
– రక్తహీనత(ఎనిమీయ)ను పారదోలాలి…
– జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీ రాజం
సిరిసిల్ల(నేటి ధాత్రి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ మాసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా కొనసాగించబడుతుంది. ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ సూచనలు, సలహాలతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా
జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీ రాజం మాట్లాడుతూ
మొత్తం 587 అంగన్వాడీ కేంద్రాలలో గానూ మొదటి దపాలో ఈరోజు గర్భిణీలు సుమారు 56 కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు, కిశోర బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు వారి సిబ్బంది అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలోని వైద్యులు మెడికల్ ఆఫీసర్లు ఆశ మరియు అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీ రాజం వేములవాడ పట్టణము, మారుపాక ,లింగంపల్లి, హనుమాజీపేట బొల్లారం ,మంగళపల్లి గ్రామాలలో సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్న రక్తహీనత నిర్ధారణ పరీక్షలను పరిశీలించడం జరిగింది. అలాగే రక్తహీనత లోపం కనపడిన వారికి మిగతా లబ్ధిదారులందరికీ రక్తహీనతను అధిగమించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో వివరించడం జరిగింది. ఆకుకూరలు, చిక్కుడు జాతి విత్తనాలు, మొలకెత్తుతున్న విత్తనాలు, చికెన్, ఫిష్, స్థానికంగా లభించే అటువంటి అన్ని రకాల ఆకుకూరలు, పాలకూర,మెంతికూర తోటకూర, బచ్చలి కూర, గోంగూర తో పాటు తృణధాన్యాలు మిల్లెట్స్ అయినటువంటి రాగులు, సజ్జలు జొన్నలు, కొర్రలు లాంటి ఆహార పదార్థాలను విరివిగా తీసుకోవాలని సూచించారు. వాటన్నింటినీ తప్పనిసరిగా వాడాలని సూచించారు. అలాగే పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండాలంటే మన ఆహార పదార్థాల్లో అన్ని రకాలైనటువంటి ఈ సమతుల ఆహార పదార్థాలు ఉండాలని సూచించారు. మనం వైద్యశాలకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు మందులకు ధనాన్ని దుర్వినియోగం చేసుకునే బదులుగా మంచి ఆహారం తీసుకొని మన బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు, దీనిని మించి ఏది ఉండదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ సుచరిత, సూపర్వైజర్ అంజమ్మ , డి హబ్ కోఆర్డినేటర్ రోజా, సఖి కౌన్సిలర్ సుమలత, అంగన్వాడీ టీచర్లు ఆయాలు, ఆశాలు, హెల్త్ సూపర్వైజర్లు మొదలైన వారు పాల్గొన్నారు….