బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు
నర్సంపేట,నేటిధాత్రి :
ఎన్నో కార్మిక వర్గ త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను, చట్టాలను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులతో మిలాకత్ అయి వారికి అనుకూలంగా చట్టాలను పార్లమెంటులో రూపొందించిందని వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసి పోరాటం చేయాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. మే 1న కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.గురువారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయాలని, కనీస వేతన చట్టం ఉండాలని కార్మిక హక్కుల కోసం పోరాటం చేయడానికి సమ్మె చేసుకునే హక్కు ఉండాలని పోరాటాలు చేసి చట్టాలను సాధించుకుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధంగా చట్టాలను మార్పు చేస్తుందని అన్నారు. ఎన్నికల ముందు తెలంగాణలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తారీకున జీతాలు వస్తాయని చెప్పిన ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లకు వేతనాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, నాయకులు గాండ్ల రాములు, బిక్షపతి, అనిల్, చంద్రమౌళి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.