`నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో కుండబద్దలు కొట్టినట్లు కారుదే జోరంటున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చిట్ చాట్.
`ఖమ్మం నుంచి ఆదిలాబాద్ దాకా గెలుపు మాదే.
`పార్లమెంటు ఎన్నికలలో కారును తట్టుకోలేరు.
`మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రజలకు దూరమైంది.
`అలవికాని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు.
`హమీలు అమలుకావని ప్రజలకు అర్థమైంది.
`పంటలు ఎండిపోతున్నాయి.
`భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి.
`బావులు, బోర్లు ఆగమౌతున్నాయి.
`కేసిఆర్ పదేళ్ళ పాలనలో చుక్క నీటి కొరత రాలేదు.
`కరంటు కటకట చూడలేదు.
`ట్రాన్స్ ఫార్మర్ కాలిన వార్త కూడా వినలేదు.
`ఎరువులకు ఇబ్బంది పడలేదు.
`రైతు సల్లగ బతికిండు.
`ఆత్మగౌరవంతో సాగుచేసిండు.
`కేసిఆర్ మీద భరోసాతో సాగును నమ్ముకున్నారు.
`వలసలు పోయిన వాళ్లు తెలంగాణ చేరుకున్నారు.
`రైతుబంధు రాలేదన్న మాట ఒక్కరి నోటి నుంచి వినలేదు.
`మూడు నెలలకే కాంగ్రెస్ కష్టాలు పెడుతోంది.
`అందుకే పార్లమెంటు ఎన్నికలలో కారే గెలవాలనుకుంటున్నారు.
`కేసిఆర్ నాయకత్వంతోనే తెలంగాణ బతుకని నమ్ముతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
కేసిఆర్ అనే పదమే తెలంగాణకు జీవం. మా నాయకుడు కేసిఆర్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. ప్రజా ఉద్యమాలను నడిపిన నాయకుడు. ప్రజలను చైతన్యం చేసిన నాయకుడు. ప్రజలను తెలంగాణ ఉద్యమ బాట పట్టించిన నాయకుడు. ప్రజలను పోరాటం చేసే దిశగా నడిపించి నాయకుడు. తాను ముందుండి తెలంగాణ ఉద్యమం చేసిన నాయకుడు. తెలంగాణ మొత్తం ఏకం చేసిన నాయకుడు. తెలంగాణసాధించిన నాయకుడు. తెలంగాణ తెచ్చి వెలుగులు నింపిన నాయకుడు. తెలంగాణను సస్యశ్యామలంచేసిన నాయకుడు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన నాయకుడు. తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన నాయకుడు. తెలంగాణను అన్నపూర్ణ చేసిన నాయకుడు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్దిచేసిన నాయకుడు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకై ఆసరా అందించిన నాయకుడు. ప్రతి ఆడపిల్లకు మేనమామై పుట్టింటి సారేలాగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసిన నాయకుడు. రైతులకు ఆర్ధిక భరోసా కల్పించిన నాయకుడు. ఏటా రైతు బంధువై రెండుసార్లు పదివేలు పంట సాయం చేసిన నాయకుడు. రైతన్నను అప్పుల నుంచి విముక్తి చేసిన నాయకుడు. ఎవరి ముందు రైతు చేయి చాచకుండా రైతు బంధు ఇచ్చి ఆత్మగౌరవం నింపిన నాయకుడు. తెలంగాణను పునరుజ్జీవం చేసిన నాయకుడు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు నిలిపిన నాయకుడు. కరంటు కష్టాలు పారద్రోలిన నాయకుడు. ఆరుగాలం శ్రమించే రైతుపంటను కళ్లాలోనే కొని, దళారులు లేని కొనుగోలు వ్యవస్ధను నిర్మానం చేసి రైతుకు అన్యాయం జరక్కుండా ఆపిన నాయకుడు. ఇంత మంచి నాయకుడు దేశంలో ఎవరూ లేరు. తెలంగాణను వెలుగుల పదేళ్లలో తెలంగాణను ఏ రాష్ట్రం అందుకోలేనంత ఎత్తున నిలబెడితే, మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభ్వుత్వం తెలంగాణను విద్వంసం చేసింది. రైతును అప్పుడే ఆగం చేస్తోంది. కరంటు కష్టాలు తెచ్చిపెడుతోంది. నిన్నటి దాకా దేశానికే అన్నం పెట్టిన తెలంగాణ రైతన్నను కాంగ్రెస్ మళ్లీ అన్నమో రామచంద్రా అనిపించే వైపు తీసుకెళుతోంది. మళ్లీ తెలంగాణలో పాత రోజులు తెచ్చేలా వుంది. పంటలు పండబెట్టి, ఎండబెట్టి, రైతును అరిగోస పెట్టేలా వుంది. అందుకే తెలంగాణ ప్రజలు నిజం చాలా తొందరగానే గ్రహించారు. కేసిఆర్‌ను పరిపాలన కాదనుకొని బాధపడుతున్నారు. అందుకే మళ్లీ తెలంగాణ ప్రజలు కేసిఆర్ మళ్లీ ఎప్పుడు వస్తాడా? మళ్లీ మంచి రోజులు తెస్తాడా? అని ఎదురుచూస్తున్నారని నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు మావే అంటున్న వద్దిరాజు అభిప్రాయలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలు ఏమరపాటుగా తీసుకున్న నిర్ణయం వారి జీవితాలను మళ్లీ ఆగం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్దాలను ప్రజలు నమ్మారు. ప్రజలు కేసిఆర్‌ను కాదని ఏ కోశాన అనుకోలేదు. కాని సహజంగా సమాజంలో మరింత మేలు జరుగుతుందన్న ఆశ వుండడం తప్పుకాదు. ప్రజల బలహీనతే కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకొని, అదికారంలోకి వచ్చింది. ఒకనాడు తెలంగాణను విద్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలు నమ్మొద్దని మా పార్టీ అధ్యక్షుడు ప్రజలు పదే పదే సూచించారు. కొత్త జనరేషన్‌కు కాంగ్రెస్ విధానాలు తెలియక, కాంగ్రెస్ చేసిన మోసాలు తెలియక, జరిగిన విధ్వంసం తెలియక కాంగ్రెస్ వైపు ఆకర్షితులు కావడం వల్ల మార్పు జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలం నాటి సమాజం ఇప్పటికీ సారు వైపే వున్నారు. అందుకే మా పార్టీని బలమైన ప్రతిపక్ష స్ధానమిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ ఏ తప్పు చేసినా వెంటనే సరిచేసే స్ధితిలో వుండేలానే బిఆర్‌ఎస్ బలమైన ప్రతిపక్ష పాత్రనిచ్చారు. అయితే మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం అన్ని వర్గాల ప్రజలకు అర్ధమైంది. కేసిఆర్ చేసిన మేలు ఎలా వుంది. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గం ఎలా వుంది అన్నది మూడు నెలల్లోలనే తేలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పది రోజుల్లోనే తేలిసిపోయింది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పది రోజలకే ప్రభుత్వం మీద ప్రజల నుంచి నిరసనలు మొదలయ్యాయి. వచ్చేపార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు గెలిచేది కారే…ఖమ్మంలోనూ ఎగిరేది గులాబీ జెండానే..గత పదేళ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలమైంది. కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే కాలువలన్నీ ఎండిపోయాయి. పొలాలు మాయమౌతున్నాయి. ఖమ్మంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన తీర్పునిచ్చేందుకు సిద్దంగా వున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కారు జోరును ఇతర ఏ పార్టీలు తట్టుకోలేవు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణలోని మెజార్టీ సీట్లు కారు గెల్చుకోబోతోంది.
పదేళ్ల కేసిఆర్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా నీటి చుక్క కొరత రాలేదు.
కారణం కేసిఆర్‌కు రైతు మీద వున్న మమకారం. తెలంగాణ ఉద్యమం చేసి, తెలంగాణ సాధించిన కేసిఆర్‌కు తెలంగాణ గోస తెలుసు. రైతు కష్టం తెలుసు. సామాన్య ప్రజల దుఖం తెలుసు. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణను సుసంపన్నం చేశాడు. అంతెందుకు మా పార్టీ అధికారంలో వున్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలతో ఉద్యోగాలు పొందిన వారికి కొత్త ప్రభుత్వం నియాకమపత్రాలు అందిస్తూ, ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా వుంటుందా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలుచేసే చేత కావడం లేక, మా ప్రభుత్వం అందించిన వాటిని చూపించుకొని ప్రచారం చేసుకుంటున్నారు. పదేళ్ల కాలంలో ఆరు దశాబ్ధాల తెలంగాణ గోసను తీర్చడం జరిగింది. గతంలో కాంగ్రెస్ చేసిన సాగు విద్వంసాన్ని ఎదిరించి, కొత్త చరిత్ర తిరగరాసిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ అంటేనే తొండలు గుడ్లు పెట్టని ప్రాంతం. అక్కడ పంటలు పండడం అంటే అసాధ్యం అని ఎద్దేవా చేసిన వారిని తెలంగాణ సస్యశ్యామలం చేసి, అన్న పూర్ణగా మార్చి తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన నాయకుడు కేసిఆర్. పదేళ్లలో ఏనాడు ఒక్క చుక్క కొరత రాలేదు. ఇప్పుడు మళ్లీ ఎందుకొచ్చింది. మూడు నెలల్లోనే కరవు ఎందుకొస్తోంది. తెలంగాణ పాలిట కాంగ్రెస్ ఐరన్‌లెగ్. కాంగ్రెస్ వుంటే వర్షాలు రావు. పంటలు పండవు. కాంగ్రెస్ అధికారంలో వున్నంత కాలం కరువు కాటకాలు రాజ్యమేలుతాయి. అన్యాయాలు అక్రమాలు ప్రజలు రాచి రంపాన పెడతాయి. కాంగ్రెస్ నాయకులు విలాసాలలో తేలియాడుతుంటారు. కుర్చీలు పట్టుకొని వేళాడుతుంటారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించరు. ప్రజాభిప్రాయం గౌరవించరు. ప్రజల మేలు కోసం పనిచేయరు. వారి జాతీయ నాయకత్వంముందు తోలు బొమ్మలాట ఆడుతుంటారు. తెలంగాణ ప్రయోజనాలను డిల్లీలో తాకట్టుపెడుతుంటారు. తెలంగాణలో చీమ చిటుక్కుమనాలన్నా, జాతీయ కాంగ్రెస్ చెబితేనే జరగాలి. ప్రజల కోసం ఏ నిర్ణయంతీసుకోవాలన్నా జాతీయ నాయకత్వం అనుమతులు కావాలి. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో వున్నా ఉత్సవ విగ్రహాలే. తెలంగాణకు నష్టం చేసేవాళ్లే. తెలంగాణను గోస పెట్టేవాళ్లే…
అందుకే పదేళ్లలో ఏ ఒక్కనాడు ఒక్క ట్రాన్స్ పార్మర్ పేలింది లేదు.
ఎక్కడా క్షణ కాలంకూడా కరంటు పోయింది లేదు. ఏకంగా సబ్‌ష్టేషన్‌లు కాలిపోయినట్లు ఒక్క వార్త లేదు. కాని కాంగ్రెస్ వచ్చిన వెంటనే కరంటు కష్టాలు మొదలయ్యాయి. కోతలు మొదలయ్యాయి. పదేళ్లలో ఏనాడు రైతు ఎరువులకు ఇబ్బంది పడిరదిలేదు. ఏనాడు ఎరువులు కోసం లైన్లో నిలబడిరది లేదు. పోలీసుల కాపలా లేదు. వారి లాఠీ చార్జి లేదు. కాని కాంగ్రెస్ రాగానే రైతులు క్యూలో నిలబడాల్సివచ్చింది. పోలీసుల అవసరం వచ్చింది. అందుకే కాంగ్రెస్ పతనం పదిరోజుల్లోనే మొదలైంది. రానున్న రోజుల్లో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోనున్నది. పార్లమెంటు ఎన్నికల్లో కారును గెలిపించాలని గట్టిపట్టుదలతో వున్నారు. తెలంగాణ గాణ వాణిని డిల్లీలో వినిపించేందుకు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కట్టడిచేసేందుకు, ప్రజలకు మేలు చేసేందుకు కారు గెలిపించాలనుకుంటున్నారు. సారుకు అ ండగా తెలంగాణసమాజం నిలవాలనుకుంటున్నారు. తెలంగాణకు సారే శ్రీరామ రక్ష అని బలంగా నమ్ముతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎంపిలు బంపర్ మెజార్టీతో గెలవనున్నారు. ఇది తధ్యం.