జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలను అంద జేయాలి : టీఎస్ జెయు

జర్నలిస్ట్ సంక్షేమ పథకాలకు, అక్రిడేషన్ కార్డులకు లింకు పెట్టవద్దు..

ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలి

తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు టీఎస్ ఆధ్వర్యంలో వినతి

హైదరాబాద్, నవంబర్ 20 :

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జె యు) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. అన్ని జర్నలిస్ట్ యూనియన్లకు అక్రిడేషన్ కమిటీలో భాగస్వామ్యం కల్పించాలని వారు కోరారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఇండియా) ఎన్ యుజె(ఐ) జాతీయ ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం, టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, కోశాధికారి పాపాని నాగరాజు, రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్ లు కమిషనర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని వారు కోరారు. జర్నలిస్టుల వృత్తి భద్రత, హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యతని వారు అన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు వంటి అనేక సమస్యలను నివారించాలని వారు కోరారు. జర్నలిస్టుల భద్రతను సమర్థవంతంగా పరిరక్షించేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తప్పనిసరిగా రూపొందించి అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు అక్రిడిటేషన్ లింకును తీసివేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్రిడిటేషన్ కార్డులు పొందని అనేక మంది జర్నలిస్టులు తమ వృత్తి సేవలను కొనసాగించడంలో తీవ్రమైన ఆర్థిక వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలు ప్రతి జర్నలిస్టుకు అదే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జర్నలిస్టులపై దాడుల నివారణ కోసం కమిటీలను నియమించాలని, బాధితులకు న్యాయం అందించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో కమిటీలను పునరుద్ధరించాలని వారు కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల, స్థలాలు కేటాయించడంలో ప్రస్తుత యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించే సంఘాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వం స్వయంగా జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అనేక సంవత్సరాలుగా చిన్న పత్రికలకు ఎంప్యానల్ మెంట్ జరగకపోవడం వల్ల చిన్న పత్రికల యజమానులు (వీరంతా జర్నలిస్టులే) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే చిన్న పత్రికలకు ఎంప్యానల్ మెంట్ చేయాలని వారు కోరారు. తెలంగాణ ప్రెస్ అండ్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చిన్న పత్రికలు, మీడియాకు ఆర్థిక సాయం అందించడానికి ప్రెస్ అండ్ మీడియా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం రూపొందించాలని వారు కోరారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెబుతున్నది ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సమగ్ర నివేదికతో శ్వేత పత్రం విడుదల చేయాలని వారు కోరారు. జర్నలిస్టుల వృత్తి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వార్తల సేకరణలో ప్రమాదకర పరిస్థితులు, ఆరోగ్య ప్రమాదాలు, వృత్తి సంబంధిత బెదిరింపులకు గురవుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కాపాడడానికి ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ పథకం ద్వారా జర్నలిస్టుల ఆసుపత్రి చికిత్సలు, ప్రమాద బీమా, ఆరోగ్య సంబంధిత సహాయాలు పొంద గలగాలని, జర్నలిస్టుల సురక్షిత భవిష్యత్తు కోసం ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఈ డిమాండ్లను కమిటీ దృష్టికి తీసుకువెళ్లి అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!