చందుర్తి, నేటిధాత్రి:
హోలీ’ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు మల్యాల గ్రామంలో హోళీ సంబరాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చి పిల్లలు,యువతతో పాటు కుటుంబ సభ్యులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ.. రంగు రంగుల నీళ్లు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్నారు.చిన్నా పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా, సంబరంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఆట, పాటలతో యువత రచ్చ చేస్తున్నారు. దీంతో గ్రామాలలో వీధులు సందడిగా మారాయి. హోలీని ఎంతో హుషారుగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఉత్సాహంగా హోలీ సంబరాలు
