ఊరిక్కడ.. పొలమక్కడ…మరి దారెక్కడ…?

రైతుల కష్టాలు తీరేదెప్పుడు..

రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామాజిక కార్యకర్త ..

పెద్దపల్లి జిల్లా నేటిదాత్రి:

డెబ్భై ఐదు వసంతాల స్వతంత్ర భారతావనిలో అమృత ఉత్సవాలు అంటూ మురిసిపోయాం..మనం ఎంతో అభివృద్ధి చెందామని మైమరచి పోతున్నాం. ఇవన్నీ పైపై మెరుగులే..
తరచి చూస్తే లోపాలెన్నో…
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నాడు గాంధీజీ.అయితే ఇప్పటికీ ఎన్నో మారుమూల గ్రామాలు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు.
అనేక గ్రామాల్లో సరైన రహదారులు, రవాణా సౌకర్యాలు లేవు. కనీసం నడవడానికి కూడా సరైన రహదారులు లేని గ్రామాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి.
ఇందుకు మా జీలకుంట గ్రామమే ఒక ఉదాహరణ… ఇక్కడ వ్యవసాయ భూముల్లోకి వెళ్లాలంటే రైతులు నరకం అనుభవించాల్సిందే. ఎగుడు దిగుడు దారుల్లో ప్రయాణించే రైతుల కష్టాలు దేవుడికి ఎరుక. వర్షాకాలం వచ్చిందంటే అంతే సంగతులు. ఆ గతుకుల రోడ్ల పై ప్రయాణం అంటే చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టే…ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు బోల్తా పడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు సైతం ఇక్కడ ఉన్నాయి.. ఇలాంటి పల్లెలు తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.
నగరాలు,పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.అంతే వేగంగా పల్లెలు, గ్రామాలూ అభివృద్ధి చెందడం లేదు .పల్లెలు వ్యవసాయం చేస్తేనే పట్టణాలు బతుకుతున్నాయి… 70శాతం జనాభాకి గ్రామాలే ఆలవాలం. కానీ పట్టణాల్లో ఉన్న అభివృద్ధి జాడ పల్లెల్లో కానరావడం లేదు. అభివృద్ధి అనేది ముందు గ్రామ స్థాయి నుంచే జరగాలి..అభివృద్ధి అంటే పట్టణాల్లో వేసే సుందరమైన రింగ్ రోడ్లు, హైవే లేనా? వేల కోట్ల రూపాయలు వెచ్చించి, అందమైన హైవేలను నిర్మించే ప్రభుత్వాలు, గ్రామీణ ప్రాంత రహదారులను ఎందుకు పట్టించుకోవు?
నాయకుల అలసత్వమో, గ్రామాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యము తెలియదు కానీ..
దేశం అంతరిక్షం లోకి సునాయాసంగా దూసుకెళ్లే ప్రగతి సాధించినప్పటికీ, రైతులు తమ పొలాల్లోకి సులభంగా వెళ్లలేక పోవడం దురదృష్టకరం.
కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం, నాయకులు , గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను పట్టించు కున్నట్లయితే
రైతులకి మేలు చేసిన వాళ్ళవుతారు.
రహదారులు బాగుంటేనే భారీ యంత్రాలు రైతుల పొలాల్లోకి సులభంగా చేరుకోగలుగుతాయి. తమ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లోకి తీసుకొని పోవచ్చు. సమయం, డబ్బు ఆదా అవుతుంది. భూముల రేట్లకు సైతం విలువ వస్తుంది. తద్వారా రైతు ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు.
సౌలభ్యాలు కల్పిస్తేనే రేపటి తరం వ్యవసాయాన్ని ఇష్టంగా చేయగలుగుతారు. అప్పుడే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నిజమవుతుంది. ఇప్పటికైనా నాయకులు మాటల్లో కాకుండా రైతులను ఆదుకునే నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *