
కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఈ రోజు హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కలెక్టర్ ని ఆహ్వాణించిన అనంతరం పెరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలోని సాయుధ దళ పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘవిద్రోహశక్తులచే పోరాడి చనిపోయిన పోలీస్ పోలీసు అమర వీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని,శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించి ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించడంలో ఎల్లప్పుడు పోలీస్ శాఖ ముందు ఉంటుందని అన్నారు.శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటమే ప్రధాన కారణమని అన్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందని తెలిపారు.ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని,శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం నిరంతరం కాపలా కాస్తుంటారాని ఎండ,వాన,పగలు,రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగల్ని కూడా త్యజించి,ప్రజల కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలని సైతం పణంగా పెట్టి సంఘ విద్రోహశక్తులచే పోరాడి వీరమరణం పొందిన పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి,గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని తెలిపారు.అక్టోబర్ 21 అంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.1959లో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇదని తెలిపారు.ఈ సమరంలో 10 మంది జవాన్లు అమరులయ్యారని,1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులోని అక్షయచిన్ ప్రాంతంలో సుమారుగా 16,000 అడుగుల ఎత్తులో తీవ్రమైన చలిలో కాపలా కాస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లు, దురాక్రమణకు ప్రయత్నించిన చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి వీర జవాన్లు ప్రాణాలర్పించడం జరిగిందని తెలిపారు.అప్పటినుంచి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు.పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనo.పోలీసుల త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి,సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో,సేవాభావంతో పని చేస్తుందని అన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి చెప్పారు.అమర వీరులయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో అమరులయిన 214 మంది పేర్లను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్ చదివి వినిపించారు.అనంతరం జిల్లా కలెక్టర్,ఎస్పీ గార్లతో పాటు అక్కడ పాల్గొన్న అధికారులంతా అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.సాయి మనోహర్,డిఎస్పీలు చంద్రభాను,రెహమాన్,మల్లయ్యస్వామి,రవీందర్ రెడ్డి,సతీష్ కుమార్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మరియు సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,పోలీస్ కార్యాలయ సిబ్బంది,స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.