పత్తి రైతుల అరి’గోస’

.. క్వింటాల్ కు 200 నుంచి 300 రూపాయల కటింగ్
.. మార్కెట్లో ఒక రేటు.. మిల్లులకు వచ్చిన తర్వాత మరో రేటు
జమ్మికుంట: నేటి ధాత్రి


ఉత్తర తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు ఆరిగోస పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు మార్కెట్లో బహిరంగ వేలం ద్వారా క్వింటాలుకు మద్దతు ధర నిర్ణయించిన తర్వాత మిల్లుల్లోకి వెళ్లిన తర్వాత 200 నుంచి 300 రూపాయలకు తగ్గించుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో తెల్లభంగారం తెల్లబోతుంది. గిట్టుబాటు ధర లేక రైతు దిగాలు చెందుతున్నాడు. స్థానిక మార్కెట్ యార్డులో సెప్టెంబర్ 24నుండి కొత్త పత్తి కొనుగోళ్ళు ప్రారంభం అయ్యాయి. అప్పటి వరకు పాత పత్తి ధర క్వింటాల్ గరిష్టంగా రూ.7600 పలికింది. కొత్త పత్తి ధర క్వింటాల్ గరిష్టంగా రూ.6611నుండి ప్రారంభం అయింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.7521గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 7వ తేది వరకు పాత పత్తి విక్రయాలు ముగిసి పోయాయి. పాత పత్తి విక్రయాలు పూర్తి అయ్యేసరికి క్వింటాల్ రూ.7400వరకు ధర పలికింది. తాజాగా సోమవారం నాటికి కొత్త పత్తి ధర గరిష్టంగా క్వింటాల్ రూ.6800 పలికింది.
గడిచిన 23రోజులుగా కొత్త పత్తికి రూ.6611నుండి రూ.7వేలు లోపు మాత్రమే ధర పలికింది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.7521నిర్ణయించింది.
ప్రస్తుతం మార్కెట్ యార్డులో మద్దతు ధర కంటే రూ.721 తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గరిష్టంగా రూ.6800 పలుకుతున్న కనిష్ట ధర మాత్రం రూ.6వేలు పలుకుతుంది. అవరేజ్ ధర రూ.6600 మించడం లేదు. జమ్మికుంట మార్కెట్కు తీసుకు వచ్చిన పత్తిలో ఫేమస్ శాతం 12 కంటే ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు అందిన కాడికి దండుకుంటున్నారు . ఇదేమిటి అని ప్రశ్నించిన రైతులకు మాత్రం చుక్కెదురవుతుంది. రైతులు మాత్రం సీసీఐ వస్తె మద్దతు ధర లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో నామమాత్రంగా కొనుగోళ్ళు ప్రారంభించిన నవంబర్ మొదటి వారం నుండి కొనుగోళ్ళు రెగ్యులర్ గా కొనసాగుతాయి. అకాల వర్షాల కారణంగా రైతులు సతమతం అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీఐ కొనుగోలు చేస్తనే రైతుకు కాస్తైనా గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జమ్మికుంట పత్తి మార్కెట్ కు మంగళవారం పత్తి నిల్వలు ఎక్కువగా రావడంతో రైతులతో సందడి వాతావరణం నెలకొంది.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు 1630 క్వింటాళ్ల పత్తి రాగా వ్యాపారులు వేలంపాట ద్వారా గరిష్ట ధర 6800, మాడల్ 6700, కనిష్ట ధర 6000 చొప్పున కొనుగోలు చేశారు. అదేవిధంగా సంచులలో 26 కింటాల పత్తి రాగా గరిష్టదర 6400 చొప్పున మరియు కనిష్టదర 6000 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి క్రమక్రమంగా రావడం పెరుగుతుండడంతో వ్యాపారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ధరలను తక్కువగా నిర్ణయించుతూ తేమ ఉందని కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారని పలువురు అన్నదాతలు పేర్కొన్నారు. బహిరంగంగా వేలంపాట ద్వారా కొనుగోలు జరిగినప్పటికీ తీరా మిల్లులకు వెళ్లిన తర్వాత ధరలు చేంజ్ అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. వేలంపాట ద్వారా క్వింటాలకు ఎంత చొప్పునైతే కొనుగోలు చేస్తారో అదే ధరను మిల్లుల్లోకి తరలించిన తర్వాత చెల్లించే విధంగా మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *