విపక్షాలకు వాటి శైలిలోనే సమాధానం
పార్టీపై పట్టు, విపక్షాల నియంత్రణతో ముందుకు
ఎక్కడికక్కడే పట్టిష్టమైన వ్యూహం
హైడ్రా, మూసీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
పదినెలల్లో 50వేల ఉద్యోగాలు
పరిణిత రాజకీయాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉత్సాహ పూరిత వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 1`9 తేదీల మధ్య విజయోత్సవాలను నిర్వహిస్తోంది. 2023 డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ విజయోత్సవాల సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నవంబర్ 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతు సదస్సు, డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించబోయే బహిరంగసభ, నిరుద్యోగ యువత సమావేశం, నియామక పత్రాల జారీ, డిసెంబర్ 7 ,9 తేదీల మధ్య ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, హుస్సేన్‌సాగర్ ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో సాంస్కృతిక, కళారూపాల ప్రదర్శన, అదేవిధంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ.
దూకుడుగా ఎదురుదాడి
రేవంత్ రెడ్డి విపక్షాలను ఎదుర్కొనడానికి మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గత నెలలో వరంగల్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన భారాసా అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని పదునైన విమర్శలకు దిగారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి ప్రజలను మరింత తాగుడుకు అలవాటు చేశారని విమర్శిచడమే కాదు, ఒక దశలో బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్లు క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వుంటే కేసీఆర్ ‘తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా’ మారారంటూ ఘాటుగా విమర్శించారు. కేటీఆర్, హరీష్‌రావులు భారాసా తరపున దూ కుడుగా వ్యవహరిస్తూ, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో రేవంత్ అంతకంటే ‘కటువైన’ పదజాలాన్ని వాడటం ద్వారా తిప్పికొట్టడానికి యత్నిస్తున్నారనడానికి ఈ వరంగల్ సభ ఒక ఉదాహరణ. ఇదే సమయంలో 2024, ఆగస్ట్ 15వ తేదీలోగా తాము రూ.2లక్షల రుణమాఫీని అమలు చేసి మాట నిలుపుకున్నానని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. రుణమాఫీ అమలులో జరిగిన జాప్యం కేవలం సాంకేతిక కారణాలవల్ల తప్ప తమ ప్రభుత్వం వెనుకాడటం వల్ల కాదని స్పష్టం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహాల సంస్కృతిని భారాసా ముందుకు తె చ్చిన నేపథ్యంలో, ఇందుకు ప్రతిగా డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కీలకాంశమేమంటే అదేరోజు సోనియాగాంధీ జన్మదినం కావడం.ఈ కార్యక్ర మంలో పాల్గనేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది మహిళలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. విజ యోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 4న పెద్దపల్లిలో బహిరంగ సభతో పాటు నిరుద్యోగ యువత సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 9వేల మందికి నియామక పత్రాలను ముఖ్యమంత్రి జారీచేస్తారు. నవంబర్ 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సు నిర్వహించారు. డిసెంబర్ 7`9 తేదీల మధ్య హుస్సేన్‌సాగర్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్బడ్లపై తెలంగాణ ప్రాభవాన్ని తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపడతారు.
మహబూబ్‌నగర్ రైతు సదస్సు
నవంబర్ 30న మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రైతుసదస్సులో 3.14లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూ.2747 కోట్లు రుణమాఫీ కింద విడుదల చేశారు. కొండగల్ పారిశ్రామికవాడ ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకించడాన్ని రేవంత్ తప్పు పడుతున్నారు. ముఖ్యంగా 25వేల మందికి ఉపాధి అవకాశాలు ఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను వ్యతిరేకించడం ద్వారా బీఆర్ఎస్ తన తిరోగమన వైఖరిని బయటపెట్టుకుంటోందని వి మర్శించారు. తెలంగాణలో ప్ర స్తుతం కోటి ఎకరాలభూమి అందుబాటులో ఉండగా కేవలం 1300 ఎకరాలు ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికోసం కేటాయిస్తే తప్పేంటన్నది ఆయన లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఇదే సమయంలో కె.సి.ఆర్.కు వ్యక్తిగతంగా గజ్వేల్‌లో వెయ్యి ఎకరాలున్న సంగతిని గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ తన స్వార్థ రాజకీయాలకోసం గిరిజనులను పావులుగా వాడుకుంటోందని, దాని ట్రాప్‌లో ఎవరూ పడవొద్దంటూ ఆయన హితవు చెబుతున్నారు. బీఆర్ఎస్ రాజకీయం వల్ల అమాయక గిరిజనులు జైళ్లకు వెళ్లడం సమంజసం కాదన్నారు. ఇక్కడ ఎకరానికి రూ.20లక్షలు నష్టపరి హారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదన్న సంగతిని ఆయన మరోసారి గుర్తుచేశారు. పదినెలల కాలంలో 50వేల ఉద్యోగాలు
కేవలం పదినెలల కాలంలో 50వేల ఉద్యోగాలిచ్చిన ఘనత తన ప్రభుత్వానిదేనని రేవంత్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. దేశంలోని 29రాష్ట్రాల్లో ఇంత తక్కువ వ్యవధిలో ఈ ఘనతను ఏ రాష్ట్రం ఇంతవరకు సాధించలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15లక్షల మంది నిరుద్యోగులుఉద్యోగాలకోసం కోచింగ్ తీసుకుంటున్నారు. నవంబర్ 8 వరకు ప్రభుత్వం రూ.18వేల కోట్ల మేర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. 25రోజుల వ్యవధిలోనే మూడు విడతలుగా ఈ చెల్లింపులు జరిగాయి. ఇక జమిలి ఎన్నికలను రేవంత్ వ్యతిరేకిస్తున్నారు. 2025 జనవరినుంచి జనగణన ప్రారంభమవుతుంది. ఇక్కడినుంచే కేంద్రం జమిలి ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించనున్న నేపథ్యంలో దీన్ని అడ్డుకోవడానికి వెనుకాడకూడదన్నది రేవంత్ అభిప్రాయం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేశవాపురం నుంచి హైదరాబాద్‌కు నీటితరలిపును రేవంత్ ప్రభుత్వం రద్దుచేసింది. ఇది ఖర్చుతో కూడిన నేపథ్యంలో తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్‌నుంచి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేశవాపురం నుంచి హుస్సేన్ సాగర్, హిమయత్ సాగర్లకు నీరు తరలించాలంటే కిలో లీటర్ నీటికి రూ.48 చెల్లించాలి. అదే మల్లన్న సాగర్ నుంచి అయితే కిలో లీటర్‌కు రూ.4 సరిపోతుంది. హైడ్రా అమలు విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు వరకు వున్న 2100 చదరపు కిలోమీటర్ల పరిధిలో 1700 చెరువులు వుండేవి. వీటిల్లో కొన్ని 100శాతం ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం అధికార్లు వీటిని నోటిఫై చేసే పనిలో వున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం మరియు బఫర్ జోన్లను అధికార్లు గుర్తించారు. హిమయత్సాగర్ ప్రాం తంలో ఇంకా గుర్తించాల్సి వుంది. హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చిన నేపథ్యంలో అన్నీ అనుకున్న విధంగానే జరుగుతాయని రేవంత్ హామీ ఇస్తున్నారు. నిబంధనలను ఎట్టిపరిస్థితుల్లో అతిక్ర మించే పనే లేదని ఆయన స్పష్టం చేశారు. స్వకపోల సృష్టి అయిన హైడ్రా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేనది ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక తొలిదశ మూసీ అభివృద్ధి కార్యక్రమం కింద, ప్రభావిత ఇళ్లను 33 టీమ్‌లు సందర్శించి నివేదికను సమర్పించాయి. అంతేకాదు మూసీ అభివృద్ధి కోసం అంతర్జాతీయస్థాయి కన్సల్టెంట్లను ప్రభుత్వం నియమించింది. వీరు ఇటువంటి ప్రాజెక్టుల అమలులో నిష్ణాతులని రేవంత్ చెబుతున్నారు.
తిరుగులేని ఆధిపత్యం
ఒంటిచేత్తో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, అప్రతిహతంగా పార్టీలో తన ఆధిపత్యాన్ని నిరూ పించుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ సంసృతికి భిన్నంగా, ఆయన పార్టీ సీనియర్లు అసంతృప్తి గళం ఎత్తకుండా జాగ్రత్తపడుతున్నారు. వైస్.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, మళ్లీ రేవంత్ రెడ్డిలు మాత్రమే ఇప్పటివరకు రాష్ట్రాలను పాలించిన కాంగ్రెస్ నాయకుల్లో స్వేచ్ఛగా పాలనను కొనసాగించారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన విధం, ఏకఛత్రాధిపత్యంగా నాయకత్వ పటిమతో పాలించిన ఘనత కాంగ్రెస్ చరిత్రలో బహుశా ఈ ఇద్దరు నాయకులకే దక్కుతుంది. పదవిలోకి వచ్చిన ఆర్నెల్లకు అసమ్మతి పొగ పెట్టించి, ఆయా నాయకులను నిద్రలేని రాత్రులను కల్పించి చివరకు గద్దె దింప డం కాంగ్రెస్ సహజ సంస్కృతి. అధిష్టాన ఆధిపత్య రాజకీయాలకు ఒకరకంగా అడ్డుకట్ట వేసిందికూడా ఈ ఇద్దరు నాయకులే. అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలో రేవంత్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమంటూ విపక్షాలుచేసిన ప్రచారాలు అబద్ధాలని నిరూపించడమే కాకుండా, పార్టీలు తిరుగులేని నేతగా నిరూపించుకోవడం రేవంత్ సాధించిన ఘనత. ఏ సీనియర్ నేతను ఏవిధం గా నియంత్రించాలో ముందుగానే గట్టి ప్రణాళిక వేసుకొని అమలుచేస్తున్నట్టుగా రేవంత్ వైఖరి కొనసాగుతోంది. అందువల్లనే పార్టీలో ఇప్పటివరకు ఎవరూ నోరెత్తడంలేదు. ఆవిధంగా చేస్తే అసలుకే మోసం వస్తుందన్న భయం కూడా వారిలో లేకపోలేదు! పార్టీలో అసమ్మతి లేకుండా చూసుకుంటూ, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు హామీలను అమలు జరపడం మామూలు స వాలు కాదు. వీటిల్లో ఇప్పటికి రెండు హామీలు అమలు చేసినా మిగిలిన వాటి అమలులో కొంత జాప్యం అనివార్యం. రైతుభరోసా అమలు పెద్ద ఆర్థిక భారమైనప్పటికీ విడతలవారీగా అమలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. సహజంగానే భారాసా, భాజపాలు రేవంత్ వైఫల్యాలను ప్రజల ముందుకు తెస్తూ, ఎప్పటికప్పుడు రాజకీయంగా చిక్కులు తెచ్చేందుకు యత్ని స్తున్నా వాటిని ఇప్పటివర కు సమర్థవంతంగా తిప్పికొడుతూముందుకు దూసుకెళుతున్నారు. అయితే గోరంతలు కొండంతలు చేయడం ప్రతిపక్షాల నైజం. ఆ ఎత్తులను తుత్తునియలు చేసుకుంటూ ముందుకెళ్లడంలోనే వుంటుంది నాయకత్వ పరిపక్వత. ఈ లక్షణాన్ని రేవంత్ స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. కేవలం ఏ డాది కాలంలోనే ఒక పార్టీ పాలనపైపూర్తిగా ఒక అభిప్రాయానికి రావడం తప్పే అవుతుంది. కొన్ని కార్యక్రమాల అమలుకు ఐదేళ్ల కాలమే సరిపోని నేటిరోజుల్లో, కేవలం ఏడాదికాలంలోనే అన్ని హామీలు అమలు చేసి, సురంజకపాలన అందిస్తారని భావించడం అత్యాసే కాగలదు. ఇందులో ఎన్నో బాలారిష్టాలు దాగివుంటాయి. వీటన్నింటిని దాటుకొని వెళ్లడం ప్రభుత్వానికి ఒక రక మైన పరీక్షే అవుతుంది.
సవాలుగా నిలిచిన ‘స్థానిక’ ఎన్నికలు
ప్రస్తుతం భారాసా, భాజపాలు రేవంత్ ప్రభుత్వంపై దూకుడు వైఖరితో విమర్శల దాడికి దిగుతు న్నాయి. ఒక్కసారిగా ప్రభుత్వంపై రెండు పార్టీలు తమ దాడిని తీవ్రం చేయడానికి ప్రధాన కార ణం త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన ప్రాభవాన్ని నిరూపించుకోక తప్పని పరిస్థితి నెల కొంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం, పార్టీ ఫిరాయింపులతో కు నారిల్లుకు పోయిన భారాసా స్థానిక ఎన్నికల్లో తన విశ్వరూపం చూపాలనుకుంటోంది. ఇక లోక్‌సభ ఎన్నిక ల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎనిమిది స్థానాలను గెలుచుకున్న బీజేపీ మంచి జోష్‌లో వుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో కూడా ఇదే ఊపును కొనసాగించడానికి తగిన వ్యూహాలు పన్నుతోంది. ముఖ్యంగా పెరిగిన ఓటుబ్యాంకును కాపాడుకుంటూ మరింతగా చొచ్చుకుపోవాలన్నది భాజపా వ్యూహం. రైతు భరోసా అమలు, మహిళలకు రూ.2500 పింఛను చెల్లింపు, వరిధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫార్మాసిటీ, పారిశ్రామిక వాడల ఏర్పాటు, భూసేకరణ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఊపిరిసలపకుండా చేయాలన్నది వాటి ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. నవంబర్ 29న భారాసా ‘దీక్షా దివస్’ను నిర్వహించింది. 2009లో సరిగ్గా ఇదేరోజున కె.సి.ఆర్. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ దీక్షలను అమలు చేసింది. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలపై ఒక ఛార్జ్‌షీట్‌ను విడుదల చేయడానికి కూడా ఉ ద్యుక్తమైంది. ఆరుహామీల అమలుపై భాజపా కూడా సరిగ్గా ఇదేమాదిరి వ్యూహాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్లను తొలగించడం అన్యాయమంటూ బీజేపీ నేతలు ఏకంగా ఒకరోజు రాత్రి ఆప్రాంతంలో నిద్రచేసి మరీ నిరసన తెలిపారు. ఇక రైతులకు చెల్లించాల్సిన రూ.2లక్షల రుణమాఫీ విషయంలో మాత్రం రెండు పార్టీలు ప్రభుత్వంపై ఒకేమాదిరిగా దాడిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షు లు మహేష్‌కుమార్ గౌడ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద సవాలు విసరనున్నాయి.