విలీమనా! విమోచనా! విద్రోహమా?

https://epaper.netidhatri.com/view/378/netidhathri-e-paper-17th-september-2024%09

`సెప్టెంబరు17 మీద ఇన్ని చిక్కుముడులెందుకు?

`ఇన్ని రకాల అభిప్రాయాలెందుకు?

`ఏది నిజం ఏది అబద్దం!

`విలీనం నిజమే నిజాం రాజప్రముఖ్‌ ఎలా అయ్యారు!

`విమోచనం నిజమే అయితే దొరలు, దేశ్‌ ముఖ్‌లు నాయకులు ఎలా అయ్యారు?

`విద్రోహం నిజమేనా అంటే నిజాం నుంచి విముక్తి జరగలేదు!

`ఒక రకంగా ఈ మూడు నిజమే!

`సెప్టెంబరు17 తో తెలంగాణలో వెట్టి చాకిరీకి విమోచనం జరిగింది.

`ఇండియన్‌ యూనియన్‌లో తెలంగాణ విలీనమైంది.

`తెలంగాణను మళ్ళీ నిజాం చేతిలో పెట్టడంతో విద్రోహం జరిగింది.

`ఏ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందో అదే నిజాం ఆరేళ్లపాటు గవర్నర్‌గా వున్నారు.

`విమోచనం జరిగినా లాయక్‌ అలీ, ఖాసిం రజ్వీలకు శిక్షలెందుకు పడలేదు.

`ఇది రెండు మతాల పంచాయతీ కాదు.

`అలా అయితే షోయబుల్లా ఖాన్‌ నిజాంకు వ్యతిరేకంగ కలమెత్తాడు.

`సాక్షాత్తు నిజాం సోదరుడు కూడా తెలంగాణ విముక్తి పోరాటం చేశారు.

`ముగ్థూమ్‌ మొహినిద్దీన్‌ నిజాంకు వ్యతిరేకంగా కవిత్వం రాశాడు.

`తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌ హడావుడి ఎందుకు చేసింది.

`తర్వాత ఎందుకు వదిలిపెట్టింది?

`ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సెప్టెంబరు17 ను ఎందుకు జరపలేదు!

`ఇప్పుడు బిజేపి చెప్పేదానిలో నిజమెంత వుంది?

`రాజకీయ అవసరాల కోసమే తప్ప, విమోచనంపై ఎవరికీ స్పష్టత లేదు.

`అంతా అవకాశవాదం!

`గొప్పల కోసం ఆరాటం.

`చరిత్ర వక్రీకరించి రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17 అనేది ఎడతెగని పంచాయితీగానే మిగిలిపోయింది. ఈ రోజు తెలంగాణ విమోచనా? విద్రోహమా? లేక విలీనమా? అన్న అంశాలపై అనేక రకాలైన అభిప్రాయాలున్నాయి. అందుకే ఎవరికి నచ్చిన రీతిలో వారు సెప్టెంబర్‌ 17 విశ్లేషిస్తూనే వుంటారు. అయితే నిజంగా ఈ రోజును విలీనమే అందామా? అదీ సరైందే..తెలంగాణ ఒకప్పటి హైదరాబాద్‌ సంస్ధానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం జరిగింది. చరిత్ర ప్రకారం ఇప్పటి తెలంగాణ అంటే ఒకప్పటి హైదరాబాద్‌ సంస్ధానం. అందులో మరట్వాడా ప్రస్తుతం మహారాష్ట్రంలో భాగం. బీదర్‌ అది ఇప్పుడు కర్నాటకలో వుంది. హైదరాబాద్‌ సంస్ధానంలో మూడు బాషలు కలిసిన ప్రాంతంగా వుండేది. మొత్తం హైదరాబాద్‌ సంస్ధానంలో 16 జిల్లాలుండేవి. తెలంగాణకు చెందిన 8 జిల్లాలు, మరాఠకు చెందిన 4 జిల్లాలు, కర్నాటకు చెందిన 4 జిల్లాలతో కలిసి వుండేది. 1947లో దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణ మాత్రం ఇంకా నిజాం పాలనలో మగ్గిపోతూవుండేది. అయితే నిజాం ఇండియన్‌ యూనియన్‌ వీలీనయ్యేందుకు ససేమిరా? అన్నారు. తాను స్వతంత్ర దేశంగా వుంటానని తేల్చి చెప్పారు. అవసరమైతే పాకిస్తాన్‌లో కలిపేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. కాని అప్పటికే హైదరాబాద్‌ సంస్ధానంలో దేశ స్వాతంత్య్ర ఉత్సవాలు జరుగుతుండేవి. దాన్ని జీర్ణించుకోలేని నిజాం ప్రజలను చిత్రహింసలకు గురి చేసే ప్రయత్నాలు అనేకం చేశారు. అందులో భాగంగా తెలంగాణలో రజాకార్లను పెంచిపోషించారు. ఖాసిం రజ్వీ లాంటి వారి చేతిలో నిజాం పోలీసులను పెట్టి తెలంగాణ పల్లెల్లో శాంతి లేకుండా చేశాడు. తెలంగాణ పల్లెల్లో ఖాసిం రజ్వీ చేసిన అరచకాలు అన్నీ ఇన్నీ కావు. వీర భైరాన్‌పల్లి, కూటిగల్‌ గ్రామాలలో రజాకార్లు అత్యాచారాలు, హత్యలు ఒక్కసారిగా తెలంగాణ సమాజాన్ని చైతన్యం వైపు తీసుకెళ్లింది. బైరాన్‌పల్లి ఘటనను మరో జలియన్‌ వాలా బాగ్‌ సంఘటనగా గుర్తు చేసుకుంటారు. ఒక్క బైరాన్‌పల్లిలోనే ఒకే రోజు 108 మంది రైతులను కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిరచారు. నిజాం కాలంలో వెట్టి అనేది మరింత ముదిరిపోయింది. దాంతోపాటు హిందువులను ముస్లింలలోకి మార్చేందుకు పెద్దఎత్తున కుట్రలు జరిగాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. యార్‌ జంగ్‌ నేతృత్వంలో మజ్లీస్‌ ఇత్తెహదుల్‌ బైనుస్మలీన్‌ సంస్ధను ఏర్పాటు చేసి, హిందువులను ముస్లింలుగా మార్చుతూవచ్చారు. నానాటికీ నిజాం అరాచకాలు తీవ్రమౌతుండడం, రైతులను వేదిస్తుండడం, మహిళలను చిత్రహింసలకు గురి చేస్తుండడంతో హైదరాబాద్‌లో రామానంద తీర్ధలాంటి వారు పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టారు.

తెలంగాణ పల్లెల్లో కమ్యూనిస్టులు సాయధ పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈ సాయుధ పోరాటాలు శరవేగంగా విస్తరించాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌ సంస్ధానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్‌ పోలో పేరుతో 1948 సెప్టెంబర్‌ 13 మొదలైన చర్య 17తో నిజాం లొంగిపోవడంతో పూర్తయింది. కాని నిజాం ప్రాభవం తగ్గలేదు. నైజాంను ఖైదు చేయలేదు. అసలైన తిరకాసు ఇక్కడే వుంది. రాజ్యాంగబద్దంగా దేశం పూర్తి స్యాతంత్య్రంలో గణతంత్ర దినోత్సవ ఆవిర్భావం వరకు ఎం.కే వెల్లోడిని ముఖ్యమంత్రిగా కొనసాగించారు. జేఎన్‌ చౌదరి గవర్నర్‌గా కొనసాగారు. ఎప్పుడైతే 1950 జనవరి 26లో దేశం పూర్తి గణతంత్ర దేశంగా మారిన తరుణం నుంచి రాజ్‌ప్రముఖ్‌గా నిజాంను కేంద్ర ప్రభుత్వం నియమించడంతో ఇది విద్రహమే అన్న అపవాదు వచ్చింది. అంతే కాకుండా హైదరాబాద్‌ను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసుకునేందుకు కదలిని కేంద్ర బలగాలు, నిజాం సైనికులు కలిసి, సాయుధ పోరాటం చేసేవారిపై పెద్దఎత్తున దమన కాండ జరిపారు. దాంతో హైదరాబాద్‌ ప్రజలు కేంద్రం నిజాంకు సహకరించిందన్న భావనతో విద్రోహ దినంగా చూస్తూ వచ్చారు. ఈ మూడు అభిప్రాయలపై వున్న చిక్కుముడులు ఎప్పుడూ తేగే పరిస్ధితి లేకుండాపోయింది. తెలంగాణ ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం అవకాశం మృగ్యమైంది. ఇక్కడ కమ్యూనిస్టులు చెప్పే మాటలకు, ఇతర ఉద్యమకారులు చెప్పే మాటలకు కూడా కొంత పొంతనలేకుండాపోయింది. నిజాం హిందువులను మత మార్పిడిచేసేందుకు పెద్దఎత్తున కుట్ర చేశాడన్న వాదనలు అనేకం వున్నాయి. అయితే సాయుధ పోరాట సమయంలో, హైదరాబాద్‌ విమోచనంలో అనేక మంది ముస్లింలు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భాలున్నాయి. సంఘటనలున్నాయి. తెలంగాణ సాయధ పోరాటానికి ముందే షేక్‌ బందగీ మరణం తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది. షేక్‌ బందగీ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమకారుడు. హైదరాబాద్‌లో షోయబుల్లాఖాన్‌ అనే జర్నలిస్టు నిజాంకు వ్యతిరేకంగా అక్షర పోరాటంచేశారు. తెలంగాణలో ఆయన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు వార్తా కథనాలు రాశాడు. దాంతో ఆయన కాచిగూడ, చాధర్‌ఘాట్‌ మధ్యలో అర్ధరాత్రి చేతులు నరికేశారు. ముగ్థుం మొహినొద్దీన్‌ అనే రచయిత ఆయన కవితలతో నిజాంకు కంటి మీద కనుకు లేకుండా చేశారు. అందువల్ల నిజాం వ్యతిరేక పోరాటంలో అన్ని వర్గాలు పాలు పంచుకున్నాయి. అందువల్ల హిందువులకు ఆ రోజుల్లో ముస్లింలు వ్యతిరేకం కాదన్న సంకేతాలు కొన్ని వున్నాయి. అంతే కాకుండా స్వయంగా నిజాం సోదరుడే ఆయనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సందర్భం వుంది. మొత్తానికి హైదరాబాద్‌ను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం జరిగింది. కాని ఆనాటి నెత్తుటి మరకలు మాత్రం ఇప్పటికీ పచ్చిగానే వున్నాయి.

మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్‌ 17 అనేది కీలకపాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యమ సమయంలో కేసిఆర్‌తో సహా, బిఆర్‌ఎస్‌, జేఏసి నాయకులంతా సెప్టెంబర్‌ 17 నాటు పెద్దఎత్తున హడావుడి చేసేవి. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని పోరాటం చేశాయి. తెలంగాణ వస్తే సెప్టెంబర్‌ 17 పెద్దఎత్తున ఉత్సవాలు జరిపిస్తాంటూ కేసిఆర్‌ ప్రకటనలు చేసేవారు. అయితే 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు ఉత్సవాలు జరిపించలేదు. తర్వాత అదికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నిర్వహించలేదు. సెప్టెంబర్‌ 17ను నిర్వహిస్తే ఎక్కడ తెలంగాణ ఉద్యమ బీజాలు మళ్లీ చిగురిస్తాయో అన్న అనుమానంతో సెప్టెంబర్‌ 17ను ఒక రకంగా నిర్భంధ దినంగానే చూశారు. అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ వాదులు,కమ్యూనిస్టులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఉమ్మడి పాలకులు ఒప్పుకోలేదు. కాకపోతే అటు కర్నాటకలోనూ, ఇటు విధర్బలోనూ ఏటా విలీన దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ రోజు అక్కడి ప్రభుత్వాలు స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుతుంటారు. అంటే హైదబాదర్‌ రాష్ట్రానికి వచ్చిన అసలైన స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారిక కార్యక్రమాలు చేపడతారు. తెలంగాణలో కూడా విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని పాలకులను ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు. ఆగష్టు 15, జనవరి 26లు నిర్వహించిన ఉమ్మడి పాలకులు అక్టోబర్‌ 1ను తెలుగు రాష్ట్రం అవతరణ దినోత్సవంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సెప్టెంబర్‌ 17ను తొక్కిపెట్టారు. దాంతో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్‌ దీనిని ఒక అస్త్రంగా మల్చుకున్నారు. కాని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకు తెలంగాణ చరిత్రో అంత ప్రాదాన్యత లేదని కొట్టిపారేశారు. ఒక్కసారి కూడా ఆయన అదికారిక కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ విమోచనంలో రాజును నిందించే సమయంలో ముస్లింలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశముంటుందన్న ఒకే ఒక్క కారణంలో కేసిఆర్‌ నిర్వహించలేదు. దీనిని బిజేపి అనుకూలంగా మల్చుకున్నది. బిజేపి తాము అధికారంలోకి వస్తే అధికారింగా నిర్వహిస్తామని ప్రకటిస్తూ వచ్చింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో విలీన దినోత్సవాలు బిజేపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను ప్రజా పాలన దినోత్సవంగా జరుపుతామని ప్రకటించారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమే అవుతుంది. సెప్టెంబర్‌ 17 అనేది తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన రోజే అనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!