పూర్వ వైభవం తేవడంలో లోకేష్ పాత్ర ఎంతో కీలకం
-మంత్రిగా లోకేష్‌కు గతంలోనే సుదీర్ఘ అనుభవం
-పాలనా పరంగా డైనమిక్ మినిస్టర్
-తెలుగు దేశం మరో వందేళ్ళు బతకాలంటే లోకేష్ సిఎం కావాలి
-ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ లోకేష్ సిఎం కాలేరు
-ములాయం సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
-అఖిలేష్‌ను ముఖ్యమంత్రి చేసినట్లుగా లోకేష్‌ను సిఎం చేయాలి
-కేసిఆర్ చేసిన తప్పు చంద్రబాబు చేయొద్దు
-సోనియా గాంధీకి ముందు చూపు లేకపోవడం వల్లనే రాహుల్ ప్రధాని కాలేదు
-తెలంగాణలో కేటిఆర్ పరిస్థితి చూస్తున్నాం
-జాతీయ స్థాయిలో రాహుల్ పడుతున్న కష్టం చూస్తూనే వున్నాం
-అవకాశం వున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత ఎంత మధనపడినా ఫలితం వుండదు
-చంద్రబాబు జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించాలి
-చంద్రబాబు కనుసన్నల్లో లోకేష్ రాటుదేలాలి
-ఆనాడు చంద్రబాబు సిఎం కాకపోతే తెలుగు దేశం ఇప్పటి దాకా వుండేది కాదు
-ఇప్పుడు లోకేష్‌ను సిఎం చేయకపోతే భవిష్యత్తులో తెలుగు దేశం గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు
-కూటమిలో లుకలుకలు రాకముందే లోకేష్‌ను సిఎం చేయాలి
-చంద్రబాబు జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలి
హైదరాబాద్,నేటిధాత్రి:
ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నవ శకం రానున్నది. యువతరానికి ఎనలేని ప్రాధాన్యత దక్కనున్నది. తెలుగుదేశం పార్టీ మరో వందేళ్ల చరిత్రకు పునాది పడనుంది. భవిష్యుత్తు తరాలలో కూడా తెలుగుదేశం పార్టీ చెరగని ముద్ర వేసేందుకు అడుగులు వేయనుంది. అందుకు ముందడుగుగా ఏపి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్ త్వరలో ముఖ్యమంత్రి పదవిలో కొలువదీరబోతున్నారు. ఇది విశ్వసనీయ సమాచారమే కాదు. పక్కా సమాచారం కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యసభకు వెళ్లే అవకాశం వుంది. అంతే కాకుండా ఎన్డీయేలో కేంద్ర ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది. కుప్పం స్దానానికి రాజీనామా చేసి, నారా బ్రాహ్మణిని కుప్పం ఎమ్మెల్యే చేసే ఆలోచనలు చేస్తున్నారు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు..అన్నట్లు ఈ ఉగాదికే ముహూర్తం ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం తమ్ముళ్లు మంత్రి లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇది క్రమంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడగడానికి ఒక సంకేతం. రాజ్యాంగ పరంగా అటు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఆరో వేలు లాంటిది. కేవలం పేరుకే ఉప ముఖ్యమంత్రి మాత్రమే. అదనంగా వుండే అదికారాలు ఏమీ వుండవు. గతంలోనూ కూడా సామాజిక సమీకరణాల నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. దాని వల్ల ఒరిగేదేమీ వుండదు. అదనంగా ప్రొటోకాల్ కూడా వుండదు. సభలు, సమావేశాలలో పిలుచుకునేందుకు మాత్రమే ఉపయోపగపడుతుంది. ఉప ముఖ్యమంత్రి పదవి చేపడిన తర్వాత ముఖ్యమంత్రి పదవే అన్నదానికి ఎలాంటి నిబందన లేదు. నిబద్దత కూడా ఎక్కడ వుండదు. అయినా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీని దృష్టిలో వుంచుకొని లోకేష్‌కు ముఖ్యమంత్రి పదవి బాద్యతలు అప్పగిస్తే అనేక అధ్భుతాలు చూడొచ్చు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. ఆయనకు వున్న అనుభవంతో అమరావతి నిర్మాణాన్ని చాలెంజ్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా రాదు. కాని యువ నాయకుడు భవిష్యత్తు తరాలకు వారదిగా నిలవాల్సిన లోకేష్ ఇప్పటికే పాలనపై ఎంతో పట్టు సాదించారు. కార్యకర్తలను ఎంతో గొప్పగా సమన్వయం చేస్తున్నారు. యువతకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. పెద్దఎత్తున యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అటు పార్టీ మీద పట్టు, ఇటు పాలనాపరమైన అనుభవం కూడా పూర్తి స్ధాయిలో సాదించారు. ఇక భవిష్యుత్తులో పార్టీకి భరోసాగా, అమరావతి లాంటి గొప్ప నిర్మాణాన్ని లోకేష్ చాలెంజ్‌గా తీసుకొని పూర్తి చేస్తే వచ్చే యాభై ఏళ్ల వరకు లోకేష్ నాయకత్వం ప్రజలు కోరుకుంటుంటారు. నిరంతర రాజకీయ స్రవంతిలో వెలుగుతూ వుంటారు. ఒక్కసారి దేశంలోని రాజకీయ చరిత్ర నాయకుల నిర్ణయాలను అవలోకనం చేసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు తమ వారసులను ముఖ్యమంత్రులుగా పదవుల అప్పగించడం వల్ల పార్టీలు ఇంకా మనుగడలో ఉన్నాయి. ముందు తెలుగుదేశం పార్టీ స్ధాపకుడు ఎన్టీఆర్ తర్వాత ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకముందే, ఆ పార్టీని కాపాడిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఆ కఠిన మైన నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ ఉత్తుంగతరంగం వుండేది కాదు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ మరో వందేళ్ల చరిత్ర కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం నలభైఏళ్లుగా అప్రతిహతంగా వెలుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అదికారంలోకి రాగలిగింది. లేకుంటే తెలుగుదేశం పార్టీ ఒకటుండేదని చెప్పుకోవాల్సి వచ్చేది. భవిష్యత్తులో కూడ మరో వందేళ్ల ప్రస్తానం తెలుగుదేశం పార్టీ కొనసాగించాలంటే ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడం ఒక్కటే పరిష్కారం. ముఖ్యమంత్రులుగా పనిచేసిన బలమైన నాయకులు ముందు చూపుతో కొంత మంది నాయకులు తీసుకున్న నిర్ణయాల మూలంగా ఆయా రాష్ట్రాలలో ఆ పార్టీలు ఒ వెలుగు వెలుగుతున్నాయి. జాతీయ పార్టీలను తట్టుకొని నిలబడుతున్నాయి. హర్యానాలో ఐఎన్‌డిఎల్( ఇండియన్ నేషనల్ లోక్‌దళ్) దేవీలాల్ కుమారుడు ఓం ప్రకాశ్ చౌతాల కూడా ముఖ్యమంత్రి కాగలిగారు. జార్ఖండ్ ముక్తి మోర్చ శిబూ సోరెన్ కుమారుడు హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పలు మార్లు పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ ముందు చూపుతో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేశారు. దాంతో ఆ పార్టీ ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్‌లో బిజేపిని బలంగా డీకొడుతూ వుంది. బలమైన ప్రాంతీయ పార్టీగా వెలుగొందుతోంది. ఇలా కాకుండా ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొందరు నాయకులు తమ వారసులకు ముఖ్యమంత్రి పదవి అప్పగించపోవడం వల్ల ఇబ్బందులు పడిన పార్టీలు కూడా వున్నాయి. అయితే రాజకీయాలంటే ఆ గతం వేరు..ఇప్పుడు వేరు. గతంలో సైద్దాంతిక విబేదాలు మాత్రమే రాజకీయాల్లో వుండేవి. అవి ఇప్పుడు వ్యక్తిగత విభేదాల దాకా వెళ్తున్నాయి. ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని అణిచివేసే రాజకీయాలు సాగుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా పలు మార్లు పనిచేసిన కరుణానిధి ఆయన బతికున్నప్పుడు, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే వారసులకు ఆ పదవి అప్పగించకపోవడం వల్ల తర్వాత తరం ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో చూస్తూనే వున్నాం. నిజానికి స్టాలిన్ గత ఇరవై ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి కావాల్సింది. కాని కరుణానిధికి ముందు చూపు లేకపోవడం మూలంగా స్టాలిన్ సుధీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. 50 ఏళ్లలో కావాల్సిన ముఖ్యమంత్రి 70 సంవత్సరాల వయసులో పదవిని అందుకున్నాడు. యువతరంలో ఆయనకు వున్న ఆలోచనలు, ఆశయాలు అన్నీ ఆవిరి అయిన తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన చిరకాల కోరిక ఇంత కాలానికి తీరిందని సంతోషపడాలో, ఇంత కాలానికి ముఖ్యమంత్రి అయినా సాధించిన పేరు ఏమీ లేకుండాపోయింది. స్టాలిన్ కుమారుడికి కూడా ఇదే పరిస్ధితి ఎదురయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డిఎంకే గెలిస్తే తప్ప స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ముఖ్యమంత్రి కాలేరు. ఒక వేళ రానున్న ఎన్నికల్లో డిఎంకే ఓడిపోతే, మళ్లీ డిఎంకే ఎప్పుడు అదికారంలోకి వస్తుందో ఎవరూ చెప్పలేరు. గతంలో సోనియా గాంధీ అదే పొరపాటు చేశారు. యూపియే1లో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేసినా, 2009లో యూపిఏ2 సమయంలో రాహుల్ గాంధీని ప్రదాని చేస్తే బాగుండేది. బిజేపి ఇంతగా పుంజుకుంటుందని అంచనా వేయలేదు. ఒక వేళ ఒక దఫా బిజేపి అధికారంలోకి వచ్చినా, ఐదేళ్ల తర్వాత మళ్లీ మనదే అధికారం అని అతివిశ్వాసంతో సోనియా గాంధీ ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే వున్నాం. వచ్చే ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. అలాగే తెలంగాణలో కూడా కేసిఆర్ ఇదే అతివిశ్వాసంతో కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయలేదు. మళ్లీ మనదే అదికారం అనుకొని కలలు గని నిండా మునిగారు. బిఆర్ఎస్ శ్రేణులంతా కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఎంత ఒత్తిడి చేసినా కేసిఆర్ వినిపించుకోలేదు. పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం లేదు. బిజేపి కాచుకొని కూర్చున్నది. మరో నాలుగేళ్ల వరకు పరిస్ధితులు ఎలా వుంటాయో చెప్పలేం. రేవంత్‌రెడ్డి ఈ నాలుగేళ్లలో ఇచ్చిన హమీలను అమలు చేస్తే, బిఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్కు కనీసం ఒక్క సీటు కూడా ఇచ్చేందుకు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. పదేళ్ల పాటు అదికారంలో వున్న బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్ధానానికి చేరింది. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా కేటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశంలేదు. అదే కేటిఆర్‌ను గతంలోనే ముఖ్యమంత్రిని చేస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఆయన స్ధానం మరోలా వుండేది. అందుకే లోకేష్‌ను ఎంత తొందరగా ముఖ్యమంత్రిని చేస్తే తెలుగుదేశం పార్టీకి అంత మంచింది.