భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వ వార్డులో జరుగుతున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిలవ రాజయ్య, తోట సుగుణ ల గృహాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో గణపురం మండలంలోని బుర్రకాయలగూడెం, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డును పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వేలో కుటుంబంలోని మహిళ పేరు, భర్త, పిల్లల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు, ప్రస్తుత వయస్సు తదితర వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబం యొక్క సమగ్ర వివరాలకు సంబంధించిన షీట్ ప్రత్యేకంగా ఉండాలని ఆయన సూచించారు. బుర్రకాయలపల్లిలో 161 గృహాలు, మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు లో 181 గృహాల్లోని ప్రజల సమాచారం సేకరణ చేస్తున్నామని అన్నారు. సర్వే సమగ్రంగా జరగాలని ప్రతి ఇంటిని నుండి కచ్చితమైన తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి తప్పులకు తావు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ అధికారులకు అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు. ఈ పైలట్ సర్వే ప్రక్రియ 7వ తేదీ వరకు నిర్వహించి వెంటనే ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాలని నోడల్ అధికారిని ఆదేశించారు.
సర్వేలో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆర్డీవో మంగీలాల్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు