జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రతి విద్యార్థికి పదవ తరగతి తొలి పరిక్ష, తొలి ప్రతిభ పట్టా, తొలి మధుర జ్ఞాపక మని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో
పదవ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి 10 గ్రేడ్ సాధించిన కస్తూర్భా గాంధీ విద్యాలయం చిట్యాలకు చెందిన కొత్తూరు అంజన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దాపూర్ కు చెందిన ఊరుగొండ సాహిత్య, గాంధీ నగర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు చెందిన గడ్డం అక్షయ, ముత్యాల అభినయ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో జీ.పీ.ఏ 10 సాధించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదవ తరగతి తొలి పరిక్ష అని తన ప్రతిభకు తొలి పట్టా అని, విద్యార్థి జీవితంలో తొలి మధుర జ్ఞాపకమని ఏ విద్యా ఫలితంలో నైనా ముగ్గురి కఠోర శ్రమ దాగి ఉంటుందనీ గురువు, విద్యార్థి, తల్లిదండ్రుల సమిష్టి కృషి ప్రోత్సాహం వల్లే ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుందని అన్నారు.
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పరిధిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం మరియు మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహల్లో ఉంటూ కష్టపడి చదివి మొదటి స్థానం సాధించడం చాలా గొప్ప విషయమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇష్టంతో మంచి ఉన్నత చదువులు చదివి సమాజంలోని పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు సేవలు అందించే స్థాయికి చేరాలని అన్నారు. విద్యా సముపార్జన ద్వారా మాత్రమే మనిషి ఉన్నత స్థాయికి చేరుకోగలడని, తల్లిదండ్రుల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేసి సమాజం కీర్తించ దగిన గొప్ప పౌరులుగా ఎదిగి తల్లితండ్రులకు అలాగే మన జిల్లాకు, రాష్ట్రానికి తద్వారా దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. రామ్ కుమార్, చిట్యాల మండల విద్యాశాఖ అధికారి కొడెం రఘుపతి, ఎఎంఓ కాగితపు లక్ష్మణ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టి. శాంత, ఆశీర్వాదం, పరీక్షల విభాగం సహాయకులు కుసుమ కృష్ణమోహన్, ప్రత్యేక అధికారి సుమలత, అకౌంటెంట్ మీనా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.