
కొండా దంపతుల సమక్షంలో, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆరెళ్లి రవి
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మహేష్ గౌడ్
నా ఇంటికి తిరిగి వచ్చినట్టు ఉన్నది, పార్టీ పటిష్టతకు కృషి చేస్తా _ __రవి గౌడ్
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పు నియోజకవర్గం, ఉర్సు కరీమాబాద్ కు చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆరెళ్లి రవి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత, రాష్ట్ర దేవాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిదర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆయనకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవి గౌడ్ తొలుత కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య నాయకత్వంలో పార్టీ కోసం విశేషంగా పనిచేశారు. 2018ఎన్నికల్లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రోద్భలం మేరకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తదనంతర కాలంలో ప్రదీప్ రావు బీజేపీలో చేరినా, ఆరెళ్లి రవి మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగారు. అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేంధర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. పార్టీ సభలు, సమావేశాల నిర్వహణలో కీలక భూమిక పోషించారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పరాజయం పాలై, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్శితుడైన రవి తన మాతృపార్టీ అయిన కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్నారు. కొండా దంపతుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరారు. సీనియర్ నాయకుడిగా రవి రైల్వేగేట్ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించలేకపోయారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తాను ముందునుండి కాంగ్రెస్ వాదినేనని తెలిపారు. తన మాతృ పార్టీలోకి తిరిగి చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో, కొండా దంపతుల సారధ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కృషిలో తన వంతు భాగస్వామ్యం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. తనను పార్టీలో చేర్చుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిదర్ లకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తనవంతు కృషి చేస్తానన్నారు రవి గౌడ్.