ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మానుకో

బండి సంజయ్
సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి)
మంగళవారం జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్ లో జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మంగళవారం జమ్మికుంటలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని, దానిని భారీ బహిరంగ సభగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు బాధ అనిపించిందని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మేధావి వర్గంలో చర్చ కొనసాగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి గోరంగా మాట్లాడితే ప్రజలు సహించరని, మోడీని తిడితే జనంలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతుందన్నారు. సభలో సీఎం కరీంనగర్ కు మోడీ చేసింది ఏమీ లేదని ప్రస్తావించారని, 100 రోజుల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు సున్నా అయ్యిందన్నారు. తాను రేవంత్ రెడ్డి లాగా తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ కు వచ్చి ఉద్యమకారులను తుపాకితో కాల్చి చంపుతానని అనలేదన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలియదని కార్యకర్తలు కూడా ఓడిపోతామనే క్లారిటీ ఉన్నారన్నారు. తాను ఎప్పుడూ రాముని గురించి మాట్లాడుతానని విమర్శించి, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దేవుడిపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. తాము పక్కా రాముని వారసులమని, బరాబర్ రాముని గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తాను రాముని గురించి మాట్లాడితే భయపడుతున్నారని, సైతానులు రాక్షసులు మాత్రమే దేవుళ్లకు భయపడతారన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కా నాన్ లోకల్ అని, ఆయన కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, అంత అభివృద్ధి చేస్తే గత ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తనకు 89 వేల ఓట్ల మెజారిటీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే పనిలో ఉన్నాయని, రెండు పార్టీలు కలిసి రెండవ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అత్యధికంగా మెజార్టీ స్థానాల్లో బిజెపి గెలవబోతుందని, రాష్ట్ర ప్రజలు మరోసారి మోడీని దేశ ప్రధాని చేయాలనే సంకల్పంతో ఉన్నారని, ప్రజల బలం, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ ఎంపీగా తాను మరోసారి భారీ మెజారిటీతో గెలవబోతునని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో మే 8న మోడీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకే సభను నిర్వహిస్తున్నామని, ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడీ భారీ బహిరంగ సభను ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి
విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణీ రుద్రమదేవి, రెడ్డబోయిన గోపి, ఆడేపు రవీందర్, భర్కం లక్ష్మి, నాగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!