శ్రీను కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండ 

పాలకుర్తి నేటిధాత్రి

ఇటీవలే పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన మండలంలోని కొండాపురం శివారు మేకల తండాకు చెందిన లాకావత్ శ్రీను కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం శ్రీను కుటుంబానికి 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులో శ్రీను పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ శ్రీను కుటుంబానికి అండగా నిలవాలని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరడంతో శ్రీను కుటుంబానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూతనందించామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలతో సంబంధం లేకుండా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. పేద విద్యార్థిని, విద్యార్థులకు విద్య, వైద్యం కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థికంగా ఆదుకునేందుకు తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. తండాలకు, గ్రామాలకు కావలసిన అవసరాలు సౌకర్యాలను గుర్తించి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్షణికావేశాలతో విలువైన ప్రాణాలను బలిచేసుకుని తల్లిదండ్రులకు కడుపు కోత ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. లకావతు శ్రీను చావుకు కారణమైన నిందితులు ఎంతటి వారినైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. లాకావత్ శ్రీను కు జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకూడదని, సమస్యను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. పేద కుటుంబాల అందరికీ ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కొండాపురం మాజీ సర్పంచ్ లాకావత్ కాళు రామ్ నాయక్, యూత్ నాయకులు లాకావత్ సురేష్ నాయక్, మొగుళ్ళ కుమార్, లాకావత్ సోమన్న తో పాటు మృతుడి కుటుంబ సభ్యులు, తండా పెద్దలు, గిరిజన సంఘాల నాయకులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *