# మొదలైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు.
# తొమ్మిది రోజుల పాటు జరుగనున్న
బొడ్డెమ్మ పండుగ.
నర్సంపేట,నేటిధాత్రి :
బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి.అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు.ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.తెలంగాణ సంప్రదాయం పాటించే వారు తప్పకుండా బొడ్డెమ్మ పండుగ జరుపుకొంటారు.బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది.ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకొంటారు. భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు, వినాయక చవితి మరుసటి రోజు బహుళపంచమి నుంచి 9 రోజులు ఈ పండుగను జరుపుకొనేవారు. మరికొందరు 5 రోజులు, మూడు రోజులు దశమి, ద్వాదశి నుంచి జరుపుకుంటారు.ఈ పండుగను బొడ్డెమ్మల పున్నమి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పండుగను చిన్నవారైన ఆడపిల్లలు, పెండ్లికాని అమ్మాయిలతో జరిపిస్తారు. ఇందులో పెండ్లి ఐనా స్త్రీల ప్రమేయం ఎక్కువగా ఉండదు.కన్నెపిల్లలు, బాలికలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో మంచి భర్త రావాలని కోరుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకొంటారు.
బొడ్డెమ్మలను పెట్టి, రకరకాల పూలతో అలంకరించి, కన్నెపిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్- బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడారు.
చివరీ రోజు నిద్రపో బొడ్డెమ్మ నిద్ర పోవమ్మా. నిద్రాకు నూరేండ్లు-నీకు వెయ్యేండ్లు. నిను గన్న తల్లీకీ నిండా నూరేండ్లు అంటూ పాడి తర్వాత బొడ్డెమ్మను జాగ్రత్తగా తీసి దేవుని ముందు పెడతారు.ఇలా 9 రోజుల పాటు ఆడి చెరువు దగ్గరికి తీసుకువెళ్తారు.అక్కడ చెక్కపీట మీద నుంచి బొడ్డెమ్మను తీసి నీటిలో నిమజ్జనం చేస్తూ పోయి రా బొడ్డెమ్మ పోయి రావమ్మా అంటూ బొడ్డెమ్మతో పాటు ముందురోజుల వాడిపోయిన పూలను కూడా చెరువులో నిమజ్జనం చేస్తారు.ఈ నేపథ్యంలో సోమవారం బొడ్డెమ్మల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నర్సంపేట డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో బొడ్డెమ్మలను ఏర్పాటు చేసి పండుగ వేడుకలను ప్రారంభించారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో మాజీ ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బొడ్డెమ్మ పండుగ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభం చేశారు.దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలుపెట్టారు.ఈనేపథ్యంలో మహిళలు,చిన్నారుల మధ్యలో బొడ్డెమ్మలను పెట్టి, రకరకాల పూలతో అలంకరించి, కన్నెపిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్- బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడారు.