
మందమర్రి సిఐ శశిధర్
మందమర్రి, నేటిధాత్రి:-
సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానమని మందమర్రి సిఐ కే శశిధర్ తెలిపారు. పట్టణంలోని మేకల మండిలో రాజన్నల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆరు సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలు, కాలనీల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి, గ్రామాల్లో విధిగా, స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో దొంగతనాల పరిశోధన కొంత ఇబ్బందికరంగా ఉండేదని, ప్రస్తుతం సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో చోరీలు తగ్గుముఖం పడ్డాయన్నారు. సీసీ ఫుటేజీల ద్వారా దోషులను గుర్తించి, గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, సహకర సంఘం సభ్యులు జక్కుల శంకర్, మొగిలి కనకయ్య, జక్కుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.