వ్యాపారం బంగారం!

`ధర తగ్గిందా…అమ్మకం పెరిగిందా!

`బంగారం తగ్గుదల నిజమా!

`సుంకం తగ్గిస్తే తగ్గిందెంత!

`ఈ పదేళ్లలో పెరిగిందెంత!

`ఆ వ్యత్యాసంతో పోలిస్తే ఊరట ఎంత!

`ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాడు 20 వేలు.

`పదేళ్లలో పెరిగింది నాలుగు రెట్లు!

`సుంకం తగ్గిస్తే జరిగిన మేలు 3 వేలు!

`లాభం ఎవరికి! నష్టం ఎవరికి!!

`ట్రేడిరగ్‌ వర్గాలు చెబుతన్న మాటలేమిటి!

`వాస్తవ పరిస్థితులు ఎలా వున్నాయి!

`వేలకు వేలు తగ్గితే వ్యాపారాలకు ఇబ్బంది వుండదా!

`బంగారం మీద లాభం లేకుండా అమ్మకాలుంటాయా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సామాన్యుల జీవితాలలో బంగారం ఒక అందని ద్రాక్ష. సంపన్నుల జీవితాలకు బంగారం ఒక సంపద. సామాన్యుడు ఎంత కష్టపడినా సంపాదనలో రూపాయి ఆదా కాని రోజులివి. ఇలాంటి సమయంలో ధరలు తగ్గుతాయని, సుంకాలు తగ్గించామని చెప్పడం కొనుగోలు పెంచాలన్న తపనే తప్ప మరొకటి కాదు. పేద ప్రజలకు అందుబాటులో కి తెచ్చిన దాంట్లో నిజం లేదు. సుంకం తగ్గిందని జనాలు ఎగబడినా అంతర్జాతీయ మార్కెట్‌ పేరుతో పైసాకు పైసా వసూలు చేసే వ్యాపారుల తగ్గించి అమ్మకాలు చేయడం అంటే ఒంటె పెదవులకు నక్క ఆశపడినట్లే వుంటుంది. కూలీ ధర రూపాయి కూడా పెరగని, నిత్యం పెరుగుతున్న ధరలతో సతమతమౌతున్న సగటు వ్యక్తి జీవితంతో బంగారం ఆటలాడుకుంటోందంటే అతిశయోక్తి కాదు. పాలకులు ఎప్పుడూ ఎటువైపు నిలుస్తారని ప్రశ్నిస్తే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ఒక్కటే…సంపన్నులకు మేలు చేసే పాలకులే తప్ప పేదలకు న్యాయం చేసే పాలకులు ఎప్పుడూ వుండరు. పైకి మాత్రం పేదల గురించి, పేదరికం గురించి రాజకీయ నాయకులు, పాలకులు గొప్పగా చెబుతారు. పేదల జీవితాలు బంగారు మయం చేస్తామంటారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రజలు ఇదే మాట వినీవినీ విసిగిపోయారు. గత పదేళ్లలో మన దేశ ప్రగతి ఎంత మేర పెరిగిందంటే కాగితాలపై లెక్కలు గొప్పగా వుంటాయి. క్షేత్ర స్థాయిలో ప్రజల జీవితాలు దుర్భరంగా వుంటాయి.

సరిగ్గా పదేళ్ల క్రితం దేశ ఆర్థిక పరిస్థితికి ఇప్పటికీ ఎంతో తేడా వుంది. పురోగతి ఎంతో వేగవంతమైంది. ఇది పాలకులు చెప్పే మాట. ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీలో పైపైకి ఎగబాకుతున్నామని ఓ వైపు చెబుతారు. దేశంలో ఇప్పటికీ 85 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తున్నామని ప్రకటిస్తారు. దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నుంచి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా నిలుస్తుందంటున్నా పేదరికం ఇంకా ఎందుకు పెరుగుతోంది! ఉపాధి అవకాశాలు ఎందుకు సన్నగిల్లితున్నాయి. సగటు వ్యక్తి జీవన ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయి. ఇవి అడిగే రాజకీయ నాయకులు ఎవరూ వుండరు. ప్రతి పక్షంలో వున్నప్పుడు ఒక మాట. పాలక పక్షం కాగానే మరో మాట. ఎన్నికల ముందు ఒక మాట. గెలిచాక మరో మాట. ఎన్నికల ముందు పేదల జపం. ఎన్నికలయ్యాక సంపన్నులతోనే సహవాసం. ఇంతకన్నా చెప్పుకోవడానికి గొప్పగా లేని రాజకీయంలో పేదల ఎప్పుడూ సమిధలే..అందుకే ఈ కష్టాలు. వ్యాపారం బంగారంగానే ఎప్పుడూ సాగుతుంది. మన దేశంలో ధర ఎప్పుడు తగ్గుతుందా! కొనుగోలు చేసుకుందామని ఆశపడే మధ్యతరగతి లేదు. బంగారం ధరలు సగానికి పైగా తగ్గినా కొనుగోలు స్థమత వారిలో లేదు. ఇప్పుడు బంగారం మీద సుంకం తగ్గించిన ప్రభుత్వం పేద ప్రజల మీద ప్రేమతో కాదు. అమ్మకాలు లేక మురిగిపోతున్న నిల్వలను వదిలించుకోవాలనుకుంటున్న వ్యాపారుల కోరిక మేరకు జరిగింది. అంతే గాని ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి పుటుక్కున ప్రేమ పుట్డుకొచ్చి కాదు. మనం బాగా గమనిస్తే దశాబ్ద కాలం క్రితం వరకే బంగారం లెక్కలు పరిగణలోకి తీసుకుందాం.

2014 బంగారం ధర రూ. 20 వేలు వుంది. ఈ పదేళ్లలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇక 2000 సంవత్సరంలో బంగారం ధర కేవలం రూ. 4వేలు వుండేది. పదిహేను సంవత్సరాలలో అది అపుడిరత, అప్పుడిరత అన్నట్లు పెరిగేది. కానీ ఇప్పుడు ఇష్టానుసారం ఎప్పుడూ పెరుగుతూ, అప్పుడప్పుడు తీపి రుచి చూసినట్లు తగ్గుతుంది. కాదు తగ్గించినట్లు ప్రకటిస్తారు. మరుసటి రోజే పెంచేస్తారు. తగ్గించిన రోజు స్టాక్‌ లేదంటారు. ఇదంతా మార్కెట్‌ను గుప్పిట్లో పెట్డుకొని లక్షల రూపాయల వ్యాపారం సాగించే బులియన్‌ మార్కెట్‌ చేసే మాయాజాలం. ఇవన్నీ సామాన్యుడి అవసరం లేదు. తెలియవు. ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనాలన్న ఆలోచన చేయడం లేదు. పైగా ఒక వేళ ఏళ్ల తరబడి దాచుకున్న సొమ్ముతో బంగారం కొనుగోలు చేసుకున్నా కొత్త చట్టాలు బయపెడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనుగోలు చేస్తున్నారంటే సంపాదనా పరులు బ్యాంకులను నమ్ముకోలేక బంగారం కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు వున్న రియల్‌ రంగం ఒక్కసారిగా కుదేలైంది. చిరువ్యాపారాలు కనుమరుగౌతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వాళ్లు లేకపోతున్నారు. దాంతో కేంద్రం పేదల మీద ప్రేమ కురిపించింది. మన లోతుగా ఆలోచిస్తే బంగారం విషయంలో కేంద్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేసిందనే చెప్పాలి. మొదట్లో బంగారం కొనుగోలుపై నిఘా పెంచింది. కొనుగోలు దారులైన వాళ్లు టాక్స్‌లు ఎగ్గొట్టి బంగారం కొనుగోలు చేసి తప్పించుకుంటున్నారన్న నిర్ణయానికి వచ్చింది. తప్పు చేశామని భావించి మళ్ళీ బంగారు బాండ్ల పథకం తెచ్చింది. అదీ సఫలీకృతం కాలేదు. ఇప్పుడు బంగారం కొనుగోళ్ళ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. బులియన్‌ మార్కెట్‌ తలకిందులౌతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ తో స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఇది పైకి చెప్పే మాట. ఇక్కడ రెండు తిరకాసు అంశాలుంటాయి. స్టాక్‌ మార్కెట్‌ దూసుకుపోతే సామాన్యుడికి ఒరిగేదేమీ వుండదు. దేశమంతటా ఒకే పన్ను విధానం అమలు చేస్తున్నారన్న భ్రమలో ప్రజలను నెట్టేస్తున్నారు. కానీ అది వాస్తవిక దృక్పథంలో అమలు కావడం లేదు. అదే నిజమైతే బంగారం, వెండి ధరలు రాష్ట్రానికో రకంగా ఎందుకుంటున్నాయి. వీటిని ఎవరూ పట్టించుకోరు. అడిగే తీరిక ఎవరికీ లేదు. సమాధానం చెప్పాల్సిన వాళ్లు చెప్పరు. ఇటీవల ఓ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో గతంలో వ్యాపారులు చెల్లించే ఆదాయ పన్ను ఎక్కువగా వుండేది. గతంలో ముప్పై ఐదు శాతానికి పైగా వుండేవి. వ్యక్తిగత ఆదాయ పన్నుల శాతం తక్కువగా వుండేది. ఇప్పుడు వ్యాపార వర్గాలు చెల్లిస్తున్న ఆదాయ పన్ను కన్నా వ్యక్తిగత ఆదాయ పన్ను విపరీతంగా పెరిగింది. అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను విషయం మార్పులు తెచ్చి పన్నులు పెంచారు. వ్యాపార వర్గాల పన్నులు తగ్గించారు. వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూలు గణనీయంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యుల జీవితాలు కుదేలౌతున్నాయే తప్ప వికసించడం లేదు.

కేంద్ర ప్రభుత్వం గొప్పగా వికసిత భారత్‌ అని చెబుతున్న మాట డొల్ల అన్నది ఇక్కడే తేలిపోతోంది. కాలం మారుతున్నా కొద్ది ధరలు పెరగడం సహజం. కానీ అవి విపరీతంగా పెరగడం పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రజల మీద పన్నుల బారం వడ్డన కనిపిస్తుంది. సగటున నెలకు రూ.20 వేలు సంపాదించుకునే వ్యక్తి ఆదాయంలో సగం ఇంటి కిరాయిలకే సరిపోతోంది. నిత్యావసరాల కొనుగోలుకు మిగతా సొమ్ము ఆవిరౌతోంది. పిల్లల స్కూల్‌ ఖర్చులు, ఆరోగ్య సమస్యలకు ఖర్చులు అదనం. అంటే అప్పులు. వాటిని పెంచుకుంటూ పోతున్నారు. రుణ గ్రస్థులౌతున్నారు. ఇప్పటికీ మన దేశంలో 80 శాతం మహిళల మీద కనీసం గ్రాము బంగారం లేని వాళ్లున్నారు. చాలీ చాలని కూలీతో అర్థాకలితో జీవితం సాగిస్తున్నారు. ఇలాంటి వారి జీవితాలను ప్రభావితం చేయాల్సిన పాలకులు వ్యాపార వర్గాల మేలు కోరుకుంటూ పోతున్నాయి. వారికి కొమ్ము కాస్తున్నాయి. సగటు వ్యక్తి జీవితాలు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా బంగారం ధరలు తగ్గితే మేలు జరిగేది ట్రేడిరగ్‌ వర్గాలకే కాని సామాన్యులకు కాదు. నిజం మాట్లడడానికి ఎవరికీ నోరు రాదు. ఆర్థిక నిపుణులకు ఇవి పట్టవు. ధర తగ్గిందా…అమ్మకం పెరిగిందా! అనేది చెప్పడానికి పెద్ద చదువులు అవసరం లేదు. ట్రేడ్‌ మార్కెట్‌ గురించి పెద్దగా అవగాహన అవసరం లేదు. కానీ పాలకులు ఎప్పుడూ మసిపూసి మారేడు కాయ చేస్తారు. బంగారం తగ్గుదల నిజమా! మనం నమ్మాల్సిన విషయమేనా! రూపాయి వస్తువు అర్థ రూపాయికి వస్తే సగటు వ్యక్తి తగ్గుదల అనుకుంటాడు. అంతే కానీ రూపాయిలో పైసా తగ్గితే సామాన్యులకు అందుబాటులోకి వచ్చినట్లు కాదు. వారి కలలు నెరవేరేవి కాదు. అందుకే సుంకం తగ్గిస్తే తగ్గిందెంత! అన్న దానిపై గొప్పలు చెప్పుకుంటే మధ్య తరగతి వాళ్లకు చెప్పులు కూడా మిగలవు. ఈ పదేళ్లలో పెరిగిందెంత!ఆ వ్యత్యాసంతో పోలిస్తే ఊరట ఎంత? అన్న దానికి పొంతన లేదు. లాభం ఎవరికి! నష్టం ఎవరికి!! అని చెప్పడానికి ట్రేడిరగే తెలియాల్సిన అవసరం లేదు. నిరక్షరాస్యులు కూడా చెప్పగలరు. వాస్తవ పరిస్థితులు చెప్పే ధైర్యం పాలకులకు ఎప్పుడూ వుండదు. అందుకే వేలకు వేలు తగ్గితే వ్యాపారాలకు ఇబ్బంది వుండదా!
బంగారం మీద లాభం లేకుండా అమ్మకాలుంటాయా! అన్నది సామాన్యులకు తెలియదా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!