లయన్స్ క్లబ్ జిల్లా రెండవ ఉపగవర్నర్ లయన్ సుధాకర్ రెడ్డి.
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
ఉన్నత చదువులతో పాఠశాలతో పాటు తల్లిదండ్రుల పేరు నిలపాలని లయన్స్ క్లబ్ జిల్లా రెండవ ఉపగవర్నర్ లయన్ సుధాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.దుగ్గొండి మండలంలోని నాచనపల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం థౌజండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ హరికిషన్ రెడ్డి సౌజన్యంతో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పరీక్ష ప్యాడ్స్ అందజేశారు.ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా రెండవ ఉపగవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ ను ఉపయోగించుకుని విద్యార్థులు కష్టపడి చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. క్లబ్ అధ్యక్షులు లయన్ చొప్పరి సోమయ్య మాట్లాడుతు క్లబ్ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలలో అవసరార్థులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత లయన్ పరికిపండ్ల వేణు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షల్లో విజయం సాధించాలని అనేక మెలకువలను విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మధుసూదన్, శ్రీను, గీత, సుమలత ,సుధీర్, మాధవరావు ,కమల, మాధవి,వెంకన్న, ప్రదీప్ పాల్గొన్నారు.