మతోన్మాదం, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే సాయుధ పోరాట అమరవీరులకు నిజమైన నివాళి ‌

ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :


తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూభూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల కలిసి ప్రజలపై చేసిస్తున్న దాడులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బిజెపి ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాష్యాలు చెప్తున్నదని అన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమురయ్య, షేక్ బందగి, ఠాన్ నాయక్, షోయబుల్లాఖాన్ లాంటి ఎందరో వీరులు అశువులుబాసారని అన్నారు. వీళ్లంతా కుల, మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణిచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో పాటు మగ్దూం మొహియుద్దీన్, బిమిరెడ్డి నర్సింహ రెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, మల్లు స్వరాజ్యం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. ఆ పోరాటంలో సుమారు 4000 మంది అమరులయ్యారని, 3000 గ్రామాలలో ప్రజారాజ్యాలు ఏర్పడ్డాయని, పదిలక్షల ఎకరాల భూ పంపిణీ ఆ పోరాటం చేసిందని చెప్పారు. అలాంటప్పుడు హిందూ, ముస్లింల మధ్య పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‌ తెలంగాణ రైతాంగ పోరాటంలో సోయబుల్లాఖాన్, షేక్ బందగి, మగ్దూం మోహినుద్దీన్, జవ్వాద్ రజ్వీ, ఆలం ఖుందుమీరి, షౌకత్ ఉస్మాని తదితర ముస్లిం నాయకులు నిజాం పైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజలను పట్టిపీడించింది, వెట్టిచాకిరి చేయించుకున్న వారిలో విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప రెడ్డి లాంటి హిందువులైన జమీందారులు, జాగిర్దారులు, దొరలు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, పటేల్, పట్వారిలే మెజారిటీగా ఉన్నారని, వీరి ఆగడాలకు వ్యతిరేకంగానే ప్రజలంతా కుల, మతాలకతీతంగా ఐక్యంగా సాగించిన పోరాటాన్ని మతం పేరుతో ఎలా వక్రీకరిస్తారని ఆయన విమర్శించారు. బిజెపి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులుమితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. మన ప్రాంతంలో ఎర్రబోతు రామిరెడ్డి ఉరి శిక్ష పడితే అమెరికా జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసి వార్త ప్రచురిస్తే దానిని చూసి ప్రపంచవ్యాప్తంగా పదహారేళ్ల అతనికి ఎలా ఉరిశిక్ష విధిస్తారని ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిందని, ఆ ఉద్యమాన్ని చూసి బ్రిటన్ కు చెందిన జాన్ ఫ్రిటర్ కోర్టులో వాదించి ఉరిశిక్షను రద్దు చేయించారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల్లో భాగంగానే అల్వాల నర్సింహారెడ్డి కూడా యూనియన్ సైన్యాలకు దొరకకుండా పోరాడుతూ తమ తుపాకీతో తామే కాల్చుకున్నారని పేర్కొన్నారు. వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని పోరు చేసిన అమరుల త్యాగాలకు మతం రంగు పులిమే మతోన్మాద చర్యలను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిదానం చేసిన రైతాంగ సాయుధ పోరాట అమరుల త్యాగాలను కించపరచడమేనని అన్నారు. అమరులను ‌గుర్తు చేసుకోవడం అంటే, మతోన్మాదుల ఆగడాలకు, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ అమరులు చూపిన బాటలో పయనించడమేనని, నేడు మన ముందున్న కర్తవ్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో CPM జిల్లా జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, మహ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, గంజి మురళీదర్, మల్లం మహేశ్, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, వెంకన్న, మన్నెం బిక్షం, సరోజ, నర్సింహ, సైదాచారి, అరుణ, పోలె సత్యనారాయణ, బొల్లు రవీంద్ర కుమార్, మహబూబ్ అలీ, రాములు, నగేష్ , నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!