సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు పూర్తిగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని, సర్పంచులు
అబద్ధం చెపుతున్నారని మంత్రులు అంటున్నారని సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లిమండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నా రెడ్డి అన్నారు.
-ఏది అబద్ధం ?
ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది అబద్దమా?
కేంద్రం నుండి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించింది అబద్దమా?, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్దమా?, మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్ల లో నిర్బంధించింది అబద్దమా?, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అటకెక్కడం అబద్దమా?, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ రోగాలు ప్రబలడం అబద్ధమా?, రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించకపోవడం అబద్ధమా?, 8 నెలలుగా జడ్పిటిసిలు, ఎంపిటిసిలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం అబద్ధమా?, అని చదువు అన్నారండి ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెల నెల 275 కోట్లు, సంవత్సరానికి 3,300 కోట్ల నిధుల విడుదల చేసింది నిజం కాదా? అని అన్నారు.
ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదన్నారు. ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజమని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని చదువు అన్నారెడ్డి కోరారు.