జర్నలిస్టులపై దాడుల నివారణకు కమిటీలను నియమించాలి

నేటిధాత్రి, వరంగల్

జర్నలిస్టులపై దాడులను నివారణ కోసం జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలని కొడుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టి.ఎస్.జె.యు) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్ మెంట్ (ఐ అండ్ పిఆర్) కమీషనర్ హనుమంతరావును కలసి వినతి పత్రం సమర్పించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఎన్.యు.జె(ఐ) జాతీయ ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టి.ఎస్.జె.యు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మెరుగు చంద్రమోహన్, తోకల అనిల్ కుమార్, రాష్ట్ర నాయకులు చాప రవీందర్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడుల నివారణ కోసం రాష్ట్ర స్థాయితో పాటు అన్ని జిల్లాలలో కమిటీలను పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో ప్రభుత్వమే స్వయంగా జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులు 239ని తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. అనేక సంవత్సరాలుగా చిన్న పత్రికలో ఎంప్యానల్ మెంట్ జరగకపోవడం వల్ల చిన్న పత్రికల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే చిన్న పత్రికలను ఎంప్యానల్ మెంట్ చేయాలని, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణను తొలగించాలని వారు కోరారు. చిన్న పత్రికలతో పాటు మీడియాకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రెస్ అండ్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెబుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సమగ్ర నివేదికతో శ్వేత పత్రం విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *