https://epaper.netidhatri.com/view/266/netidhathri-e-paper-15th-may-2024%09
`ఊహలు…గుసగుసలు!
`కాంగ్రెస్ కదం తొక్కిందా?
`గులాబీ వనం విరగబూసిందా?
`కమలం వికసించిందా?
`ఎవరి అంచనాలు వారివి!
`ఎవరి లెక్కలు తేలిపోయేవి!
`పైకి వినిపిస్తున్నదొకటి!
`జరిగింది మరొకటి!
`ఓటరు సైలెంట్
`కలవరపెడుతున్న క్రాస్ ఓటింగ్.
`పల్లె జనం తీరులోనే మెలిక.
`పట్నం గుట్టు పైకి కనపడక.
`ఎవరికీ అందని జనం నాడీ.
`జాతీయ రాజకీయాలలో పెరుగుతున్న వేడి.
`భావోద్వేగాలు జాతీయమా! ప్రాంతీయమా!!
`కాంగ్రెస్ కలలు నెరవేరేనా!
`కలమం ఆశలు ఫలించేనా!
`కేసిఆర్ బస్సు యాత్ర బుసలు కొట్టిందా!
`ఓటరు చైతన్యం ముందు పార్టీల మైండ్ బ్లాక్ అయ్యిందా!
`ఆరు గ్యారెంటీలు ఎవరికి ఉరితాళ్లు!
`కాంగ్రెస్‌కు ఎంత మేలు!
`రేవంత్ రెఫరెండం రేటింగ్‌లో వుందా!
`కారు షెడ్డులోనే వుందా! బైటకు వచ్చిందా!
`కమలానికి మిగిలేది కలవరమేనా!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు మునుగుతారు? ఎవరు తేలుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సహజంగా ప్రజల మూడ్ ఎప్పుడైనా తెలుస్తుంది. కాని ఈసారి అలాంటి పరిస్దితి ఎక్కడా కనిపించలేదు. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వుందా? లేక బిఆర్‌ఎస్‌కు మేలు చేస్తుందా? ఇప్పటి వరకు మద్దతు దొరకని బిజేపికి కాలం కలిసొస్తుందా? అన్నది అంతు చిక్కడం లేదు. కాని ఎవరి ఊహల లెక్కలు వారికున్నాయి. ఎవరి అంచనాలు వారికున్నాయి. ఎవరు చెబుతున్న లెక్కలు వారికి కొంత నిజమనే అనిపిస్తున్నాయి. రాజకీయాలన్న తర్వాత లాజిక్‌లే ఎక్కువ. అందుకే అందరూ వాటినే నమ్ముతారు. నిజాలు అసలు నమ్మరు. నిజాలను జీర్ణించుకోలేరు. ప్రజల తీర్పు నిక్షిప్తమై వుంది. కాని జూన్ 4 వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే వుంటుంది. నిత్యం చర్చ జరుగుతూనే వుంటుంది. తినబోతూ రుచెందుకు అన్న సామెత ఇక్కడ పనికి రాదు. ఎందుకంటే వండడానికి, తినడానికి చాలా సమయం వుంది. సహజంగా ఎన్నికలు పూర్తయిన వారం రోజుల తర్వాత ఫలితాలంటేనే నాయకులకు నరాలు తెగే ఉత్కంఠ అనుభవిస్తారు. ప్రచారానికి పది నెలలైనా తీసుకుంటారు. కాని పోలింగ్ జరిగిన తర్వాత రెండు రోజులు కూడ ఆగలేరు. ఎందుకంటే అంత కష్టపడి రోజుల తరబడి ప్రచారం చేసి, ఖర్చు చేసి గెలవకపోతే రాజకీయంగా ఎక్కడ వెనకబడిపోతామో? అన్న బాధ ఫలితాలు వచ్చేదాకా బాధిస్తుంది. కాని ఒక్కసారి రిజల్టు వచ్చాక ఓడిన వారికి బాద ఆ క్షణంలోనే పోతుంది. కాకపోతే ఖర్చయిందని కొంత కాలం బాధ వుంటుంది. అప్పటికన్నా, ఫలితాలు వచ్చే ఈ సంది సమయంలోనే నాయకులు పడే మనోవేధన అంతా ఇంతా కాదు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. అందులోనూ ఈ కాలంమంతా బూత్ స్ధాయి నుంచి మొత్తం నియోకజవర్గంలో ఏం జరిగింది. ప్రజలు ఎటు వైపు మొగ్గారు. ఎవరిని ఆదరించారు. తాను ఎంత మద్దతు లభించింది అనే విషయాలను కార్యకర్త స్ధాయి నుంచి వివరాలు సేకరణలో పడతారు. ఓటు ఓటును లెక్కగడుతుంటారు. ఇదే అందరూ చేస్తారు. వాటిపై కూడా సరైన నమ్మకం వుండదు. అయినా నిత్యం దానిపై సమీక్ష లేకుండా వుండరు. ఆఖరుకు గెలిచిన వారు వేసుకునే లెక్కలు వేరుగా వుండొచ్చు. ఓడిన వారి అంచనాలు తలకిందులు కావొచ్చు. ఇలాంటి సమయంలో కొంత మంది నాయకులు టూర్లు పెట్టుకుంటారు. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకున్న వాళ్లు మాత్రం ఇల్లు కదలకుండా లెక్కలేసుకుంటారు. ఇక మీడియా, సెఫాలజిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, మేధావి వర్గం ఎవరికి తోచింది వారు చెబుతుంటారు. అంటే వాళ్లు కూడా ఫలితాలు వచ్చేదాకా అదే పనిలో వుంటారు. వారికి తెలిసిన సమాచారం చేరవేసుందకు ఆసక్తి చూపుతుంటారు. నాయకులను కూడా సంప్రదిస్తుంటారు. వారి లెక్కలు, నాయకుల లెక్కలు కలుస్తున్నాయా? అంచనా వేసుకుంటారు. ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఓట్లు వేసిన సమాన్య ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటూ కాలం గడపడం అన్నదే ప్రజాస్వామ్య గొప్పదనమని చెప్పొచ్చు. సీక్రెట్ ఓటింగ్ అంటేనే ఉత్కంఠ…ఓట్లు వేసిన వారు కూడా ఎన్నికల ముందు ఏం జరుగుతుందో అని ఆసక్తిని కనబర్చుతారు…ఓటేసి వచ్చిన తర్వాత ఫలితాల సమయానికి మధ్యలో కూడా అదే మాటలు చెబుతుంటారు. అందుకే ఓటంటే అందరికీ ఆసక్తే…
ఇక మేధావి వర్గాలు, మీడియా వర్గాలు వేస్తున్న అంచాలు కూడా ఎప్పుడూ వన్ సైడే వుంటాయి.
ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఎవరూ కరక్టుగా చెప్పడం అన్నది కొన్ని సార్లు మాత్రమే జరుగుతుంది. సహజంగా ప్రజల నాడి ఎన్నికలకు ఏడాది ముందే తెలిసిపోతుంది. దానిని పట్టుకొనే సర్వే సంస్థల లెక్కలు ఆధారపడి వుంటాయి. ఆ ఏడాది కాలంలో ప్రజల్లో వచ్చే మార్పును అంచనా వేసుకొని చెప్పడం జరుగుతుంది. కాని తెలంగాణలో కొన్ని ప్రత్యేక ప్రరిస్దితులున్నాయి. సహజంగా అయితే శాసన సభ ఎన్నికలు జరిగి సరిగ్గా ఆరు నెలలౌతోంది. అంటే రాష్ట్రంలో వున్న అధికార పార్టీకి ఎంతో కొంత అనుకూలమైన పరిస్దితులుంటాయి. కాని ఆ పరిస్దితి వుండాలన్న రూలేమీ లేదని చాల మంది చెబతున్న మాట. ఎందుకంటే 2018 ముందస్తు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని పెద్దఎత్తున సర్వేలు చెప్పాయి. ఏ ఒక్క సర్వే కూడా బిఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పలేదు. కాని బిఆర్‌ఎస్ ఊహించని మెజార్టీతో అనూహ్య విజయం సాధించింది. అందరి అంచానాలు తారు మారు చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే ఊపు కొనసాగుతుందని బిఆర్‌ఎస్ అతి విశ్వాసానికి వెళ్లింది. బొక్క బోర్లా పడిరది. సారు..కారు..పదహారు అంటూ నినాదం ఎత్తుకున్నది. బిఆర్‌ఎస్ చెప్పిన పదహారును నిలువునా కోసి, ఎనమది సీట్లిచ్చారు. కాంగ్రెస్‌కు మూడు సీట్లిచ్చారు. బిజేపికి నాలుగు సీట్లిచ్చారు. ఆరు నెలల క్రితం ప్రతిపక్షాలతో పనే లేదన్నట్లు తీర్పిచ్చిన తెలంగాణ ప్రజలు, పార్లమెంటు ఎన్నికల్లో కారుకు పక్కన పెట్టారు. బిఆర్‌ఎస్ ఇచ్చిన నినాదాన్ని అబద్దం చేశారు. కారుకంత సీన్ లేదని తేల్చి సగానికి పరిమితం చేశారు. మరి ఇప్పుడు ఎలా వుంటుందనేదానిపై విపరీతమైన ఉత్కంఠ నెలకొన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే వుంటుంది. ఎవరూ ఊహించని విధంగానే వుంటుంది. ఇప్పుడు ఎలా వుంటుందన్నదానిపై నరాలు తెగేలా వున్నాయి.
తెలంగానలో ఈ శాసన సభ ఎన్నికల్లో మార్పు కోరుకున్నారు.
కారును వద్దనుకున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న కాంగ్రెస్‌ను ఆదరించారు. గెలిపించారు. మెజారీటీ సీట్లిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశలు నెరవేర్చారు. మరి ప్రజలకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హమీలు నెవవేర్చాడా? లేదా? అన్న దానిపైనే ఎన్నికలు జరిగాయి. ఈ పార్లమెంటు ఎన్నికలు తన ప్రభుత్వానికి రెఫరెండమే అని సిఎం. రేవంత్‌రెడ్డి కూడా ప్రకటించారు. అంటే తన పాలనపై తనకు పూర్తి విశ్వాసం వుంది. ప్రతి పక్షాలు అనేకం ప్రచారం చేస్తాయి. అవన్నీ నిజం కాకపోవచ్చు. ప్రజల్లో ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం వుందనేది ప్రతిపక్షాలు చెప్పే మాటల్లోనే పూర్తి స్ధాయిలో ప్రతిబించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఎన్నికల్లో తొలుత కాంగ్రెస్ 14 సీట్లు గెల్చుకుంటామని చెప్పింది. తర్వాత 12 సీట్లు వచ్చే అవకాశం వుందన్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడిన తర్వాత మెజార్టీ సీట్లు మావే అన్నారు. గత శాసన ఎన్నికల ముందు తెలంగాణలో ఎంతో దూకుడు మీద వున్న బిజేపి ఒక దశలో అధికారంలోకి వస్తుందనుకున్నారు. కాని మారిన రాజకీయ పరిస్దితులు ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి. కాని గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్నది. అయితే ఆ ఊపు ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కనపడిరదా? అన్న సందేహం కూడా వ్యక్తమౌతోంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు జాతీయ స్దాయి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతుంటాయి. ప్రజలు కూడా అదే కోణంలో ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అదికారంలోకి వచ్చిన మరునాటి నుంచే కొన్ని విపత్కరమైన పరిస్ధితులు ఎదుర్కొంటోంది. ఇక ఆరు గ్యారెంటీలు అమలౌతున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. రాహుల్ గాందీ నోట కూడా ఈ విషయం చెప్పించారు. అయితే మహిళలకు రూ.2500 కూడా ఇస్తున్నట్లు చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు మైనస్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే రైతుబంధు పడలేదని ప్రతిపక్షాలు ఎంత ప్రచారం చేసినా, ఆఖరు వరకు దాని గురించి చర్చ పక్కకు వెళ్లిపోయింది. రుణ మాఫీ విషయంలోనూ ప్రతిపక్షాలు చేస్తున్నంత హడావుడి రైతుల్లో లేదు. ఎందుకంటే కేసిఆర్ రుణమాఫీ పదేళ్లు గడిపాడు. కాని రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతుంది. ఆ ప్రభుత్వాన్ని ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా ప్రతిపక్షాలు చేయడాన్ని ప్రజలు కూడా పెద్దగా ఆహ్వానించినట్లు లేదు. అందుకే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మొత్తం గుంభనంగా జరిగింది.
ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడిచినా ప్రజల్లోకి రాని కేసిఆర్ ఒక్కసారిగా జనం మధ్యకు వచ్చారు.
పదహారు రోజుల పాటు బస్సుయాత్ర చేశారు. ప్రజల నాడిని తెలుసుకున్నానన్నారు. ప్రజా సమస్యలు విన్నానని చెప్పారు. ఇక్కడ కొన్ని నిజాలు ప్రజలకు కూడా కనిపించాయి. కేసిఆర్ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నది నిజం. ఆ యాత్రకు ప్రజలను తరలించారా? స్వచ్చంధంగా వచ్చారా? అన్నది అప్రస్తుతం. కాని కేసిఆర్ బస్సు యాత్ర ఎక్కడా తుస్సు మన్న వార్త రాలేదు. రోజు రోజుకూ కేసిఆర్ బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలు తరలివచ్చారు. ఆయా సభల్లో కేసిఆర్ వేసిన ప్రశ్నలకు ప్రజలు సమాధానం చెప్పారు. రైతు బంధుపై కేసిఆర్ వేసిన పంచ్‌లకు ప్రజలు కేరింతలు కొట్టారు. ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే చప్పట్లు కొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ను చూసిన ఆనందంలో ఆయనకు జేజేలు పలికిన తీరు నూభూతో నభిష్యతీ అన్నట్లుగా సాగింది. ఎక్కడికక్కడ జనం కేసిఆర్‌ను కదలనీయకుండా, ఆయనకు జేజేలు పలికారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇకసేస్తే రాలనంత జనం వచ్చారు. మరి ఆ వచ్చిన వారంతా ఓట్లు వేయలేదా? కేసిఆర్ కొత్తగా వచ్చిన నాయకుడు కాదు. సినిమా హీరో అసలే కాదు. అయినా జనం ఎందుకు తండోపతండాలుగా వచ్చినట్లు. ఆరు నెలల క్రితం ఓడిరచిన ప్రజలు ఇప్పుడు కేసిఆర్‌ను చూడడానికి ఎందుకు విరగబడ్డారు. ఎన్నికలకు మూడు నెలలకు ముందు నిజానికి బిఆర్‌ఎస్ పోటీలో వుండదనే అన్నారు. కారు పని అయిపోయిందనే అన్నారు. కాని నాలుగో నెల నుంచి ప్రజలు కాంగ్రెస్‌ను తిడుతున్నారు. కేసిఆర్‌ను జ్ఞాపకం చేసుకుంటున్నారన్నవార్తలు మొదలయ్యాయి. కేసిఆర్ నల్లగొండ సభ పెద్దఎత్తున సక్సెస్ అయ్యింది. కరీంనగర్ సభ అంతకు మించి ఊపునిచ్చింది. కేసిఆర్ బస్సుయాత్రతో జనంలో కదలిక మొదలైంది. కాని మరి పోలింగ్ రోజున మాత్రం బిఆర్‌ఎస్ రేసులో లేదన్న వార్తలు వస్తున్నాయి. పది రోజుల క్రితం కూడా కారుకు ఊపొచ్చింది. బిఆర్‌ఎస్ రేసులోకి వచ్చింది. అన్న వార్తలు వినిపించాయి. కేసిఆర్ ఓ టివి. ఛానల్‌లో నాలుగు గంటల పాటు సుధీర్ఘమైన ఇంటర్వూ ఇస్తే కొన్ని లక్షల మంది వీక్షించారు. దానిపై కూడా ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. తర్వాత రోడ్‌షోల ప్రచారాలు, టివిలలో ప్రసారాలుపై ప్రజలు ఎంతో ఆసక్తిని కనబర్చారు. మరి పోలింగ్‌రోజున ఈ మౌత్ పబ్లిసిటీ ఎలా జరిగింది? ఎందుకు జరిగిందనేది అంతు చిక్కడం లేదు. ఎందుకంటే పదేళ్లపాటు బిఆర్‌ఎస్ అధికారంలో వుంది. ఉద్యమ నాయకుడిగా కేసిఆర్‌కు ప్రజల్లో స్ధానముంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష పాత్రనే ప్రజలు కట్టబెట్టారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కారును ప్రజలు రేసులో లేకుండా చేశారంటూ వస్తున్న వార్తలను ప్రజలు కూడా నమ్మడం లేదు. ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు ఎంత చర్చించుకున్నా, జూన్ 4 దాకా ఇవన్నీ ఊహాగానాలే.. గుసగుసలే..!