`సీనియర్లు ఆడుతున్న వింత నాటకం.
`పార్టీపై పొంగులేటి సాధిస్తున్న పట్టును ఓర్వలేని తనం.
`సీనియర్లు అంత బలవంతులైతే రెండు సార్లు ఎందుకు గెలిపించలేదు.
`అందరూ కలిస్తేనే పార్టీ.
`సమిష్టి విజయమే కాంగ్రెస్ ప్రభుత్వం.
`తనపై తాను పొంగులేటి గొప్పలు చెప్పుకున్నదెన్నడూ లేదు.
`సీనియర్లు కావాలని బురదజల్లుతున్నారు.
`బిఆర్ఎస్ ను ఖమ్మం గుమ్మం దాటకుండా చేసింది శ్రీనివాస్ రెడ్డి.
`కాంగ్రెస్ లోకి రాకముందే పొంగులేటి ఖమ్మం మీద పట్టు.
`తెలంగాణ వైసిపి అధ్యక్షుడుగా నిర్వహించిన బాధ్యతలు.
`పొంగులేటి బలం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.
`బిఆర్ఎస్ నుంచి బైటకు వచ్చిన తర్వాత పొంగులేటి ఏ పార్టీలో చేరలేదు.
`బిజేపి నాయకులు ఎంత సంప్రదించినా వెళ్లలేదు.
`ఆనాడు పొంగులేటితో మంతనాలు జరిపింది సీనియర్లే.
`ఇప్పుడు పొంగులేటి మీద పితూరిలు చెబుతున్నది వాళ్లే.
`అధిష్టానం ఆశీస్సులు పొంగులేటికి పుష్కలంగా వున్నాయి.
`ఎవరెన్ని కుట్రలు చేసినా చెల్లవు.
`పొంగులేటిపై విష ప్రచారం కాంగ్రెస్ పార్టీకే తీరని నష్టం.
ఒక బలవంతుడు ఎప్పుడూ మరో బలవంతుడుతో తలపడడానికి మాత్రమే ఇష్టపడతారు.
మహా భారతంలో దుర్యోధనుడిని చివరి యుద్ధ ఘట్టంలో ఎవరితో పోరాటం చేస్తవని కురుపెద్దలు అవకాశమిస్తే భీముడితోనే యుద్ధం చేస్తానన్నాడు.
నిజానికి దుర్యోధనుడు మిగతా ఎవరిని ఎంచుకున్నా, ఆఖరుకు అర్జునుడిని ఎంచుకున్నా దుర్యోధనుడే గెలిచేవాడు.
కానీ గెలవడం ఒక్కటే కాదు ఓడినా సమవుజ్జీతోనే అని నిర్ణయం తీసుకున్నాడు.
రాజకీయంగా ఆనాడు అది కుట్రనే…కానీ దుర్యోధనుడు ఎవరిని ఎంచుకున్నా, గెలిచినా, భీముడి చేతిలో ఓడిపోతాననీ భయపడ్డాడు అని చరిత్రలో హీనుడుగా మిగిపోయేవాడు.
ఆనాడు రాజ్యాలైనా, నేడు ప్రజా పాలకులైనా చేసేది రాజకీయమే…అయినా రాజకీయ నీతిని ఆనాడు అనుసరించారు. ఇప్పుడు కపట నీతిని మాత్రమే అనుసరిస్తున్నారు.
కష్టపడి పార్టీని గెలిపించిన వారికంటే, తన గెలుపులో పూర్తిగా తన ప్రమేయం లేకుండా గెలిచిన నేతలు కూడా కాంగ్రెస్‌లో కుట్రలకు తెరతీస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బలహీన పర్చాలంటే ముందు పొంగులేటి మీద బురదజల్లాలని చూస్తున్నారు. పొంగులేటి ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలని కొందరు పన్నాగం పన్నుతున్నారు. మీడియా ఛానళ్లకు లీకులిచ్చి తెరచాటు రాజకీయం చేయాలని చూస్తున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక బలవంతుడు ఎప్పుడూ మరో బలవంతుడితోనే తలపడాలని చూస్తాడు. బలహీనులెప్పుడూ బలవంతుడి పక్కన వున్నవారి మీద ప్రతాపం చూపాలని ఆశపడతారు. మహాభారతంలో యుద్ధం ఆఖరు ఘట్టంలో దుర్యోధనుడిని ఎవరితో తలపడతావని కురు పెద్దలు అడిగితే తనకు సమవుజ్జీ అయిన భీముడితోనే పోరాడతానంటాడు. నిజానికి దుర్యోధనుడు దర్మరాజుతోపాటు, ఇతరులను ఎవరినైనా ఎంచుకునే అవకాశం వున్నా, భీముడినే కోరుకున్నాడు. అదీ వీరుల లక్షణం. రాజ్యాలైనా రాజకీయాలే చేశారు. ప్రజాస్వామ్య పాలనైనా రాజకీయాలే చేస్తున్నారు. రాజులైనా, పాలకులైనా సమవుజ్జీలను ఎంచుకొని పోరాటం చేయాలి. అదే రాజనీతి. కపట నీతిని ఆచరించడం సరైంది కాదు. రాజకీయాల్లో ఈ ద్వంద నీతి ఎక్కువైంది. కపట రాజకీయానికే కాలం సహకరిస్తూ వుంటుంది. కష్టపడి పార్టీని గెలిపించిన వారిని పక్కన పెట్టడం, వారిని దించేయడం చరిత్రలో అనేకం వున్నాయి. 1973లో ఒంటి చేత్తో పివి. నర్సింహారావు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాని ఆయనను కనీసం పట్టుమని పదమూడు నెలలుకూడా పదవిలో కనసాగనివ్వలేదు. ఓ ఒక వంక చూపించి దించేయాలని ఎదురుచూస్తున్న వారికి భూ సంస్కరణలు ఆయుధమయ్యాయి. పివి. నర్సింహారావును పదవీచ్చుతున్ని చేశాయి. తన 500 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిన ఉద్దాత్తమైన నాయకుడిని పదవి నుంచి దించేశారు. 1989లో ఎన్టీఆర్ గాలిని కూడా తట్టుకొని, ఎదురొడ్డి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన మర్రి చెన్నారెడ్డిని ఏడాది కూడా పాలన సాగించనీయలేదు. పాతబస్తీలో అల్లర్లు లేపి ఆయనను పదవి నుంచి దించేశారు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అని ప్రజలు, రాజకీయాలు పార్టీలు నిందిస్తూనే వున్నా, ఆ పార్టీ విధానాలలో మార్పులు రావడం లేదు. గెలిపించిన నేతలకే పంగనామాలు పెట్టడం అలవాటు చేసుకున్నారు. అదే అసమైన రాజకీయం అని అలవాటు చేసుకున్నారు. ఎవరు ఔనన్నా,ఎవరు కాదన్నా పైకి బాగానే వుందని చెప్పుకుంటే సరిపోదు. ఒకరి కాళ్లను ఒకరు పట్టుకొని లాగడం కాంగ్రెస్‌పార్టీకి శ్రేయస్కరం కానే కాదు. పదేళ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారు. సంక్షేమ పాలన అందిస్తే మరో పదేళ్లు కాంగ్రెస్‌కు తిరుగుండదు. కాని చేజేతులా చెడగొట్టుకునే రాజకీయాలు చేసుకుంటే మొదటికే మోసానికి వస్తుంది. కుట్రలు అలవాటు అనుకుంటే మునిగేది కాంగ్రెస్ కొంపనే అనేది మర్చిపోతున్నారు. కూర్చున్న కొమ్మను నరుక్కొవడం కాంగ్రెస్‌కు అలవాటే అన్నది నిజంచేస్తున్నారు. అదికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే లుకలుకలు తెచ్చిపెట్టాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బలహీనపర్చాలంటే, ముందు మంత్రి పొంగులేటి మీద బురద జల్లాలని చూస్తున్నారు. మంత్రి పొంగులేటి ఆత్మస్ధైర్యం మీద దెబ్బకొట్టాలని పన్నాగం పన్నుతున్నారు. మీడియా చానళ్లకు లీకులిచ్చి తెరచాటు రాజకీయం చేయాలని చూస్తున్నారు. సీనియర్లు అని పిలవబడుతున్న కొంత మంది నాయకులు ముఖ్యమంత్రి పదవి మీద ఆశపెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని చూస్తున్నారు? దాని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం చేసిన వాళ్లవుతారు. రాజకీయ నాయకులకు ఆశలుంటాయి. కాని అవకాశాలు రావాలి. లేకుంటే అవకాశాలు కల్పించుకోవాలి. పార్టీని గెలిపించేందుకు ముందుకొచ్చే అవకాశాన్ని తీసుకోవాలే గాని, అధికారంలోకి వచ్చాక పదవులను లాక్కునేందుకు రాజకీయం చేయొద్దు. ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి దూకుడు ఇతర సీనియర్లకు నచ్చడం లేదు. నిజానికి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తన కర్తవ్యం నిర్వర్తిన్నారు. ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు పెంచుకున్న వారు మాత్రం బాధ్యతలను విస్మరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికోసం రాజకీయం చేస్తున్నారు. స్వపక్షంలోనే కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నారు. పార్టీపై పొంగులేటి సాధిస్తున్న పట్టును చూసి ఓర్వలేకపోతున్నారు. పొంగులేటి నెంబర్ టూగా వెలిగిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలకు పది నెలల ముందు పార్టీలోకి వచ్చిన పొంగులేటి, అధికారంలోకి వచ్చిన పదినెలల్లో అటు పార్టీపై, ఇటు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించడాన్ని కొందరు జీర్ణించుకోలేపోతున్నారు? అదే వివాదాలకు కారణమౌతోంది. నిజంగా సీనియర్లు పొంగులేటికన్నా బలవంతులైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను రెండుసార్లు ఎందుకు గెలిపించుకోలేదు. ఆనాడు వాళ్లే పార్టీని గెట్టెక్కిస్తే పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవసరం వచ్చి వుండేది కాదు. పొంగులేటి లాంటి వారు పార్టీకి అండగా నిలిచే అవసరం కూడా వచ్చేది కాదు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నా నిలదీసిన సీనియర్లు లేదు. ప్రభుత్వంపై పోరాటం చేసిన వాళ్లు లేరు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే ఊపు వచ్చింది. కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చేంత బలపడిరది. అందుకు ఆయన చేసిన కృషిని పార్టీ అధిష్టానం గుర్తించింది. రేవంత్‌రెడ్డి కష్టపడిన విధానం నచ్చింది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన శ్రమను కళ్లారా చూసింది. అందుకే సీనియర్లను పక్కన పెట్టింది. నిజంగా వారికి అంత అర్హత వుంటే పార్టీ అదికారంలోకి వచ్చిననాడే సీనియర్లే సిఎం అయ్యేవారు. సిఎం రేవంత్‌రెడ్డి తర్వాత పార్టీకి మరింత బలం పెరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాత్రమే. ఎందుకంటే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాయకుడు కాలేదు. కాంగ్రెస్ అవకాశమిస్తేనే ప్రజా ప్రతినిది కాలేదు. 2014కు ముందే ఆయన నాయకుడు. ప్రజా సేవకుడు. సామాజిక కార్యకర్త. వ్యాపార వేత్త. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వైసిపి నుంచి ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు. వైసిసి నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించారు. ఖమ్మం జిల్లాలోనే బలమైన నాయకుడు అని అప్పుడే రుజువు చేసుకున్నాడు. అంతే కాదు వైసిసి పార్టీకి తెలంగాణ అధ్యక్షుడుగా ఆయన బాద్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు సీనియర్లమని చెప్పుకుంటున్న వారిలో ఒక్కరు తప్ప ఏ ఒక్కరు కనీసం పిసిసి. అధ్యక్షపదవి కూడా నిర్వహించలేదు. ఒక దశలో బిజేపి వైపు చూసి, కాలం కలిసి రాక ఆగిన వాళ్లు కూడా వున్నారు. కాంగ్రెస్పని అయిపోయిందని చెప్పి, బిజేపిలోకి వెళ్లి తిరిగి రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్‌లోనే అని మళ్లీ వచ్చిన నాయకుడు కూడా వున్నారు. బిఆర్ఎస్ అధికారంలో వన్నంత కాలం ఆ పార్టీకి కోవర్టు అన్న ముద్రతో నిత్యం విమర్శలు ఎదుర్కొన్న నాయకులు కూడా వున్నారు. పిపిసి. పదవి నిర్వహించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వున్న సమయంలో కూడా పార్టీని గట్టెక్కించలేని వాళ్లు కూడా నేను ముఖ్యమంత్రి కావాలని ఆశపడడం అత్యాశే అవుతుంది. ఇప్పటికీ కుటుంబ వారసుడు వైరి పక్షంలో వున్న ఎమ్మెల్యేను కూడా కాంగ్రెస్‌లోకి తెచ్చుకోలేని నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కలలు గనడం విడ్డూరంగా వుంది. వాళ్లు పొంగులేటి రాజకీయాన్ని దెబ్బతీయాలని చూడడం మరీ విచిత్రంగా వుంది. బిఆర్ఎస్ను ఖమ్మం గుమ్మం దాటనీయనని శపధం చేసిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఒక్క బిఆర్ఎస్ నాయకుడిని కూడా ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకనివ్వనని ప్రతిన బూని కాంగ్రెస్‌ను గెలిపించిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలా బిఆర్ఎస్ మీద శపధం చేసిన సీనియర్ నాయకులు ఎవరైనా వున్నారా? వారి వారి సొంత జిల్లాల్లో బిఆర్ఎస్ను కట్టడి చేశారా? ఇప్పటికీ తెలంగాణను అడ్డుకున్న సమైక్యపాలకులను కొలిచే నాయకులలో సీనియర్లు వున్నారు. అలాంటి వాళ్లు కూడా పొంగులేటి రాజకీయాన్ని నిందిస్తున్నారు. ఆయనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసే కుట్రలు చేస్తున్నారు. బిఆర్ఎస్ నుంచి బైటకు వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరలేదు. ఏ పార్టీని ఆయన సంప్రదించలేదు. ఎవరితో రాయభారాలు పంపలేదు. రాజకీయ బేరాలు కుదుర్చులేదు. కాని ఆనాడు కాంగ్రెస్, బిజేపి పార్టీలు పోటీలు పడి మరీ పొంగులేటి పార్టీలోకి తెచ్చుకునేందుకు విపరీతమై ప్రయత్నాలు చేశాయి. ఆఖరకు బిఆర్ఎస్ కూడా అనేక బుజ్జగింపు ప్రయత్నాలు కూడా చేసింది. కాని ఆయన ఎటు వైపు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇప్పుడు పొంగులేటిపై లేనిపోవిని సృష్టిస్తున్న నేతలు కూడా పొంగులేటి ఇంటికి వెళ్లినవారే. ఆయనతో సంప్రదింపులు జరిపిన వాళ్లే. ఇప్పుడు ఆ పొంగులేటిపై పిర్యాధులు చేయడం అంటే తమను తాము నిందించుకోవడమే..తమది నీతిలేని రాజకీయం అని ఒప్పుకున్నట్లే.!!