
టి.ఎస్.ఎఫ్.డి.సి ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్
జైపూర్, నేటి ధాత్రి :
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టి.ఎస్.ఎఫ్.డి.సి) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ పరిసర ప్రాంతాలలో ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను వివరిస్తూ వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త లు తెలుపుతున్నామని, ప్లాంటేషన్ లలో మధ్య మధ్యలో ఫైర్ లైన్స్ చేశామన్నారు. గ్రామాల్లో ప్రజలకు అటవీ సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,అటవీ ప్రాంతం లోపలికి వచ్చే పశువుల కాపర్లు, ప్రజలకు అగ్ని ప్రమాదాల వలన వచ్చే నష్టాలను వివరిస్తూ వాటిని నియత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నామన్నారు. ప్లాంటేషన్ వాచర్ లు రాత్రి వేళల్లో ఎక్కడికక్కడ ఇద్దరు, ముగ్గురు కలిసి కాపలా కాస్తున్నారని చెప్పారు.అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల రేంజ్ పరిధిలో జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల లోని అటవీ ప్రాంతాలతో పాటు నీలగిరి, టేకు ప్లాంటేషన్ లు విస్తరించి ఉన్నాయని,వీటి రక్షణకు ప్రభుత్వ పరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటూ పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కు అడవులను కాపాడే విషయం లో ప్రభుత్వ యంత్రాంగానికి తోడు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అక్రమ నరికివేతలు జరగకుండా, వర్షాకాలం లో మొక్కలు విరివిగా పెంచడానికి ప్రజాప్రతినిధులతో పాటు ప్రతీ ఒక్కరూ సహకరించాలని తద్వారా కొంత వరకైనా పర్యావరణం లో మార్పు సాధించవచ్చని ఆశా భావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని,అడవులు, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో చెట్లు బాగుంటేనే అన్ని కాలాల్లో కొంత వరకు పర్యావరణ సమతుల్యత ఏర్పడి భవిష్యత్తు లో మానవాళి తో పాటు అన్ని రకాల జీవరాశులు మనుగడ సాధించగలవన్నారు.అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు, సిగరెట్ లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దన్నారు.