రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ గత పాలకవర్గం దాతల విరాళాలతో మొత్తం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కోనుగోలు చేసినట్లు సూచిక బోర్డులో చూపించి నేడు అట్టి సూచిక బోర్డును తొలగించడం ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశమైంది.
సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాలను పరిశీలించగా శ్మశాన వాటిక కోసం 10జూన్2019రోజున పోన్నం వీరేశం తండ్రి:అంజయ్య అనే వ్యక్తి నుండి సర్వే నంబర్ 472/ఎ/జి లో పన్నెండు గుంటల భూమిని డాక్యుమెంట్ నంబర్ 3724/2019 ద్వారా కోనుగోలు చేసి శ్మశాన వాటిక నిర్మాణం చేసి ఫినిషింగ్ చేయడం జరిగినది. ఆతర్వాత 09సెప్టెంబర్2019న సర్వే నంబర్ 472/ఎ లో పదమూడు గుంటల భూమిని రెండు లక్షల రూపాయలకు సర్పంచ్ లెటర్ హెడ్ పై కోనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం ఇరవై ఐదు గుంటల భూమిని శ్మశాన వాటిక కోసం కోనుగోలు చేశారు. కాని ప్రస్తుతం పన్నెండు గుంటల భూమి మాత్రమే గ్రామ పంచాయతీ ఆదీనంలో ఉన్నది. గత సర్పంచ్ లేటర్ హెడ్ ద్వారా చూస్తే పదమూడు గుంటల భూమి, సూచిక బోర్డులో ఉన్న విధంగా చూస్తే పదహారు గుంటల భూమి ఎటువెళ్ళినదో తెలియని అయోమయా పరిస్థితిలో గ్రామ ప్రజలు ఉన్నారు. శ్మశాన వాటిక కోసం మొత్తం ఎన్ని గుంటలు కోనుగోలు చేశారు, వచ్చిన విరాళాలు ఎన్ని అనేది అధికారులు నిగ్గుతెల్చాల్సిన అవసరం ఉందనేది గ్రామ ప్రజల వాదన. కనీసం ఇప్పటికయినా సంబందిత అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి విరాళాలతో కోనుగోలు చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలని, అసలు గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక కోసం ఎన్ని గుంటలు కోనుగోలు చేసినరో స్పష్టంగా తెలియజేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. శ్మశాన వాటిక కోసం రిజిస్ట్రేషన్ ద్వారా కోనుగోలు చేసిన పన్నెండు గుంటల భూమికి రైతు బంధు అమ్మిన వ్యక్తి పేరున జమకావడం కొసమెరుపు.