# పేదవారికి ఒక న్యాయం… ధనవంతులకు ఒక న్యాయం..!
# నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నర్సంపేట మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు.
# సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్..
నర్సంపేట,నేటిధాత్రి :
రోజురోజుకు నర్సంపేట పట్టణం జిల్లా స్థాయిలో ఎదుగుతున్న నేపథ్యంలో భూములకు రెక్కలు వచ్చాయని దీంతో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు ప్రభుత్వ భూములను కబ్జాలకు చేస్తున్నారని ఆ కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ ఆరోపించారు.నర్సంపేట పట్టణంలోని 702 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడాలు జరుగుతున్న ప్రాంతాన్ని సిపిఎం పట్టణ కమిటీ అధ్వర్యంలో పరిశీలించారు.ఈ సందర్భంగా హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ పేదవారు ఇండ్ల నిర్మాణం చేపడితే వాటిని కూల్చివేస్తూ ఒక న్యాయంగా అదే ఆర్థికంగా ఉన్నవారు అక్రమంగా ఇండ్లు,కమర్షియల్ ఇండ్లు నిర్మాణం చేసుకుంటే వాటికి ఒక న్యాయంగా నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.నర్సంపేట పట్టణంలో 111 సర్వే నెంబర్ లో నిరుపేద కుటుంబం స్థలం కొనుగోలు చేసి నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకుంటుంటే ప్రభుత్వ భూమి అని అనుమతులు లేవని ఆ ఇంటిని రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడం జరిగిందన్నారు. అదే
ప్రభుత్వ భూమి 702 సర్వే నంబర్ లో ఓ ఉన్నత వ్యక్తి రాత్రికి రాత్రి రేకుల షెడ్డు నిర్మిస్తే,అక్రమ నిర్మాణం చేస్తుంటే ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలాబు ఏమిటి అని ప్రశ్నించారు.
111 సర్వే నెంబర్ లో ఇల్లు కట్టుకునే వ్యక్తి పేదోడు కాబట్టి అతని నుండి ముడుపులు రావు కాబట్టి కూల్చి వేశారని,అలాగే సర్వే నంబర్ 702 ప్రభుత్వ భూమిలో మొరంపోసి చదును చేసి ఫ్లాట్లు చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం ఆర్థికంగా బలమైన వ్యక్తి కాబట్టి అతని నుండి ముడుపులు వస్తాయని ఉద్దేశంతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.పట్టణంలో ఇండ్లు లేనీ అనేకమంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు కావాలని ఎన్ని సార్లు విన్నపాలు చేసిన కనీసం స్పందించని అధికారులు, పేదలు ఇంటి స్థలాలు కావాలని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే దాడులు చేసి కేసులుపాలు చేస్తున్నారని పేర్కొన్నారు.అవే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వారి మీద ఎలాంటి చర్యలు, కేసులు పెట్టకుండా భూకబ్జాదారులకు వంత పాడడం సరికాదని హితవు పలికారు.నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు నిర్మాణాలు లేక అద్దె భవనాలల్లో విధులు నిర్వహిస్తున్నారని, అనేక మంది నిలువ నీడ లేని పేదలు ఉన్నారని అన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలని 702 సర్వే నంబర్ లో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని శ్రీదర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కందికొండ రాజు, నాయకులు మొలుగూరి రాజు, దాసరి నరేష్, మద్దెల నాగరాజు, వీరన్న, వేములపల్లి సుధాకర్, పులి చేరు చందు, జార్జ్ విక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.