కరీంనగర్, నేటిధాత్రి:
విద్యార్థుల పట్ల వివక్షత చూపుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయకుండా విద్యారంగంపై రాష్ట్ర సర్కార్ చిన్న చూపు చూస్తుందని సిఎం వద్దే విద్యాశాఖ ఉన్న సమస్యల పరిష్కారం ఇంకెప్పుడు అని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఏడువేల ఆరు వందల యాభై వేల కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక ఆర్థికపరమైన అవస్థలు ఎదుర్కొంటూ తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఎన్నికల ముందు పదే పదే మాట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పదకోండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని, సర్కారు ఫీజులు చెల్లింపులు చేయకపోతే విద్యార్ధుల చదువులు కొనసాగేదెలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందని, విద్యార్థుల పట్ల వివక్ష చూపిన ప్రభుత్వాలు మనుగడ సాధించలేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను మొత్తం విడుదల చేయడంతో పాటు విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని, జాతీయ నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మచ్చ రమేష్ హెచ్చరించారు