
కరీంనగర్, నేటిధాత్రి:
ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన వ్యవసాయ కూలీలందరికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి సంవత్సరం పన్నేండు వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూమిలేని వ్యవసాయ కూలీలకు పన్నేండు వేల రూపాయల చొప్పున ఆర్ధిక భరోసా కల్పిస్తామనే ప్రకటించిన పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తొలి విడుత ఆరువేలు మరొక విడుత ఆరువేలు రూపాయలు చెల్లింపులు కాకుండా ఒకేసారి పన్నేండు వేల రూపాయలు చెల్లించాలని, తొలి విడతలో వందరోజులు ఉపాధిహామీ పనులు పూర్తి చేసిన వారికి ఇవ్వాలని ఆలోచించడం సరైంది కాదని, కొన్ని గ్రామాల్లో జాబ్ కార్డులు కలిగిన కూలలీలందరికి వంద రోజులు పని కల్పించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కొన్ని అనివార్య పరిస్థితితుల్లో కూలీలు పనికి పోకుండా ఉన్నారని దీనివల్ల వారికీ నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ కూలీలకు వంద రోజుల పని దినాలు కాకుండా రెండు వందల రోజులు పని కల్పించే విదంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తద్వారానే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరుతుందని, ఈపరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కార్డు కలిగిన వ్యవసాయ కూలీల, చిన్న సన్నకారు రైతులందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పనులపై అదారపడి జీవనం కొనసాగిస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయ కూలిని పరిగణలోకి తీసుకొని ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ కూలీలందరికి ఈపథకాన్ని వర్తింప చేయాలని సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.