https://epaper.netidhatri.com/view/397/netidhathri-e-paper-5th-october-2024/1
గత పది సంవత్సరాల నుండి మిల్లర్లను పిలిచి ప్రభుత్వాలు మాట్లాడిరది లేదు
`ప్రభుత్వం ఒక్కసారి మిల్లర్లతో మాట్లాడితే అసలు సమస్య తేలుతుంది.
`దళారులు దూరి దోచుకుంటున్నారు!
`మిల్లర్ల నెత్తిన చెయ్యి పెడుతున్నారు?
`ఏజెన్సీలకు అధికారులు కొమ్ముకాస్తున్నారు.
`మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్నారు.
`మిల్లర్ల నుంచి ధాన్యం కాకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు.
`రెండు రకాలుగా మిల్లర్లు మోసపోతున్నారు.
`ప్రభుత్వమే రైతులకు డబ్బులు చెల్లించినప్పుడు మధ్యవర్తులెందుకు?
`ఇతర రాష్ట్రాలలో దళారులు లేదు.
`మిల్లింగ్ చార్జీలు ఇస్తే సరిపోతుంది!
`డొంక తిరుగుడు వ్యవహారమెందుకు?
`రైతు బతికింది లేదు…ప్రభుత్వానికి ఆదాయం చెందింది లేదు!
`మిల్లర్లు లాభపడిరది లేదు!
`దళారుల మూలంగా ఒరిగేదేమీ లేదు?
`తెలంగాణలో మాత్రమే ఎందుకున్నారు!
`అక్రమ మిల్లర్లు మాత్రమే బాగుపడ్డారు.
`అసలైన మిల్లర్లు అవస్థలు పడుతున్నారు.
`మిల్లర్ల గోడు వింటున్నది లేదు.
`సమాజం మిల్లర్లను దోషులనుకుంటోంది.
`దోషులెవరో బైటపడుతుంది.
`దోచుకున్న వారి బాగోతం వెలుగులోకి వస్తుంది.
`మిల్లర్లేకానీ వారికి ధాన్యమెలా చేరింది.
`ఏజెన్సీల అవతారం ఎత్తిన వాళ్లెవరు?
`ఏజెన్సీల మాట ప్రభుత్వం ఎందుకు వింటున్నట్లు?
`అధికారుల ఏజెన్సీల చేతుల్లో వున్నారా?
`ఏజెన్సీలు అధికారుల కనుసన్నల్లో సాగుతున్నాయా?
`ఏ రకంగా చూసినా నష్టం ప్రభుత్వానికే…
`మిల్లర్ల మీద వేధింపులకే..
`ఏజెన్సీల గుట్టు రట్టు చేసేవారెవరు!
`ఏజెన్సీల ముసుగులో వున్న మిల్లర్లు పదేళ్ల మినహాయింపు తెచ్చుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
`ఏజెన్సీలే ధాన్యం కొలుగోలులో కీలకమైనప్పుడు అధికారులెందుకు?
`ఇంత పెద్ద సివిల్ సప్లయ్ వ్యవస్థ ఎందుకు?
`అసలైన మిల్లర్లకు దిక్కు తోచని పరిస్థితి ఎందుకు?
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్రంలో రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని ఏజెన్సీలు దారి మళ్లిస్తున్నాయి. ధాన్యం పేరు చెప్పి దోచుకుంటున్నాయి. దళారులుగా మారిన ఏజెన్సీల మూలంగా రాష్ట్రంలోని వరి ధాన్యానికి లెక్కాపత్రం లేకుండాపోతోంది. రైస్ మిల్లర్లను నుంచి ధాన్యం సేకరించాల్సిన దళారీ సంస్ధలు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చేరాల్సిన బియ్యాన్ని చేరకుండా చేస్తున్నారు. మొత్తానికి అటు మిల్లర్ల నెత్తిన చెయ్యి పెడుతున్నారు. ప్రభుత్వాదాయానికి గండిపెడుతున్నారు. రెండు వ్యవస్ధల మద్య వారధిగా వుండాల్సిన ఏజెన్సీల మాయా జాలం మూలంగా మొదటికే మోసం వస్తోంది. ప్రభుత్వం కుదేలౌతోంది. ఇక్కగ కొన్ని విషయాలు ఆసక్తిగానూ, ఆశ్చర్యంగానూ వుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పండిరచిన వరి ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించిన సందర్భంలో మిల్లర్లు, ఇతర వ్యాపారులైన దళారులు కొనుగోలు చేసేవారు. కొంత సివిల్ సప్లైయ్ శాఖ కొనుగోలు చేసేది. అయితే రైతులు సకాలంలో డబ్బు చేతికందక ఇబ్బందులు పడుతుండేవారు. దాన్యం సేకరించిన వారి చుట్టూ రైతులు తిరగాల్సివచ్చేది. పైగా వడ్ల నాణ్యతపేరుతో అనేక కోతలు కోశేవారు. కొనుగోలు మాయాజాలంలో రైతులు నష్టపోయేవారు. తెలంగాణలో రైతులు ఆ రకంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఒక వేళ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా, దళారులు చెల్లించేవారు. రైతులు అలా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్దితి మారింది. రైతులు పండిరచినధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనడం మొదలుపెట్టింది. రైతులను దళారులు మోసం చేయకుండా అడ్డుపడ్డట్టైంది. రైతులు పండిన పంట అమ్ముకున్న తర్వాత డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండాపోయింది. పైగా గతంలో ధాన్యంలో తేమ, మట్టి, తడిసిన ధాన్యం వంటి కొర్రీలు పెట్టి కొనుగోలును అడ్డికిపావు శేరు కొనుగోలు చేసేవారు. ఒక వేళ తడిసిన ధాన్యం రైతులు అమ్ముకోలేని పరిస్ధితులు కూడా ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఆరుగాలం కష్టించి పండిరచిన వడ్లు నీళ్లపాలై రైతులు కన్నీటి పాలయ్యేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కొనుగోలులో పెద్దఎత్తున మార్పులు తెచ్చారు. ఇది రైతులకు మేలు చేసినా, రైస్ మిల్లర్లకు వరంగా మారింది. కాని ఇంత కాలం ప్రభుత్వం ఇస్తున్న ధాన్యాన్ని మిల్లర్లే మాయం చేస్తున్నారన్న అపోహ అంతాటా వుంది. కాని ప్రభుత్వాలు దాన్యం సేకరణ కోసం ఏజెన్సీలు ఏర్పాటు చేసినట్లు చాలా మందికి తెలియదు. దాంతో మిల్లర్లనే వేలెత్తి చూపడం అలవాటుచేసుకున్నారు. కాని మిల్లర్లు మింగేది కొద్దిగానే అంటున్నారు. అది కూడా నిజమైన మిల్లర్లు తిన్నది ఏమీ లేదని, మిలర్ల ముసుగోలు వున్న కొంత మంది మిల్లులే లేని వాళ్లున్నారన్న సత్యాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మిల్లులేని మిల్లర్లు రింగుగా మారి, మిల్లర్ల వద్దనున్న ధాన్యాన్ని తమ ధాన్యంగా లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఘటనలు చూస్తూనేవున్నాయి. కాని ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లర్లనుంచి ఏజెన్సీలునేరుగా సేకరించాలి. కాని ఆ పని చేయడం ఎజెన్సీలు చేయడం లేదు. మిల్లర్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అలా వసూలు చేసిన సొమ్మును ఏజెన్సీలు ప్రభుత్వానికి చెల్లించడం లేదు. నేరుగా వారి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. ప్రభుత్వాదాయానికి ఏజెన్సీలు గండి పెడుతున్నారు. దాంతో ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయాల ఆదాయం రాకుండా పోయింది. ఇప్పటి వరకు మిల్లర్లకు, సివిల్ సప్లయ్ అధికారులకు మధ్య వున్న అవగాహన ఒప్పందం మూలంగానే నష్టం జరుగుతుందనుకుంటున్నారు. కాని ఏజెన్సీలు పౌరసరఫరాల శాఖను ఆడిస్తున్నారన్న సంగతి తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వమే నేరుగా రైతులకు దాన్యానికి సంబంధించిన డబ్బులు అందిస్తోంది. నేరుగా రైతు అమ్మిన వడ్లకు ఖరీదు కట్టి, నాలుగు రోజుల్లో రైతు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఆ వడ్లను సివిల్ సప్లయ్ అధికారులు నేరుగా వడ్లను మిల్లర్లకు అందిస్తే సరిపోతుంది. కాని ఇక్కడ ప్రభుత్వానికి, మిల్లర్లకు మ ధ్య ఎజెన్సీలు వచ్చి చేరాయి. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరిస్దితి లేదు. దళారీ వ్యవస్ద లేదు. నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి వడ్లను మిల్లర్లుకు ష్యూరిటీ లెక్కన వడ్ల ఇస్తున్నారు. మిల్లింగ్ చేసినందుకు 110 రూపాయలు చెల్లిస్తున్నారు. తర్వాత సివిల్ సప్లయ్ అధికారులు ఆ బియ్యాన్ని గోడౌన్లకు చేరవేస్తున్నారు. కాని తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదు. తెలంగాణలో మిలర్లకు మిల్లింగ్ చేసినందుకు కేవలం 10 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించాల్సిన ఏజెన్సీలు వడ్లకు డబ్బులు వసూలు చేసి చేతులు దలుపుకుంటున్నారు. ఇది మిల్లర్లకు పెద్దఎత్తుననష్టం తెచ్చిపెడుతుంది. అందువల్ల ఈ డొంక తిరుగుడు వ్యవహారం ఎందుకు అని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీల మూలంగా అటు మిల్లర్లు బతికింది లేదు. ఇటు ప్రభుత్వానికి సకాలం డబ్బు జమ జరిగింది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళారుల మూలంగా ఒరిగిందేమీ లేదు. నష్టమే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లాభం లేదు. ఈ వ్యవస్ధ ఒక్క తెలంగాణలోనే వుండడం గమనార్హం. ఇలాంటి వ్యవస్ధ మూలంగా కేవలం అక్రమ మిల్లర్లు మాత్రమే లబ్ధిపొందుతున్నారు. అసలైన మిల్లర్లు అవస్ధలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం వుంద. ముందు ప్రభుత్వం మిల్లర్లను పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసవరం వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఏనాడు మిల్లర్లతో సమావేశమైంది లేదు. వారి సమస్యలు తెలుసుకున్నది లేదు. వారికి, ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్ధ అవసరం లేదని చెప్పుకునే సమయం ఇచ్చింది లేదు. తర్వాత వచ్చిన గంగుల కమలాకర్ కూడా ఈటెల దారిలోనే నడిచారు. ఆయన కూడ ఏనాడు మిల్లర్లను పిలిచి మాట్లాడిరది లేదు. మిల్లర్ల గోడు విన్నది లేదు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై పది నెలలైనా మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేయలేదు. మిల్లర్లతో ప్రభుత్వం మాట్లాడితే అసలు సమస్య తెలుస్తుంది. ప్రభుత్వానికి అందాల్సిన వేల కోట్ల సొమ్ము ఎవరి పాలైందో తేలేది. దోషులెవరో అప్పుడు తెలిసిపోతుంది. దోచుకున్న వారి బాగోతమంతా బైట పడుతుంది. ఇక్కడ ఏజెన్సీల అవతారం ఎత్తిన వారు ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదు. తెలంగాణలోని కొంత మంది పేరు మోసిన మిల్లర్లే ఈ అవతారం ఎత్తినట్లు కూడా తెలుస్తోంది. వారి మాటలు నమ్మి గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నది కూడా తేలిపోతుంది. రైతులకు నేరుగా డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు, ఆ వడ్లను మిల్లర్లకు ఇస్తున్నప్పుడు చూసుకోవడానికి తెలంగాణలో పౌరసరఫరాల శాఖ వ్యవస్ధ వుంది. కొన్ని వేల మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. వాళ్లు చేయాల్సిన పని కూడా ఇదే..మరి ఇంత పెద్ద వ్యవస్ధను వదిలిపెట్టి, మధ్య నలుగురు మధ్య దళారులను నమ్మి వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని ఎలా అప్పగిస్తారు? ఎందుకు అప్పగించారు? ఎవరి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారన్నది కూడా తెలియాల్సిన అవసరం వుంది. ఏజెన్సీలకు పౌరసరఫరా వ్యవస్ధకు మించిన వ్యవస్ధ వుందా? అలాంటప్పుడు ఇంత పెద్ద వ్యవస్ధ ఎందుకు? నేరుగా ఏజెన్సీల నుంచి ముందు డిపాజిట్లు సేకరించి, ధాన్యం వాళ్లకు ఇచ్చేస్తే సరిపోతుంది. పౌరసరఫరాల శాఖ మూసేస్తే ఓ పని అయిపోతుంది. అధికారులంతా ఏజెన్సీలకు కొమ్ముకాయడమేమిటి? ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏజెన్సీల చేతుల్లో అధికారులున్నారా? అధికారుల చేతుల్లో ఏజెన్సీలు పనిచేస్తున్నాయా? అర్ధం కావడంలేదు. ఒక వేళ అదే జరిగితే అధికారులు ఎందుకు స్పందించడం లేదు. ఏజెన్సీ నుంచి వసూలుచేయాల్సిన సొమ్మును మిల్లర్లనుంచి వసూలు చేసేందుకు ఎందుకు తోడ్పడుతున్నారు. ఇలాంటి అనేక సందేహాలకు సమాధానం దొరకాలంటే ప్రభుత్వం నేరుగా మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే అసలు బాగోతాలన్నీ బైటకు వస్తాయి.