జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం మరియు పౌనూర్ గ్రామాలలో గురువారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనితీరును,అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను మరియు పైప్ లైన్ వ్యవస్థలను తనిఖీ చేసి, అవసరం ఉన్న చోట వీలైనంత తొందరగా మరమ్మత్తులు చేపించి సమస్యను పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులకు తెలిపారు. ఇరు గ్రామాలలోని నర్సరీ మరియు పల్లె వనాలను సందర్శించి ప్రతిరోజు చెట్లకు నీరు పోసే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో తయారుచేసిన కంపోస్ట్ ఎరువులను మొక్కలకు ఉపయోగించాలని, రోడ్లపైన, పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా రోజు పారిశుద్ధ్య పనులు జరిపించాలని, మురికి కాలువలు,నీటి గుంతలో నీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణకు తగు చర్యలు తీసుకుంటేనే మలేరియా,డెంగ్యూ వంటి విషజ్వరాలు రాకుండా అరికట్టవచ్చునని తెలిపారు.అనంతరం ఇందారం మరియు పౌనూర్ గ్రామాల పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.ఈ ఇరు గ్రామాల పర్యటనలో జైపూర్ మండల ఎంపిడిఓ సత్యనారాయణ గౌడ్,ఇందారం మరియు పౌనూర్ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.