
# ఏఐఎఫ్ డిడబ్ల్యు జిల్లా విస్తృత సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ.
నర్సంపేట,నేటిధాత్రి :
మహిళలను పట్టిపీడుస్తున్న సమస్యల పరిష్కారానికి మహిళా హక్కుల రక్షణకు పోరాటాలే ఏకైక పరిష్కారమని ఆ దిశలో మహిళా ఉద్యమాలను క్షేత్రస్థాయిలో చేపట్టాలని ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ పిలుపునిచ్చారు.సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జిల్లా విస్తృత సమావేశం గటికె మమత, తుత్తరు రాజక్కల అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన వంగల రాగసుధ మాట్లాడుతూ మానవజాతి సృష్టికి మూలమైన మహిళలను సామాజికంగా,ఆర్థికంగా ఎదగనీయకుండా అణిచివేస్తున్న పురుషాధిక్య సమాజంలో మహిళ హక్కులను కాలరాస్తూ,పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాలను నిలదీసే విధంగా సమాజంలో సగభాగమైన మహిళా లోకం ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ క్రమంలో అన్ని రంగాలలో 50 శాతం మహిళ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మనువాద పాలకులు మహిళలను వంటింటి కుందేలుగా అంగట్లో సరుకులుగా చిత్రీకరించి స్వేచ్ఛ సమానత్వం లేకుండా మూఢత్వంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో దేశంలో పెరిగిపోతున్న లైంగిక దాడులు, హత్యలు,ఆడవాళ్లకు పెనుసవాలుగా మారాయని మహిళలు తమను తాము రక్షించుకునే విధంగా ధైర్యంగా ముందుకు సాగే ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని అందులో భాగంగానే ఏఐఎఫ్ డిడబ్ల్యు క్షేత్రస్థాయిలో మహిళలను చైతన్య పరుస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే మహిళ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో రైతు, వ్యవసాయ,కార్మిక,ప్రజానాట్యమండలి,విద్యార్థి సంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులు పెద్దారపు రమేష్,గోనె కుమారస్వామి,నర్రా ప్రతాప్,కన్నం వెంకన్న,కొత్తకొండ రాజమౌళి,మార్త నాగరాజు,మహిళా సంఘం జిల్లా నాయకులు గటిక జమున, పేరబోయిన రమ,మంద మల్లికాంబ, మార్త సుధ,జన్ను జమున, గడ్డం స్వరూప,చొప్పరి పద్మ, పెండ్యాల లలిత, మామిండ్ల వీరలక్ష్మి, ఈక యమున, గణిపాక బిందు, ఈసంపెళ్లి గీత, తదితరులు పాల్గొన్నారు.