వరంగల్ తూర్పులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
తన గ్రూపులో ఉన్న సభ్యురాలు లోన్ తీసుకొని కట్టకపోవడంతో మనస్థాపానికి గురైన ఆర్పీ?
రమేష్ అనే అధికారి సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆర్పీ ఆవేదన
సదరు ఆర్పీ గ్రూపులో ఉన్న మహిళ లోన్ తీసుకొని డబ్బులు కట్టకపోవడం కరెక్టా అని ప్రశ్నిస్తున్న ఆర్పీ కుటుంబ సభ్యులు?
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పులో, మహిళా ఆర్పి (రిసోర్స్ పర్సన్) మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్పీ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.., కాశీబుగ్గకు చెందిన తోట రాణి అనే మహిళ, ఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. తన సంఘం తరఫున ఏడున్నర లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఆమె గ్రూపులో ఒక సభ్యురాలు తన వాటా చెల్లించట్లేదు. సంఘ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆమె వన్ టైం సెటిల్మెంట్ కు ప్రయత్నించగా, రమేష్ అనే అధికారి అడ్డు పడుతున్నాడని ఆవేదన చెందుతున్నారు. ఈ అధికారి కావాలనే కక్షతో సమస్య పరిష్కారం కాకుండా జాప్యం చేస్తున్నారని, తద్వారా తనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన ఆర్పి మనస్తాపంతో తన ఇంట్లో మందు బిళ్ళలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. తోటి ఆర్పీలు, సభ్యులు, వివిధ సంఘాల మహిళలు ఆమెను పరామర్శించారు. గ్రూపు మొత్తానికి కలిపి తీసుకున్న రుణం ఏడున్నర లక్షలు అయితే అందులో ఒక సభ్యురాలు తన వాటా చెల్లించలేదు కనుక బ్యాంకు వాళ్ళతో మాట్లాడుకుని సెట్ చేసుకోవాలని అనుకున్న ఆమెకు, మిగతా సభ్యులను రమేష్ అనే అధికారి ఆఫీసుకు పిలిపించుకొని, తనకు సంబంధం లేని విషయంలో ఇలా మీరు వన్ టైం షెడ్యూల్ చేసుకుంటే మీకు మున్ముందు ఇబ్బందులు అవుతాయి అని, తోటి సభ్యులకు లేనిపోని మాటలు చెప్పి భయ భ్రాంతులకు గురి చేసినట్లు సదరు ఆర్పి ఆవేదన. అధికారుల అతి చొరవతో చాలా మంది ఆర్పిలు వారి సమస్యలు బయటకు చెప్పుకోలేక పోతున్నారు అనేది తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ఆర్పిలు, సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.