కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి

ఐఎఫ్టియు జిల్లా నాయకులు కొమరం శాంతయ్య,యాసారపు వెంకన్న.

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ సోమవారం గుండాల మండల కేంద్రంలో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కార్మిక సంఘాల నాయకులు తాహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్న, ఐఎఫ్టియు ఏరియా కమిటీ కార్యదర్శి గడ్డం రమేష్ లు మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలకులపై కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అణిచివేయటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విటీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వేతన కోడ్, వర్కింగ్ కండిషన్ కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్లను అమలు జరిపితే కార్మికులకు ఉన్న ప్రస్తుత రక్షణలన్నీ కోల్పోయి యాజమాన్యాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి జీవించాల్సి వస్తుందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లలోకార్మిక హక్కులను కాలరాసి,యాజమాన్యాలకు లాభం కలిగించే అనేక అంశాలు ఉన్నాయని, ఇప్పటికే యాజమాన్యాలకు అనుకూల నిర్ణయాలు జరుగుతున్నాయని, ఈ నాలుగు కోడ్ల అమలు అయితే కార్మిక హక్కులన్నీ రద్దు అవుతాయని వారన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉద్యమాలు బలోపేతం చేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మొక్క నరీ ,గడ్డం కృష్ణ, మాడే సంతోష్, పూనెం సాంబశివరావు, కల్తీ రాంబాబు, యాప రామస్వామి, మానాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *