
సీఎం రేవంత్ రెడ్డికి వినతి…
ఎన్జీటీ తీర్పు హర్షణీయం..
జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి:
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై అధికారులు, నాయకులు ఒక్కొక్కరుగా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చిందని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానేరు నదిలో ఇసుక త్రవ్వకాలు చట్ట విరుద్ధమని నేడు ఎన్జీటీ తీర్పులో పేర్కొనడం హర్షనీయమని అన్నారు. గత ప్రభుత్వం ఇసుక మాఫియా తో కుమ్మక్కై వేలకోట్ల రూపాయల అక్రమార్కులకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. డీసిల్టేషన్ పేరుతో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా తాను రైతాంగం పక్షాన ఉద్యమించానని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం అండదండలతో మానేరులో ఇసుక విధ్వంసానికి పాల్పడుతూ కాంట్రాక్టర్లు వేలకోట్ల అక్రమార్చనకు పాల్పడి, తీర ప్రాంత రైతాంగ ఉపాధులను దారుణంగా దెబ్బతీశారని వాపోయారు. ఇసుక కాంట్రాక్టర్ల వేలకోట్ల అక్రమార్జనలను తాను సాక్ష్యాలతో సీఎంకు అందజేశానని, విచారణ జరుగుతున్నదని తెలిపారు. ఎన్జీటీ ఇచ్చిన తీర్పు గత ప్రభుత్వానికి చెంప పెట్టని ఆయన తెలిపారు. ఎన్జీటీ తీర్పు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో తనుగుల వద్ద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇసుక మాఫియా పై ఉక్కు పాదం మోపాలని.. అంతే కాకుండా ఎన్జీటీ విధించిన 50 కోట్ల జరిమాన అక్రమాలకు పాల్పడిన అధికారుల నుండి వసూలు చేసి మానేరు తీర ప్రాంత బాధిత రైతాంగానికి నష్ట పరిహారంగా చెల్లించాలని ఆయన కోరారు. పర్యావరణ విధ్వంసానికి పాల్పడితే తమ ప్రభుత్వం తగిన గుణపాఠం చెబుతుందని ఆయన ఇసుకాసురులను హెచ్చరించారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల పై గత ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. మొక్కవోని ధైర్యంతో న్యాయ పోరాటాన్ని కొనసాగించి విజయం సాధించిన మానేరు పరిరక్షణ సమితి నాయకులు సంధి సురేందర్ రెడ్డి, చిటికేసి సతీష్ కుమార్ లను ఆయన అభినందించారు.