రైతుల పంటల్ని దోచుకునేందుకే నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం
రైతు హక్కుల ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలి
ఎస్ కే యం ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నూతన పాలసీ పత్రాల దగ్ధం – భారీ నిరసన
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు దోచుకునేందుకు వీలుగా కేంద్ర నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని ఇది దేశ వ్యవసాయానికి వాస్తవ సాగుదారులకు ప్రజలకు ఎంతో హానికరమని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్, జిల్లా కన్వీనర్లు ఈసంపల్లి బాబు,సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు,చిర్ర సూరి అన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు.నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాలను దగ్ధం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎస్కేయం జిల్లా కన్వీనర్ కుసుంబ బాబురావు అధ్యక్షతన నిరసన కార్యక్రమంలో పెద్దారపు రమేష్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను అమలు చేయమని కనీస మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చి ఆచరణలో దొడ్డిదారిన అవే నల్ల చట్టాల అమలుకు పూనుకుంటున్నారని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానమని, కార్పొరేట్ శక్తులకు పెట్టుబడుదారులకు వ్యాపారులకు మార్కెట్ వ్యవస్థను అప్పగించడమే వారి ఉద్దేశమని తద్వారా ప్రస్తుత ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థను నీరుగార్చి రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అప్పనంగా దోచుకోవడానికి వీలు కల్పించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. చావు తప్పి కళ్ళు లొట్టబోయిన రీతిన ప్రజలు తీర్పునిచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోకపోగా మరింత పదును పెట్టి దేశ వ్యవసాయాన్ని, రైతులను సంక్షోభంలోకి నెట్టే విధానాల రూపకల్పనకు ప్రయత్నిస్తున్నదని కనీస మద్దతు ధర చట్టానికి హామీ ఇచ్చి నేటికీ అమలుకు పూనుకోకపోవడం సిగ్గుచేటని ఈ తరుణంలో గత చారిత్రాత్మక రైతాంగ ఉద్యమ బాటలో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం ప్రారంభమైందని అట్టి రైతాంగ ఉద్యమంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ రైతు ఉద్యమకారులను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపారని ఎస్కేయం జాతీయ నాయకుడు జగత్ సింగ్ దలైవాల 28 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కనీసం రైతు సంఘాలతో చర్చలు జరపాలనే స్పృహ కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం ఆవేదన కలిగిస్తుందని ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలకి స్వస్తి పలికి రైతుల పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని చేసి ఉత్పత్తి ఖర్చులను తగ్గించి దేశాన్ని కాపాడాలని లేకపోతే రైతాంగ ఉద్యమం క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. వెంటనే నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, పంజాబీ సరిహద్దుల్లో రైతుల పోరాటంపై అనిచివేతను ఆపాలని, గ్రేటర్ నోయిడా జైల్లో ఉన్న రైతు నాయకులను విడుదల చేయాలని, రైతు సంఘాలతో తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్కేయం జిల్లా నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, సుధమల్ల భాస్కర్,వల్లందాస్ కుమార్, కొత్తూరి ఇంద్రసేన,ఐతం నాగేష్, సింగతి మల్లికార్జున్,ఓదెల రాజన్న, మైదం పాణి,బండి కుమార్,ఎండి బషీర్,ఆరూరి కుమార్,ఎగ్గెని మల్లికార్జున్,మాలి ప్రభాకర్, అప్పనపురి నరసయ్య,బొల్లు ఎల్లయ్య,చేరాలు తదితరులు పాల్గొన్నారు.