జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్య చందన
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గురువారం గుండాల మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంభందించిన తురుభాక,నర్సాపురం,లింగాగూడెం, చిమల గూడెం, కృష్ణాపురం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో అడిషనల్ కలెక్టర్ విద్యా చందన తగు సూచనలు చేశారు.
ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులకు అమ్మ ఆదర్శ పాఠశాల పనుల నిర్వహణ పై పూర్తి స్థాయిలో సమయం కేటాయించి, పాఠశాలలో నాణ్యమైన పనులు జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని తగు సూచనలు చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంబంధించిన పనులను, పాఠశాల స్థాయిలో నిర్వహించుటకు, పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన, పనులన్నింటినీ పారదర్శకంగా పూర్తి చేయాలని, మే 30 నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ లు ఉన్న పాఠశాలలలో ఈ పనులను వారం లో పూర్తి అయ్యేటట్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
కమిటీ లలో గల విలేజ్ ఆర్గనైజర్లు పూర్తి స్థాయిలో పాల్గొని పనులు సవ్యంగా జరిగేలా చూడాలని సూచించారు. కమిటీ సభ్యుల సహకారంతో పనులను ప్రారంభించేందుకు తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండి పనులన్నీ పూర్తయ్యే విధంగా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
మండల స్థాయిలో ఈ పనులను,మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులు పర్యవేక్షణ చేసి,ఎప్పటికప్పుడు తగు రిపోర్టును జిల్లాకు పంపించవలసి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు ఎంపీడీఓ సత్యనారాయణ ,ఏంఈఓ పెండకట్ల కృష్ణయ్య,ఏఈ తదితరులు పాల్గొన్నారు.