
ప్రెస్ మీట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి మిమిక్రీ రమేష్
భద్రాచలం నేటి ధాత్రి
చదువుకున్న పట్టభద్రులకు ఉద్యోగ ఉపాధి సౌకర్యాలు కల్పించాలని, ఎమ్మెల్సీగా తనకు ఒక్క అవకాశం ఇస్తే పట్టభద్రులకు ఉద్యోగ ఫలాలు అందేలా తనదైన శైలిలో ప్రయత్నిస్తానని ప్రముఖ అంతర్జాతీయ, సినీ మిమిక్రీ కళాకారులు, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి మిమిక్రీ రమేష్ వెల్లడించారు. భద్రాచలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకతీతంగా తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగానని తెలిపారు. ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్స్ తో తనకు చక్కని సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. చదువుకున్న నిరుద్యోగులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు తనకు తెలుసని పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో ప్రవేశించడానికి పట్టభద్రులు తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. భద్రాద్రి రాముని దీవెనలతో తాను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకం తనకుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం, యువత బాగు కోసమే తాను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగానని తెలిపారు. తనకు అందరితో పరిచయాలు ఉన్నాయని, తాను గెలిస్తే తప్పకుండా యువత అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెలిపారు. విద్యారంగంలో ఇంకా చక్కని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనేకమంది యువత డిగ్రీ, పీజీ పట్టా పుచ్చుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతం కంటే చదువుకునే వారి సంఖ్య బాగా పెరిగిందని, కానీ అందుకు తగ్గ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రం పెరగటం లేదని, పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల చేసి యువతను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సీరియల్ నెంబర్ 31 లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రమేష్ మిత్రులు ఎస్.కె అజీమ్ తదితరులు పాల్గొన్నారు