మృతదేహాన్ని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్
ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
ఆందోళనతో దిగివచ్చిన ఆస్పత్రి నిర్వాహకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ధనదాహం కారణంగా బాధిత కుటుంబం మృతదేహం కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది.తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడనే బాధలో ఆ కుటుంబాన్ని టచ్ హాస్పిటల్ నిర్వాహకులు మరింత ఇబ్బందులకు గురి చేశారు.బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం… కాగజ్‌నగర్‌కు చెందిన కొంగ శ్రీనివాస్ (50)కు మంగళవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతడిని మంచిర్యాలలోని టచ్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.పెషంట్ పరిస్థితి సీరియస్ గా ఉందని వెంటనే చికిత్స చేయాలంటూ రూ.1.80 లక్షల ప్యాకేజీ కుదుర్చుకున్నారు.వెంటనే సదరు వైద్యశాల నిర్వాహకులు బాధిత కుటుంబం నుంచి రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు.ఆ తర్వాత చికిత్స ప్రారంభించారు.చికిత్స ప్రారంభమైన గంటలోపే శ్రీనివాస్ మృతి చెంది చనిపోయాడు.అయితే మృతదేహాన్ని ఉదయం తీసుకెళ్లేందుకు హాస్పిటల్ సిబ్బంది అనుమతిచ్చారు. బుధవారం ఉదయం బాధిత కుటంబం హాస్పిటల్ నిర్వాహకులను సంప్రదించారు. బిల్లు రూ.4.50 లక్షలు దాకా అయ్యిందని,మిగతా రూ. మూడు లక్షలు చెల్లించాకే మృతదేహాన్ని అప్పగిస్తామని హాస్పిటల్ యాజమాన్యం బాధిత కుటుంబానికి స్పష్టం చేసింది.ఈ హాస్పిటల్ నిర్వాహకుల తీరుతో కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీరు మున్నీరుగా విలపించారు.అసలే మనిషి చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉంటే.. హాస్పిటల్ నిర్వాహకులు ఒక్క పూట చికిత్సకు లక్షల్లో బిల్లు వసూలు చేయడం ఏమిటని ఆవేదన చెందుతున్నారు. డబ్బులు ఇచ్చే దాకా మృతదేహాన్ని ఇవ్వమని దవాఖాన నిర్వాహకుల తెగేసి చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు.దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనగా,చివరకు ఇరువైపులా జరిగిన చర్చల అనంతరం దవాఖాన యాజమాన్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది.ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.నెల రోజుల వ్యవధిలో ఇదే హాస్పిటల్ లో ఇలాగే ఇద్దరు రోగులు చనిపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లా వైద్య శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైద్యశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.