శివ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలలో శివనామస్మరణతో మారు మ్రోగాయి. మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయాలలో, శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానంలో, పెద్దకోడపాక రాజరాజేశ్వర ఆలయంలో, తహరాపూర్ లోని శ్రీరామ దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మార్త రాజకుమార్, ఆరుట్ల కృష్ణమాచార్యులు, తాటిపాముల అనుదీప్ శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లు బాసాని సూర్యప్రకాష్, సామల బిక్షపతి, భక్తులు పాల్గొన్నారు.