
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
సీపీఐ,కాంగ్రెస్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
చేర్యాల నేటిధాత్రి,
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కోరారు. శుక్రవారం చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఇంటింటా తిరుగుతూ పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రులకు చేసింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి పట్టభద్రులంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఒకవైపు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోదీ చెప్పి మరోవైపు జీవో 46 తీసుకువచ్చి పేద వర్గాలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు వస్తున్నారని పట్టభద్రులు గమనించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. పట్టభద్రులందరూ ఆలోచించి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల రాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి. హైమద్, నాయకులు అవ్వల శ్రీనివాస్, కోయినేని సుధీర్, బోయిని హరికృష్ణ, ఎండీ. సద్దాం, తదితరులు పాల్గొన్నారు.