ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి చేయూత.
లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ గాజుల శ్రీనివాసులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి అన్ని విధాలా చేయుత నిస్తామని లయన్స్ క్లబ్ రీజినల్ – 2 చైర్మన్ గాజుల శ్రీనివాసులు అన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త, పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం మేరకు లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ లయన్ గాజుల శ్రీనివాసులు తన సొంత ఖర్చులతో దేవరకద్ర మండలం గద్దె గూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన తాగునీటి ట్యాంకు ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ యం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్, వాటర్ ట్యాంక్ దాత గాజుల శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఒక వైపు ప్రభుత్వం కృషి చేస్తుండగా మరో వైపు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించడం అభినంద నీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు లయన్స్ క్లబ్ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు విద్యార్థుల అవసరాల దృష్ట్యా గద్దె గూడెం పాఠశాలకు వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన తాగు నీటి ట్యాంక్ ను ఉచితంగా
బహూకరించినట్లు శ్రీనివాసులు తెలిపారు.
లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం.
అశ్విని చంద్రశేఖర్.
మహబూబ్ నగర్ జిల్లా పేదల సంక్షేమానికి లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంస నీయమని పిఆర్టియు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషి తో పాటు లయన్స్ క్లబ్ లు, రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల కు తమ వంతు సహకారం అందించడం అభినంద నీయమని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ క్విస్ట్ చైర్మన్ లయన్ ఎ.శ్రీహరి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని విధాలా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సహకారం లయన్స్ క్లబ్ ద్వారా అందిస్తామని చెప్పారు. పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ గిరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ అధ్యక్షులు లయన్ గోపాల కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఆట వస్తువులు అందిస్తానని విద్యార్థుల హర్ష ధ్వనుల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ యం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు మన్సూర్, జగదీష్, శారద, అనురాధ, స్నేహాలత, ఇందిరా, ఎస్ యం సి మాజీ చైర్మన్ లక్ష్మయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.