‘‘ఖమ్మం’’లో.. ‘‘కారు గల్లంతే’’!

https://epaper.netidhatri.com/view/255/netidhathri-e-paper-5th-may-2024%09/2

`ఎగిరేది మూడు రంగుల జెండానే.

`ఖమ్మంలో మంత్రి పొంగులేటిదే హవా!

`గెలిచేది ‘‘రామ సహాయం రఘురాంరెడ్డే’’!

`ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఎదురులేదు! తిరుగులేదు!!

`బీఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరే!

`అసెంబ్లీ ఫలితాలు ఎంపి.ఎన్నికలలో పునరావృతమే!

`ఇప్పట్లో కారుకు కష్టకాలమే!

`‘‘నామా’’ను నమ్మినందుకు కారు కు నామాలే!

`‘‘నామా’’ వల్ల బిఆర్‌ఎస్‌ పరువు గోదారి పాలే!

`ఖమ్మంలో కారుకు చోటులేనట్లే!

`కాంగ్రెస్‌ జోరు తట్టుకోవడం కారుకు కష్టమే!

`పొంగులేటి ముందు నామాకు మిగిలేవి నామాలే!

`ఖమ్మంలో మంత్రి పొంగులేటిదే హవా!

`గెలిచేది ‘‘రామ సహాయం రఘురాంరెడ్డే’’!

`కేసీఆర్‌ రోడ్‌ షో కష్టం వృధాయే!

`పరుగు పందెంలో ‘‘నామా’’ వెనుకడుగే!

`పొంగులేటిని చూసి ‘‘నామా’’ భయపడుతున్నారా!

`గెలవని రాజకీయం కోసం ఆరాటం అవసరమా? అని ‘‘నామా’’ అనుకుంటున్నారా!

`కేసీఆర్‌ రోడ్‌ షో ఊపు తెచ్చినా ‘‘నామా’’ నిస్తేజంలోనే వున్నారా?

`‘‘నామా’’ వ్యవహారం బిఆర్‌ఎస్‌కు గండమేనా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. ఆది నుంచి అక్కడ పాగా వేసిన పార్టీలలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, తర్వాత తెలుగు దేశం పార్టీలకు ఆదరణ ఎక్కువ వుంటుంది. తెలంగాణ వచ్చినా అక్కడ బిఆర్‌ఎస్‌కు పెద్దగా గుర్తింపు లేదు. ప్రజల ఆదరణ అంతగా ఎప్పుడూ లేదు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మంలో విస్తరించాలని, బలపడాలని కేసిఆర్‌ చాలా ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. ప్రజలు తెరాస వైపు చూడలేదు. ఖమ్మం జిల్లా ఒక రకంగా చెప్పాలంటే ఎంతో చైతన్యవంతమైన జిల్లా. ప్రజా పోరాటాల జిల్లా. సామాజిక చైతన్యం ఎక్కువగా వున్న జిల్లా. అణచివేతను ప్రశ్నించిన జిల్లా. అలాంటి జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఎంత సాగినా బిఆర్‌ఎస్‌ను మాత్రం ప్రజలు ఏనాడు ఆదరించలేదు. అది ఆ పార్టీకి తీరని నష్టాన్నే మిగిల్చింది. పార్టీని పటిష్ఠం చేసే నాయకులను కాదని, పార్టీని బ్రష్టు పట్టించే వారిని ఏరి కోరి కేసిఆర్‌ అందలమెక్కించాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలాంటి నిరసనల నుంచి, తిరుగుబాటు నుంచి తనదైన శైలిలో రాజకీయం నెరిపిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అలాంటి నాయకుడి హవా నడుస్తున్నప్పుడు ఇతర పార్టీల నాయకుల మనుగడ ఎంతైనా ప్రశ్నార్థకమే. అందుకే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌ మరింత బలపడుతోంది. బిఆర్‌ఎస్‌ రోజు రోజుకూ దిగజారుతోంది. ఎన్నికలంటే నామినేషన్‌ వేసిన రోజు నుంచి చివరి ఓటు ఈవిఎంలో నిక్షిప్తమయ్యే దాకా పోరాటం చేయడమే అసలైన పరీక్ష. కానీ ఈసారి పార్లమెంటు ఎన్నికలలో ప్రకార సమయంలోనే ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ పార్టీ చేతులెత్తేసినట్లుంది.
ఖమ్మం పార్లమెంటు సీటు మీద బిఆర్‌ఎస్‌కు ఆశలు లెనట్లే! కనిపిస్తోంది.
బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బలమైన నాయకుడుగా పేరు మాత్రం వుంది. గతంలో పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన నామా నాగేశ్వరరావు గడ్డు రోజులను ఎదుర్కొంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపించాడు. తన వల్ల కాదని బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు చెప్పడం జరిగింది. అయినా ఆ పార్టీకి దిక్కు లేక, తప్పని పరిస్థితులలో నామా నాగేశ్వరరావు ను బిఆర్‌ఎస్‌ బరిలో నిలిపింది. అయినా ఆయనకు ఎలాంటి నమ్మకం లేదు. కనీసం రెండో స్థానం కూడా దక్కదని నామాకు తెలుసు. అందుకే బిఆర్‌ఎస్‌ పెద్దగా ప్రచారం కూడా చేయడం లేదు. ఏదో నామ మాత్రపు ప్రచారం మాత్రమే సాగిస్తున్నారు. తాను గెలిచే పరిస్థితులు లేనప్పుడు నాయకులను పిలిచి, కార్యకర్తలకు ఖర్చు చేయడం వృధా అనుకుంటున్నారట. ఎగిరెగిరి దుంకినా అదే కూలి…ఎగరకుండా దుంకినా అదే కూలి అన్నట్లు, ఎంత ప్రచారం చేసినా పడే ఓట్లే పడతాయి. గెలిచే అవకాశం ఎలాగూ లేదని నామా నిర్థారించుకున్నాడట. అందుకే ప్రచారం తూతూ మంత్రంగానే సాగిస్తున్నట్లు సమాచారం.
ఖమ్మంలో ఎటు చూసినా కాంగ్రెస్‌ ప్రచరమే కనిపిస్తోంది. కాంగ్రెస్‌ గెలుపు గురించే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు గురించే చర్చ జరుగుతోంది. పైగా ఖమ్మంలో కాంగ్రెస్‌ పటిష్ఠంగా వుంది. కమ్యూనిస్టుల మద్దతు కూడా వుంది. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బిఆర్‌ఎస్‌ అభ్యర్థిని అసెంబ్లీ గెటు తాకనివ్వను అని శపధం చేసి మరీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌కు ఎదురులేదని, తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇప్పుడు జిల్లా మంత్రిగా వున్నారు. ఖమ్మం పార్లమెంటు గెలుపును తన భుజ స్కందాల మీద వెసుకున్నాడు. శాసనసభ ఎన్నికలలో ఎలాగైతే అన్నీ తానై చూసుకున్నాడో..ఇప్పుడు కూడా అదే బాధ్యతను తీసుకున్నాడు. కాంగ్రెస్‌ను గెలిపించి తీరుతానంటున్నాడు. అందుకే ఖమ్మంలో ఎగిరేది మూడు రంగుల జెండానే అన్నది అందరికీ అర్థమైంది. ప్రజల నాడి కూడా అలాగే వుంది. పైగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నాయకత్వం మీద ప్రజలకు అచెంచలమైన నమ్మకం, విశ్వాసం వుంది. అందుకే ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఎదురులేకుండా తయారైంది! తిరుగులేని శక్తిగా పొంగులేటి నాయకత్వంలో పటిష్ఠంగా వుంది. జిల్లా వ్యాప్తంగా పొంగులేటి మాటంటే ప్రజలకు వేదంగా మారిపోయింది. అదే ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. సీనియర్‌ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. జిల్లా రాజకీయాల మీద ఆయనకు కూడా తిరుగులేని పట్టుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా అదే జిల్లా కావడం, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే వుండడం కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది.
ఇన్ని సానుకూల అంశాల మధ్య బిఆర్‌ఎస్‌కు చోటు దొరకడం అంటే అంత సులభం కాదు.
అసలు బిఆర్‌ఎస్‌ జెండా పట్టుకునే వాళ్లే ఖమ్మంలో లేరు. నాయకులే ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారం చేసుకోవడానికే పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేసిఆర్‌ బలవంతం మీద, అభ్యర్థులు దొరక్క నామాను బరిలో నిపిరారు. సిట్టింగ్‌ ఎంపిగా వుండి పోటీ చేయకపోతే పరువు పోతుందని కేసిఆర్‌ ఒప్పించి నామాను బరిలో నిలిపారు. అప్పటికే బిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపిలు కొందరు కారు దిగి వెళ్లిపోయారు. వరంగల్‌ లో కావ్యకు బిఆర్‌ఎస్‌ టికెట్‌ ప్రకటించిన తర్వాత ఆమె కారు దిగారు. హస్తం గూటికి చేరారు. వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ లెక్కన చూసినా బిఆర్‌ఎస్‌ ఎప్పుడో డీలా పడిపోయింది. అందువల్ల ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరే! అన్నది అందరూ చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఫలితాలే పునరావృతం కానున్నాయి. పార్లమెంటు ఎన్నికలలో కూడా తొలి బోణీ ఖమ్మం నుంచే వుంటుందని అందరూ అనుకుంటున్నారు.
ఇదిలా వుంటే ఖమ్మంలో ఇప్పట్లో కారు కదలడం కష్టమే.
మొత్తంగా కారుకు ఈ ఐదేళ్లూ కష్టకాలమే! ముఖ్యంగా ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ కోలుకోడం అంటూ జరిగే సూచనలు భవిష్యత్తులోనూ కనిపించేలా లేదు. అంతే కాకుండా బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నామాను నమ్మినందుకు కారు నామాలే! మిగిలే అవకాశం వుందని సెటైర్లు వేస్తున్నారు. నామా వల్ల బిఆర్‌ఎస్‌ పరువు గోదారి పాలే! అని బిఆర్‌ఎస్‌ మీద సానుభూతి చూపిస్తున్నారు. ఇక ఖమ్మంలో కారుకు చోటులేనట్లే! కారు కాంగ్రెస్‌ జోరు తట్టుకోవడం కష్టమే! అసలే బిఆర్‌ఎస్‌ ఓడిపోయి వుంది. ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరూ కారు దిగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ పుట్టెడు కష్టాలలో వుంది. అలాంటి సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ముందు నిలబడడం అంటేనే ఫలితాలు ఎలా వుంటాయన్నది ఎన్నికల దాకా ఆగాల్సిన పని లేదు. ఎన్నికల నాటికి నామాకు మిగిలేవి నామాలే! అంటున్నారు. ఇప్పటి వరకు ఖమ్మంలో మంత్రి పొంగులేటిదే హవా! మామూలుగా నడవడం లేదు. ఆయన ఒక్క పిలుపిస్తే జిల్లా మొత్తం కదిలేలా వుంది. అంతగా ఆయన నాయకత్వం పెరిగిపోయింది. ఇలాంటి సందర్భంలో కేసిఆర్‌ రోడ్‌ షో కష్టం వృధాయే! అనే మాటలే వినిపిస్తున్నాయి.
ఎన్నికల పరుగు పందెంలో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎప్పుడో వెనుకబడి పోయాడు.
ఆయనకు గెలవాలన్న కసి లేదు. గెలుస్తానన్న నమ్మకం లేదు. గెలిపించే యంత్రాంగం లేదు. ఆయన వెంట నడిచే నాయకులు లేరు. ముందుకు నడిపించేంత పెద్దలు లేదు. అందుకు అవరమయ్యే ఖర్చు చేసేందుకు నామా సిద్ధంగా లేడు. ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎలాగు లేదు. ఓడిపోయే సీటుకు ఖర్చు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే అంటున్నారు. గెలవని రాజకీయం కోసం ఆరాటం అవసరమా? అనుకుంటున్నారా! అన్న మాటలే జిల్లా వ్యాప్తంగా సర్వత్రా వినిపిస్తున్నాయి. కేసిఆర్‌ రోడ్‌ షో ఊపు తెచ్చినా నామా నిస్తేజంలోనే వున్నారని, ఇప్పుడున్న పరిస్థితులలో జనం రావడం వేరు…ఓట్లు వేయడం వేరు. వచ్చిన జనం ఓటు బ్యాంకు అనుకుంటే కష్టమనే సత్యం నామా నాగేశ్వరరావుకు తెలియంది కాదు. శని వారం నామా నాగేశ్వరరావు టిడిపి కార్యాలయానికి వెళ్తే పెద్ద ఎత్తున నిరసన సెగ కూడా తగిలింది. ప్రజలు ఆదరించకపోయినా ఫరవా లేదు. కానీ అడుగడుగునా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే, నిరసన గళం వినిపిస్తే వున్న పరువు కాస్త పోతుందని నామా నాగేశ్వరరావు గ్రహించారు. అసలు ఈ పార్లమెంటు ఎన్నికల మూలంగా బిఆర్‌ఎస్‌ వల్ల నామా సుడిగుండాలా లేక, నామా వల్ల బిఆర్‌ఎస్‌కు గండమా? అన్నది కూడా తేలిపోతుంది. ఎందుకంటే నామాకు చెప్పుకోదగ్గ ఓట్లు వస్తాయా? అన్నది కూడా ఆందోళన కలిగిస్తున్న అంశమే కావడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం లో పార్లమెంటు సీటు కాంగ్రెస్‌ గెలుచుకొని గులాబీ జెండాకు జిల్లాలో చోటు లేకుండా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. రామసహాయం రఘరాం రెడ్డి విజయం నభూతో నభవిష్యతి అనేలా వుంటుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!